పంజాబ్ లో సంక్షోభం ‘ఆప్’కి కలిసి రానుందా?

దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధికారంలో ఉంది. తొలి నుంచి సామాన్యుడి కష్టాలపై ఫోకస్ పెట్టిన కేజ్రీవాల్ ఢిల్లీవాసులను ఆకట్టుకోవడంలో విజయవంతం అయ్యారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ రాజకీయాలను ఢిల్లీ వీధుల్లో ‘చీపురు’తో ఊడ్చి పారేశారు. వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చి సత్తా ఎంటో నిరూపించారు. సామాన్యుడి పార్టీగా ఆమ్ ఆద్మీ గుర్తింపు తెచ్చుకోవడంతో ఆపార్టీకి దేశ రాజధానిలో తిరుగు లేకుండా పోతుంది. సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్ తో దూసుకెళుతున్నారు.

కేజ్రీవాల్ కు తొలి నుంచి జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉంది. దీంతో ఆయన తన పార్టీని కేవలం ఢిల్లీకే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. ఢిల్లీతోపాటు పలు రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. పంజాబ్ లోనూ ఆమ్ ఆద్మీకి మంచిపట్టు ఉంది. గతంలో ఇక్కడ మూడు ఎంపీ సీట్లతోపాటు 16 అసెంబ్లీ సీట్లను గెలుచుకున్న చరిత్ర ఆమ్ ఆద్మీకి ఉంది. అయితే నేతల మధ్య విబేధాల కారణంగా ‘ఆప్’ అందరినీ చేజార్చుకోవాల్సి వచ్చింది.

ఇక 2017 ఎన్నికల్లో ఆప్ ఇక్కడ పోటీకి దూరంగా ఉంది. త్వరలోనే పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆప్ ఇక్కడ పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈమేరకు ఇప్పటికే పంజాబ్ లో ఒకటి రెండు సర్వేలను ఆపార్టీ నిర్వహించగా సానుకూల ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడ తమ అభ్యర్థులను బరిలో దింపేందుకు ‘ఆప్’ రెడీ అవుతోంది. ఆప్ అధికారంలోకి వస్తే ప్రతీ కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించింది. దీనికి ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది.

మరోవైపు కాంగ్రెస్ లో నెలకొన్న సంక్షోభం, బీజేపీలోని గందరగోళ పరిస్థితులు ‘ఆప్’కి కలిసి వస్తాయని భావిస్తున్నారు. అలాగే శిరోమణి అకాలీదళ్ రైతులకు వ్యతిరేకంగా కేంద్రం చేసిన చట్టాలను వ్యతిరేకిస్తూ బయటికి వచ్చినా ఎన్టీయేతో కొనసాగుతోంది. దీనిని ‘ఆప్’ టార్గెట్ చేసే అవకాశం కన్పిస్తుంది. రైతులకు వ్యతిరేకంగా చట్టాలు చేయడం వల్ల బీజేపీ ఇక్కడ ఆశలను వదులుకుంది. ఇక కాంగ్రెస్ లో నెలకొన్న సంక్షోభం ఆపార్టీని రెండోసారి అధికారానికి దూరం చేసేలా కన్పిస్తున్నాయి.

ఇవన్నీ కూడా ఆ మూడు పార్టీలకు మైనస్ గా మారేలా కన్పిస్తున్నాయి. ‘ఆప్’ విషయానికొస్తే క్లీన్ ఇమేజ్ తో కన్పిస్తుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను వ్యతిరేకించే వారంతా ‘ఆప్’ వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించడంపైనే ‘ఆప్’ దృష్టిసారించింది. తద్వారా పంజాబ్లో అధికారంలోకి రావడమో లేదంటే రాజకీయ శక్తిగా ఎదగడమో చేయనుంది. మొత్తానికి పంజాబ్ లో రోజురోజుకు మారుతున్న రాజకీయ సమీకరణాలు ‘ఆప్’కు కలిసి వచ్చేలా కన్పిస్తున్నాయి. మరీ కేజ్రీవాల్ ఇక్కడ లక్కీ ఛాన్స్ కొడుతారో లేదో వేచిచూడాల్సిందే..!

-Advertisement-పంజాబ్ లో సంక్షోభం ‘ఆప్’కి కలిసి రానుందా?

Related Articles

Latest Articles