ఆన్ లైన్ క్లాసుల అనర్థం దారుణంగా ఉందే?

ఈ కరోనా పాడుగానూ.. ఎప్పుడొచ్చిందో.. ఎలా వచ్చిందో కానీ.. అందరికంటే ఎక్కువగా విద్యార్థులకే నరకం చూపిస్తోంది. కరోనా లాక్ డౌన్ మొదలైంది మొదలు అన్నీ బంద్ పడ్డాయి. అయితే అన్నీ పట్టాలెక్కినా కూడా ఇంకా మొదలు కానిది ఏమన్నా ఉందా? అంటే అవి చదువులే.. ఏడాదిన్నరగా విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు దూరంగా ఆన్ లైన్ క్లాసుల వెంటపడ్డారు. కండ్లు కాయలు కాసేలా కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ ల ముందు గంటల తరబడి కూర్చుంటున్న పరిస్థితులున్నాయి. ప్రస్తుతం పెద్ద తరగతుల విద్యార్థులకు క్లాసులు స్టార్ అయినా 10వ తరగతిలోపు వారికి ఇప్పటికీ అన్ని రాష్ట్రాల్లో మొదలు కాలేదు. కరోనా థర్డ్ వేవ్ భయాల మధ్య మళ్లీ వాయిదా పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.. ఇంతకీ ఆఫ్ లైన్ క్లాసులు బెస్ట్ నా? ఆన్ లైన్ క్లాసులు బెస్టా? ఓ సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

పైన పటారం.. లోనలోటారం అన్నట్లుగా ఆన్ లైన్ క్లాసుల తీరు ఉందనే విమర్శలు కొద్దిరోజులుగా తల్లిదండ్రుల నుంచి విన్పిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే ఆన్ లైన్ క్లాసుల తీరుపై ఓ సర్వే సంస్థ ఇచ్చిన రిపోర్టు దీనిని బట్టబయలు చేస్తోంది. కరోనా కారణంగా విద్యావ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైన సంగతి అందరికీ తెల్సిందే. దీంతో ప్రత్యామ్నాయ మార్గంగా ఆన్ లైన్ బోధన తెరపైకి వచ్చింది. ఈ ఆన్ లైన్ బోధన ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది మాత్రం కరోనా సమయంలోనే. అయితే ఆన్ లైన్ క్లాసుల ప్రభావం విద్యార్థులపై ఎలా ఉందని ఇటీవల ఓ సంస్థ సర్వే నిర్వహించింది. దీనిలో అందరూ విస్తూపోయే నిజాలు వెల్లడికావడంతో అందరూ అవాక్కవుతున్నారు.

కరోనా కారణంగా బడులన్నీ మూసివేయడంతో పాఠశాలలన్నీ విద్యార్థులకు ఆన్ లైన్లో బోధనలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రత్యక్ష పద్ధతిలో బోధనలు చేస్తున్నారు. కాగా మెజార్టీ రాష్ట్రాలు మాత్రం విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా ఆన్ లైన్ క్లాసులకు మొగ్గుచూపుతున్నారు. దీంతో గతేడాది కాలంలో విద్యాబోధన మొత్తం ఆన్ లైన్లో జరుగుతోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న తరుణంలో కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలను తిరిగి తెరుస్తున్నారు. ఈక్రమంలోనే ఆయా రాష్ట్రాల్లో విద్యా వాలంటీర్లు ఆన్ లైన్ బోధనపై ఓ సర్వే నిర్వహించారు.

దేశంలోని 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆగస్టు నెలలో ఈ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆ సర్వే సంస్థ ప్రకటించిన వివరాలిలా ఉన్నాయి. ఆన్ లైన్లో తరగతులు నిర్వహించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో 37శాతం మంది విద్యార్థులు అస్సలు చదువుకోవడం లేదని తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 8 శాతం మంది విద్యార్థులు మాత్రమే ప్రతిరోజు ఆన్ లైన్ లో చదువుకుంటున్నారట. దీనికితోడు పదాలు సైతం మొత్తం విద్యార్థులు మరిచిపోతున్నారట. చాలామంది విద్యార్థులు రాయడం, చదవడం మరిచిపోతున్నారనే విషయాలు వెలుగు చూడటంతో అందరూ విస్తుపోతున్నారు.

మరోవైపు విద్యార్థులు చదువుతున్నారా? లేదా అనే విషయాలను ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. వాట్సాప్ లో లింకులు షేర్ చేస్తూ టీచర్లు దులుపుకుంటున్నారని తెల్సింది. దీంతో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్య ఉండాల్సిన బాండింగ్ దూరమవుతుందట. అలాగే మధ్యాహ్న భోజన పథకం అటకెక్కడంతో విద్యార్థులకు పౌష్టికాహారం కరువవుతోంది. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను పంపేందుకు..చదివించేందుకు పేద తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదట. ఆన్ లైన్ బోధన అనేది మంచి కంటే చెడు ఫలితాలే ఎక్కువగా ఇస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆన్ లైన్ చదువులతో ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా మారిందనే టాక్ విన్పిస్తోంది.

Related Articles

Latest Articles

-Advertisement-