బిగ్ బాస్ హౌస్ కి శ్రీరామ్ దేవుడా!?

బిగ్ బాస్ సీజన్ 5 ఆరవ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ సోమవారం జరిగింది. చిత్రం ఏమంటే… గత ఐదు వారాలుగా నామినేషన్స్ సమయంలో ఏదో స్క్రిప్ట్ ప్రకారం నడుచుకున్నట్టుగా కంటెస్టెంట్స్ అంతా పెద్ద పెద్ద గొంతులు వేసుకుని, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని నామినేషన్స్ చేస్తున్నారు. తీరా ఆ ప్రక్రియ పూర్తి కాగానే ఎవరు, ఎవరిని ఎందుకు నామినేట్ చేయాల్సి వచ్చిందో చేతిలో చెయ్యేసో, లేదంటే చెవులు కొరికో, కాదంటే ఒంటరిగా ఓ పక్కకు తీసుకెళ్ళో వివరణ ఇచ్చేస్తున్నారు. ఒకరకంగా ఆ తర్వాత ఐదు రోజులు కలిసి టాస్క్ లో పోరాడటానికి అది మంచిదే. కానీ నామినేషన్స్ ప్రక్రియే మరీ నాటకీయంగా జరుగుతోంది. అదే సోమవారం కూడా రిపీట్ అయ్యింది.

శ్రీరామ్ ను నామినేట్ చేసిన ఆ నలుగురు!
గత వారం సీక్రెట్ నామినేషన్స్ లో షణ్ణు బలి అయ్యాడు. ఈసారి బాహాటంగా జరిగిన నామినేషన్స్ లో అతన్ని యానీ, శ్రీరామ్ నామినేట్ చేశారు. జెస్సీని సపోర్ట్ చేస్తూ విషయం తెలుసుకోకుండా కిచెన్ దగ్గరకు షణ్ముఖ్ రావడం తనకు నచ్చలేదని యాని చెబితే, షణ్ణు ని నటించవద్దని కోరి శ్రీరామ్ నామినేట్ చేశాడు. దాంతో వీరిద్దరి మధ్య మాటల యుద్దం చెలరేగింది. ఇక శ్రీరామ్ ను అతని ప్రత్యర్థి వర్గమైన నలుగురు సభ్యులూ నామినేట్ చేశారు. సిరి, జెస్సీ, షణ్ణు తో పాటు తాజాగా వారితో చేతులు కలిపిన కాజల్ కూడా ఉంది. శ్రీరామ్ ను నామినేట్ చేసిన సందర్భంలో కాజల్… అతన్ని ఇకపై స్నేహితుడిగా కూడా భావించనని, కేవలం హౌస్ మేట్ గానే చూస్తానని చెప్పింది. బిగ్ బాస్ హౌస్ లో చెల్లిగా తాను చూసిన ఏకైక వ్యక్తి కాజలే అని శ్రీరామ్ చెప్పినా, ఆ బంధం గత వారమే చెల్లిపోయిందని కాజల్ స్పష్టం చేసింది. ఈ సమయంలో శ్రీరామ్ షణ్ణుకు కొన్ని విషయాలపై వివరణ ఇస్తుంటే ‘నువ్వేమైనా బిగ్ బాస్ హౌస్ లో దేవుడివా? నువ్వు చెబితే మేం వినాలా?’ అని ఎదురు ప్రశ్నించాడు. ఇక సిరిని శ్వేత, రవి, శ్రీరామ్ నామినేట్ చేశారు. అలానే హౌస్ లో వినోదాన్ని పండించే లోబోలో విశ్వసనీయత లేదన్న కారణంతో ప్రియాంక, మానస్, షణ్ముఖ్ నామినేట్ చేశారు. ఈ సమయంలో ప్రియాంక, లోబో మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. లోబో కూడా ప్రియాంకను నామినేట్ చేయడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. అలానే ఆమె కూడా రివర్స్ లో లోబోను నామినేట్ చేసింది. సిల్లీ రీజన్స్ చూపించి తనను లోబో నామినేట్ చేయడాన్ని ఖండించింది.

