కోదండరాం చేసిన తప్పే.. ఆర్ఎస్ ప్రవీణ్ చేస్తున్నారా?

బహుజన వాదంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. రాజకీయాల్లో ఎలా ముందుకు వెళ్తారన్నది మొదటి నుంచి ఆసక్తికరంగానే ఉంది. ఆయన ముందు టీఆర్ఎస్ లో చేరతారని అనుకున్నారు. తర్వాత కాంగ్రెస్ అని కొందరు అభిప్రాయపడ్డారు. ఆయన విధానాలు చూసి.. ఎలాగూ బీజేపీలో చేరరు అనే అంతా భావించారు. కానీ.. ఏ పార్టీతో కలిసి నడవకుండా.. తన విధానంలోనే ముందుకు వెళ్లి.. బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు.

తన నిర్ణయంతో అందరికీ షాక్ ఇచ్చిన ప్రవీణ్ కుమార్.. తర్వాత ఒంటరిగా పోటీ చేస్తారా.. లేదంటే ఏ పార్టీతో అయినా పొత్తులు పెట్టుకుంటారా.. త్వరలో జరగనున్న హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలో నిలబడతారా.. తన పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెడతారా.. అన్న చర్చ ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో జోరుగానే జరుగుతోంది. ఈ విషయంలో నోటిఫికేషన్ విడుదల నాటికి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇంతలోనే.. ఆయన కాంగ్రెస్ నేత, మాల మహానాడు నాయకుడు.. అద్దంకి దయాకర్ ను కలవడం రాజకీయంగా ప్రత్యేకత సంతరించుకుంది. దాదాపు గంటకు పైగా ఇద్దరూ చర్చించుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ పీసీసీకి అధికార ప్రతినిధిగా అద్దంకి దయాకర్ వ్యవహరిస్తున్నారు. మంచి వక్త. సమకాలీన రాజకీయాలపై బాగా మాట్లాడగలరు. రేవంత్ రెడ్డి కోటరీలో ఒకరిగా పేరున్న కాంగ్రెస్ నాయకుడు.

తెలంగాణ కాంగ్రెస్ లో ఇంతటి ప్రాధాన్యత ఉన్న దయాకర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ భేటీ కావడం అంటే.. ఆయన కాంగ్రెస్ కు దగ్గర అవుతున్నట్టుగానే భావించాలా.. అని విశ్లేషకులు కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అదే జరిగితే.. గతంలో కోదండరామ్ కు ఎదురైన అనుభవాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ గుర్తు చేసుకుంటే మంచిదన్న సలహాలు సైతం వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ తో కలిసి నడవాలనుకుంటే.. కచ్చితమైన ఒప్పందాన్ని చేసుకోవాలన్న సూచనలు వెళ్తున్నాయి.

ఈ విషయంపై.. ఆర్ఎస్ ప్రవీణ్ ఎలా స్పందిస్తారు.. కాంగ్రెస్ లో చిత్తశుద్ధితో పనిచేస్తున్న అద్దంకి దయాకర్ తో ఆయన సమావేశాన్ని.. అంతా ఎలా చూడాలి.. అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Related Articles

Latest Articles

-Advertisement-