ఉమ్మడి నల్లగొండజిల్లా టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలలో గుబులు..!

మాజీ మంత్రి చేరిక.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలలో గుబులు రేపుతోందా? ఆయన రాజకీయ భవిష్యత్‌పై ఇంకా క్లారిటీ లేకపోయినా.. ఎమ్మెల్యేలు ఎందుకు టెన్షన్‌ పడుతున్నారు? కలవర పడుతున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు?

మోత్కుపల్లి చేరికతో.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలలో గుబులు..!

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు గులాబీ కండువా కప్పుకొన్న తర్వాత.. ఆ చేరిక ప్రకంపనలు ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలలో కనిపిస్తున్నాయి. పైకి ఎవరూ చెప్పకపోయినా.. కొందరు ఎమ్మెల్యేలు తమకేమైనా గండం పొంచి ఉందా అని ఆరా తీస్తున్నారట. మోత్కుపల్లి తనకు అత్యంత సన్నిహితమని.. ఇద్దరం కలిసి చాలా ఏళ్లు కలిసి పనిచేశామని సీఎం కేసీఆర్‌ చెప్పడంతో.. ఆ మాటల ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఎలా ఉంటుందో తెలియక దిగులు చెందుతున్నారట ఎమ్మెల్యేలు.

సీఎం కేసీఆర్‌ యాదాద్రి పర్యటనలో మోత్కుపల్లికి ప్రాధాన్యం..!

మోత్కుపల్లి గతంలో ఆలేరు, తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీని వీడి బీజేపీలో చేరారు. అక్కడ కుదురుకోలేదు. దళితబంధు బ్యాక్‌డ్రాప్‌లో కాషాయాన్ని వీడి.. గులాబీ శిబిరానికి దగ్గరయ్యారు. సీఎం కేసీఆర్‌పై పొగడ్తల వర్షం కురిపించారు ఈ మాజీ మంత్రి. ఇప్పుడు మోత్కుపల్లికి టీఆర్‌ఎస్‌లో ఇచ్చే ప్రాధాన్యంపై ఆసక్తి నెలకొంది. కండువా కప్పిన మరుసటి రోజే సీఎం కేసీఆర్‌ యాదాద్రి పర్యటనలో మోత్కుపల్లి ఆయన పక్కనే కనిపించారు. ఆ దృశ్యాలు చూశాక ఎమ్మెల్యేలకు ఇంకా టెన్షన్‌ పెరిగిందట.

ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్‌ నియోజకవర్గాల్లో ఒక్కటే చర్చ..!

దళితబంధు కార్పొరేషన్‌కు మోత్కుపల్లిని ఛైర్మన్‌ను చేస్తారో లేక ఎమ్మెల్సీని చేస్తారో క్లారిటీ లేదుకానీ.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటే.. పరిస్థితి ఏంటన్న చర్చ అయితే మొదలైంది. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్‌ నియోజకవర్గాలు తుంగతుర్తి, నకిరేకల్‌ ఉన్నాయి. ఆలేరు జనరల్‌ స్థానం. వీటిల్లో ఏదోఒకటి మోత్కుపల్లికి కేటాయిస్తే తమ పరిస్థితి ఏంటని మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆంతరంగిక సమావేశాల్లో చర్చిస్తున్నారట. అంత సీన్‌ లేదన్నది మరికొందరి వాదన. నామినేటెడ్‌ పదవి కట్టబెట్టి దాని వరకే మోత్కుపల్లిని పరిమితం చేస్తారని చెబుతున్నారట. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అందుకే ముందుగానే ఒక అంచనాకు రాకుండా.. తమ కాళ్ల కిందకు నీళ్లొచ్చే ఛాన్స్‌ ఏదైనా ఉందా అని తెలిసిన వారి దగ్గర ఆరా తీస్తున్నారట ఎమ్మెల్యేలు. మరి.. ఏం జరుగుతుందో కాలమే చెప్పాలి.

Related Articles

Latest Articles