విశ్వ – యానిమాస్టర్ కటీఫ్!
విశ్వ మొదటి నుండి యానీ మాస్టర్ ను అక్కా అనే సంభోదిస్తున్నాడు. అలానే ఆమె కూడా తమ్ముడిగానే విశ్వను భావిస్తోంది. దాంతో సహజంగానే యానీ మాస్టర్ దగ్గర నామినేషన్స్ కు సంబంధించి విశ్వ మాట్లాడుతూ ఉండేవాడు. అలానే నామినేషన్స్ రోజు ఉదయం కూడా వీరిద్దరూ కూర్చుని షణ్ణు టీమ్ పై చర్చ పెట్టారు. ఎవరైనా సరే సింగిల్ సింగిల్ గా చర్చించాలి తప్పితే, వేరొకరిని తమ పక్షాన మాట్లాడటానికి తీసుకురావడం కరెక్ట్ కాదనే అభిప్రాయానికి వచ్చారు. అందులో భాగంగా పందులే గుంపుగా వస్తాయని, సింహం సింగిల్ గా వస్తుందని యానీ మాస్టర్ తెలిపింది. అయితే… చిత్రంగా ఆ తర్వాత తననే విశ్వ నామినేట్‌ చేసే సరికీ ఆమె తట్టుకోలేకపోయింది. నామినేషన్స్ గురించి నిత్యం తనను సంప్రదించే విశ్వ, విశ్వాసం లేకుండా అక్కా.. అక్కా అంటూ వెన్నుపోటు పొడిచాడని యానీ మాస్టర్ ఆరోపించింది. ఇకపై తనను అక్కా అని పిలవొద్దని వార్నింగ్ ఇచ్చింది. విశ్వను యానీ మాస్టర్ తో పాటు ప్రియా, ప్రియాంక నామినేట్ చేశారు. గత రెండు రోజులుగా కెప్టెన్ ప్రియా – విశ్వకు మధ్య గొడవ జరుగుతూనే ఉంది. రేషన్ మేనేజర్ గా విశ్వ సంతృప్తికరంగా వర్క్ చేయడం లేదనేది ప్రియా ఆరోపణ. ఇప్పుడు కూడా అదే కారణంగా ఆమె విశ్వను నామినేట్ చేసింది.

ప్రియను నామినేట్ చేస్తూనే ఉంటానన్న సన్నీ!
ఈ వారం బిగ్ బాస్ ఏకంగా పదిమందిని నామినేట్ చేశారు. నామినేషన్స్ కు గురైన వారిలో రవి కూడా ఉన్నాడు. అతన్ని ఊహించినట్టుగానే సన్నీ, మానస్ నామినేట్ చేశారు. అలానే శ్వేతను సిరి, కాజల్ నామినేట్ చేశారు. ఈ సమయంలోనూ శ్వేత – కాజల్ మధ్య మాటల యుద్ధం సాగింది. ఇక సన్నీని జెస్సీ, ప్రియా నామినేట్ చేశారు. ఈ సందర్భంగానే ప్రియా – సన్నీ మధ్య వాగ్వివాదం జరిగింది. ఎంత కలుపుకుందామని చూసినా సన్నీ వైపు నుండి పాజిటివ్ రియాక్షన్ రావడం లేదని ప్రియా ఆరోపించగా, కొన్ని విషయాలను కట్ చేయాలని చూస్తున్నా ప్రియా సాగదీస్తోందంటూ సన్నీ ఆవేశ పడ్డాడు. ఇక మీదట తాను ప్రియను నామినేట్ చేస్తూనే ఉంటానని చెప్పాడు. అతని మాటలకు తాను భయపడనని, బెదరనని ప్రియా బదులిచ్చింది. జెస్సీని సన్నీ, లోబో నామినేట్ చేశారు. అతనిలో విశ్వనీయత లేదని, డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తున్నాడని విమర్శించారు. ఇక మొత్తం మీద ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్ ప్రక్రియలో అందరికీ ఓ అగ్ని పరీక్ష పెట్టాడు. నామినేట్ చేసే వాళ్ళ పేర్లను ప్రకటిస్తూ, వారి ఫోటోలను గార్డెన్ ఏరియాలో పెట్టిన మంటలో వేయమని చెప్పాడు. అందరూ ఫోటోలను అలానే మంటలో వేస్తే, ప్రియాంక మాత్రం లోబో ఫోటోను ముక్కలుగా చించి మరీ మంటల్లో వేసింది. ఆ వెంటనే అలిగి అక్కడ నుండి వాష్ రూమ్ కు వెళ్ళిపోయింది. బహుశా అందుకే కావచ్చు… ప్రియాంకను లోబో ఒక్కడే నామినేట్ చేసినా ఆమె పేరునూ బిగ్ బాస్ నామినేషన్స్ జాబితాలో చేర్చాడు. మానస్ ను రవి, కాజల్ ను శ్వేత, యానీని విశ్వ నామినేట్ చేసినా వీరిని సేవ్ చేశారు. అలానే కెప్టెన్ అయిన కారణంగా ప్రియా ఇమ్యూనిటీ పవర్ తో ఆల్ రెడీ సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయింది. మరి నామినేషన్స్ లో ఉన్న పది మందిలో ఈ వారాంతానికి బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరు బయటకు వెళతారో చూడాలి!

-Advertisement-బిగ్ బాస్ హౌస్ కి శ్రీరామ్ దేవుడా!?

Related Articles

Latest Articles