మంత్రి కావాలన్న గుత్తా సుఖేందర్‌రెడ్డి కల కలేనా…?

మంత్రి కావాలన్న ఆ సీనియర్‌ నేత కల కలేనా? ఇప్పట్లో ఆ యోగం లేనట్టేనా? రెండోసారి శాసనమండలిలో అడుగుపెట్టబోతున్న ఆయనకు పాత పదవే మళ్లీ కట్టబెడతారా? దానికి ఆ సీనియర్ ఒప్పుకొంటారా?

గుత్తాకు ఇచ్చే కొత్త పదవిపై చర్చ..!

తెలంగాణ శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు గుత్తా సుఖేందర్‌రెడ్డి. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్‌కు ఆ తర్వాత టీఆర్ఎస్‌కు వచ్చారు. గులాబీ కండువా కప్పుకొన్న సమయంలో గుత్తాను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. ఆ మేరకు ఆయనకు హామీ లభించిందని అనుకున్నారు. ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్సీని చేయడంతో గుత్తాకు కట్టబెట్టే పదవిపై ఊహాగానాలు.. చర్చలు మొదలయ్యాయి.

అభ్యంతరాలు వచ్చినా రెండోసారి ఎమ్మెల్సీని చేశారు..!

ఎమ్మెల్సీగా మొదటి టర్మ్‌లో శాసనమండలి ఛైర్మన్‌గా ఉన్నారు గుత్తా సుఖేందర్‌రెడ్డి. ఆ పదవిలో ఉండగానే.. ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసింది. మరోసారి శాసనమండలికి పంపుతారా? మంత్రివర్గంలో చోటు దక్కుతుందా అని ఇన్నాళ్లూ చర్చ సాగింది. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఆయన్ని ఎమ్మెల్సీని చేశారు గులాబీ బాస్‌. అయితే గుత్తాకు మళ్లీ ఛాన్స్‌ రాకుండా జిల్లాకు చెందిన కొందరు నేతలు పావులు కదిపినట్టు గుసగుసలు వినిపించాయి. ఆ అభ్యంతరాలను సీఎం కేసీఆర్‌ పట్టించుకోలేదని టాక్‌. ఆయన్ని ఎమ్మెల్సీని చేసి అనుమానాలను పటాపంచలు చేశారు.

ఖాళీగానే ఉన్న మండలి ఛైర్మన్‌ పదవి..!

చట్టసభలోకి మరోసారి అడుగుపెడుతున్న గుత్తా సుఖేందర్‌రెడ్డికి.. ఈసారైనా కేబినెట్‌లో చోటు దక్కుతుందా? ప్రస్తుతం మంత్రివర్గంలో ఒక స్థానం ఖాళీగా ఉంది. ఆ ప్లేస్‌ను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తే గుత్తా పేరును పరిశీలిస్తారా? అలాగే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సామాజికవర్గాలు.. ఇతర సమీకరణాలు ఈ సీనియర్‌ పొలిటీషియన్‌కు కలిసి వస్తుందా అన్నది ఒక ప్రశ్న. కేబినెట్‌ సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌ పదవులు సైతం ఖాళీగా ఉన్నాయి. వీటిని కూడా త్వరలో భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఖాళీలవల్లే గుత్తాకు లభించే పదవులు.. ఆయన ఆశలపై కొత్త చర్చ మొదలైంది.

మంత్రి పదవి కాకుండా.. మరోసారి మండలి ఛైర్మన్‌ను చేస్తారా?

ఇప్పుడున్న పరిస్థితుల్లో శాసనమండలిలో సుదీర్ఘ రాజకీయ అనుభవం గుత్తాకు మాత్రమే ఉందన్నది పార్టీ వర్గాల టాక్‌. అందుకే ఆయన్ను మరోసారి శాసనమండలి ఛైర్మన్‌ను చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లూ తమ నేతకు కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఆశించిన గుత్తా అనుచరులు.. తమ నేతకు లభించే పదవిపై లెక్కలేసుకుంటున్నారట. ఇప్పటికిప్పుడు మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉండకపోవచ్చు అని చెబుతున్నారు. అందుకే శాసనమండలి ఛైర్మన్‌ను చేస్తారని అనుకుంటున్నారట. దాంతో మంత్రి కావాలన్న ఆయన కోరిక తీరడానికి మరికొంత సమయం వేచి చూడాక తప్పదేమో..!

Related Articles

Latest Articles