హుజురాబాద్‌లో గెల్లు వర్సెస్‌ కౌశిక్‌రెడ్డి..?

ఉపఎన్నికలో పోలింగ్‌ ముందు ఆ ఇద్దరి నేతల మధ్య వర్గపోరు బయట పడిందా? పార్టీని ఇరకాటంలో పెట్టేలా శ్రేణుల వైఖరి ఉందా? ఇంతకీ ఎవరా ఇద్దరు? ఏంటా గోల? లెట్స్‌ వాచ్‌..!

గెల్లు, కౌశిక్‌రెడ్డి మధ్య గ్యాప్‌ తగ్గలేదా?

ఉత్సాహంగా సాగుతున్న హుజురాబాద్‌ ఉపఎన్నిక ప్రచారంలో అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌.. టీఆర్ఎస్‌ నేత పాడి కౌశిక్‌రెడ్డి మధ్య ఉన్న విభేదాలు బయటపడటం పార్టీ నాయకులకు తలనొప్పిగా మారిందట. హుజురాబాద్‌లో ఉపఎన్నికను టీఆర్ఎస్‌ తరఫున మంత్రి హరీష్‌రావు పర్యవేక్షిస్తున్నారు. ప్రచారంలో ఆయన ఎక్కడికి వెళ్లితే అక్కడికి గెల్లు, పాడి వర్గాలు చేరుకుని పోటాపోటీగా నినాదాలు చేస్తున్నాయి. హుజురాబాద్‌ నియోజకవర్గంలోని వీణవంక మండలానికి చెందిన ఈ ఇద్దరు నాయకుల మధ్య పడటం లేదని చర్చ జరుగుతోంది. టికెట్‌ ఆశించి భంగపడ్డ కౌశిక్‌రెడ్డికి, గెల్లుకు మధ్య గ్యాప్‌ వచ్చిందని చెబుతున్నారు.

హరీష్‌రావు ఎదుటే గెల్లు, పాడి వర్గాల పోటాపోటీ నినాదాలు..!

కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీని చేస్తూ కేబినెట్‌లో తీర్మానం చేశారు. ఆ ఫైల్‌ గవర్నర్‌ దగ్గర పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు ఎన్నికల ప్రచార సభలో తనకు ఎదురుపడుతున్న కౌశిక్‌రెడ్డి వర్గీయులకు.. మీ అన్న ఎమ్మెల్సీ అవుతారని చెబుతున్నా.. వినడం లేదట. పైగా పార్టీలో గెల్లుకు ఇస్తున్న ప్రాధాన్యం తమ నేత కౌశిక్‌రెడ్డికి ఇవ్వడం లేదని ముఖం మీదే చెప్పేస్తున్నారట. తాజాగా ఇల్లంతకుంట మండలంలో జరిగిన టీఆర్‌ఎస్‌ ఎన్నికల సమావేశంలో మంత్రి హరీష్‌రావు ఎదుటే కౌశిక్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్‌ వర్గీయులు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. రెండు వర్గాలను శాంతిప చేయడానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చొరవ తీసుకున్నా.. ఆగలేదు.

కౌశిక్‌రెడ్డికి పార్టీ పెద్దలు క్లాస్‌ తీసుకున్నారా?

పాడి కౌశిక్‌రెడ్డి అనుచరులు అభ్యర్థి గెల్లుకు మద్దతివ్వకుండా కామ్‌గా ఉండటంపై అధిష్ఠానం క్లాస్‌ తీసుకున్నట్టు సమాచారం. కౌశిక్‌రెడ్డిని పిలిచి తలంటినట్టు తెలుస్తోంది. పార్టీ పెద్దల ముందు కౌశిక్‌రెడ్డి తలూపినా.. క్షేత్రస్థాయిలో ఆయన అనుచరుల వ్యవహారం మింగుడు పడటం లేదట. ఉపఎన్నిక ప్రచారం మొదలుపెట్టింది లగాయితు.. రెండువర్గాలపై ఒక కన్నేసి ఉంచినా.. సమయం చిక్కితే వర్గపోరుకు దిగడం గులాబీ నేతలకు అంతుచిక్కడం లేదట. ప్రచార గడువు ముగుస్తున్న సమయంలోనూ ఒకరిపై ఒకరు పైచెయ్యి సాధించేలా రోడ్డున పడటంపై చర్చ జరుగుతోంది. గులాబీ పెద్దలు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు చెబుతున్నారు. మరి.. ఈ వర్గపోరు ప్రతికూలంగా మారకుండా ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.

Related Articles

Latest Articles