వాట్సాప్ ఆగిపోతే.. గుండె ఆగినంత పనైపోయింది?

ప్రస్తుతం మనమంతా డిజిటల్ యుగంలో ఉన్నాం. మరుగుదొడ్డి లేని ఇంట్లో కూడా స్మార్ట్ ఫోన్ ఉందని గతంలో కొన్ని సర్వేలు వెల్లడించడం ఆశ్చర్యానికి గురిచేశాయి. అంటే మనిషి మొబైల్ ఫోన్లకు ఎంతలా అడిక్ట్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు. టెక్నాలజీ రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతుండటంతో అరచేతిలోనే ప్రపంచం ఇమిడిపోతుంది. కాళ్లు కదపకుండానే అన్ని నట్టింట్లోకి వచ్చిపడుతున్నాయి. గుండుసూది నుంచి లక్షలు ఖరీదు చేసే వస్తువుల దాకా ప్రతీఒక్కటి ఆన్ లైన్లో దొరుకుతున్నాయి. ఇలా ఆర్డర్ ఇచ్చామో లేదో అలా ఇంటికి చేరిపోతున్నాయి.  దీంతో వీటికి మనిషి అట్రాక్ట్ అవుతున్నాడు.

ఇదంతా పైకి బాగానే కన్పిస్తుంది. అయితే టెక్నాలజీని అతిగా వాడటం వల్ల కూడా ప్రమాదాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈకామర్స్ సైట్స్ వచ్చాక ఖర్చు పెట్టడం ఎక్కువైంది. ఆఫర్లకు ఆకర్షితులై అవసరం లేకపోయినా వస్తువులను కొంటుండటం చూస్తూనే ఉన్నాం. డబ్బులు ఒకరిని నుంచి మరొకరికి పంపించడం సులువైంది. అదే సమయంలో ఏటీఎం పిన్ నెంబర్లు, ఓటీపీలు తస్కరణకు గురైతే ఇక అంతే అన్న దిగులు నెలకొంది. సైబర్ నేరాలు ఇటీవల కాలంలో ఎక్కువై పోయాయి. దీంతో ఒకింత భయాందోళన కూడా నెలకొంది.

మరోవైపు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా అందరూ మొబైల్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. కుటుంబ సభ్యులతో గడిపే సమయం కంటే సోషల్ మీడియాలో గడిపే సమయమే ఎక్కువగా ఉంటుంది. ఫేస్ బుక్, ట్వీటర్, వాట్సాప్, ఇన్ స్ట్రాగ్రామ్, యూట్యూబ్ వంటి వాటిని ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది వాడుతున్నారు. గుడ్ మార్నింగ్ తో మొదలు పెడితే గుడ్ నైట్ వరకు వీటిల్లోనే ఛాటింగులు చేస్తూ కాలం గడుపుతున్నారు. ఫేస్ బుక్, వాట్సాప్ లో అయితే ఒక్కొక్కరు పదేసి గ్రూపుల్లో మెంబర్లుగా ఉంటూ పిచ్చాపాటి చేస్తుంటారు.

ఇలాంటి సమయంలోనే ఫేస్ బుక్, వాట్సాప్ సేవలకు అంతరాయం కలిగింది. నిన్నటి రాత్రి 9గంటల నుంచి ఉదయం వరకు వీటి సేవల్లో అంతరాయం ఏర్పడింది. దాదాపు 7గంటలపాటు వాట్సాప్, ఫేస్ బుక్ సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. నేటి ఉదయం కల్లా వాటి సేవలు తిరిగి పునరుద్ధరించబడ్డాయి. అయితే  7గంటలు యావత్ ప్రపంచం నిలిచిపోయినట్లు కన్పించింది. ముఖ్యంగా వాట్సాప్ ఆగిపోవడంతో ఎవరికీ కూడా కాలుచేయి పని చేయలేదు. రాత్రి నుంచి మేసేజ్ లు నిలిచిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొందరు పడిపోయారు. దాదాపు అందరిలోనూ ఇదే ఫీలింగ్ కన్పించింది.

అయితే తెల్లవారే వరకు వాట్సాప్, ఫేస్ బుక్ సేవలు పునరుద్ధించబడ్డాయి. ఒక్కొక్కరి మేసేజ్ లు తిరిగి రావడం ప్రారంభమయ్యాయి. దాదాపు ఏడుగంటల ఉత్కంఠకు తెరపడటంతో హమ్మయ్యా అంటూ అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఒక్క సంఘటనతో మనిషి సోషల్ మీడియాకు ఎంతలా బానిస అయ్యాడో అందరికి తెల్సి వచ్చింది. సోషల్ మీడియా ఇచ్చిన ఝలక్ నుంచి మనిషి గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే రాబోయే రోజుల్లో ఇబ్బందులు పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతి ఎప్పుడైనా అనర్థకారకమేనని నిన్నటి సంఘటన ద్వారా మరోసారి నిరూపించింది.

-Advertisement-వాట్సాప్ ఆగిపోతే.. గుండె ఆగినంత పనైపోయింది?

Related Articles

Latest Articles