హుజూరాబాద్ బై ఎలక్షన్.. అసలు విషయం పక్కకు పోయిందా…?

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక సాక్షిగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కురుక్షేత్రాన్ని తలపించేలా పోటీపడుతున్నారు. ఎవరికీ వారు తగ్గెదేలా అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో హుజూరాబాద్ ఓటర్లు ఎవరి వైపు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రచారంలో దూసుకెళుతుండగా కాంగ్రెస్ మాత్రం కొంచెం వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రధాన పార్టీలు చేస్తున్న ప్రచారంపై స్థానిక ఓటర్లు మాత్రం పెదవి విరుస్తున్నారనే టాక్ విన్పిస్తోంది. 

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయనపై భూకబ్జా ఆరోపణలు రావడంతో సీఎం కేసీఆర్ ఆయనను మంత్రి పదవీ నుంచి తప్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన తన ఎమ్మెల్యే పదవీ రాజీనామా చేసి తన చిత్తశుద్ధిని నిరూపించేందుకు పోటీకి దిగారు. దీంతో ఈ ఉప ఎన్నిక కాస్తా ఈటల వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా మారింది. ఈ ఉప ఎన్నిక ప్రభావం వచ్చే ఎన్నికలపై పడే అవకాశం ఉండటంతో సీఎం కేసీఆర్ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 

ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుంచే హుజూరాబాద్‌లో రాజకీయవేడి మొదలైంది. గత ఐదునెలలుగా టీఆర్ఎస్, బీజేపీలు ప్రచారం చేస్తున్నాయి. ఈనెలలోనే హుజూరాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రావడంతో నేతలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ప్రధాన పార్టీలన్నీ రంగంలోకి దిగి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీనిలో భాగంగానే ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతున్నారు. రాష్ట్ర, జాతీయ సమస్యలపై స్పందిస్తున్నారు. ఇక్కడే అసలు విషయం సైడ్ అయిపోతుందనే అభిప్రాయాన్ని స్థానిక ఓటర్లు వ్యక్తం చేస్తున్నారు. 

ఈటల స్వార్థంతోనే హుజూరాబాద్ లో ఉప ఎన్నిక వచ్చిందని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. దీనికి కౌంటర్ గా బీజేపీ సైతం కేసీఆర్ అహంకారం వల్లే ఎన్నికలు వచ్చాయని విమర్శలకు దిగుతున్నారు. ఈ రెండు పార్టీలు దొందు దొందే అంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. అయితే స్థానిక సమస్యలను ఏ పార్టీ కూడా ప్రస్తావించకపోవడం విడ్డూరంగా మారింది. స్థానిక సమస్యలు కాకుండా వ్యక్తిగత, రాష్ట్ర, జాతీయ సమస్యలను హుజూరాబాద్‌లో ప్రస్తావించడంపై ఓటర్లు మండిపడుతోన్నారు. 

గత ఐదునెలలు హుజూరాబాద్‌లో నేతల ప్రచారం ఇలానే సాగుతోంది. నియోజకవర్గంలోని సమస్యలు ఏంటీ?  ప్రజల సంక్షేమం కోసం ఏం చేయబోతున్నాం? అనే అంశాలపై ఏ పార్టీ కూడా మెనిఫెస్టో విడుదల చేయడం లేదని తెలుస్తోంది. స్థానిక యువత, నిరుద్యోగులకు ఉపాధి కల్పనపై ఏ పార్టీ కూడా హామీలు ఇవ్వడం లేదు. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలకు వేదికగా మారిందనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఇప్పటికైనా నేతలు తమ తీరు మార్చుకొని స్థానిక సమస్యలను ప్రస్తావిస్తారో లేదంటే ఇదే ట్రెండ్ ను కొనసాగిస్తారో వేచిచూడాల్సిందే..!

-Advertisement-హుజూరాబాద్ బై ఎలక్షన్.. అసలు విషయం పక్కకు పోయిందా...?

Related Articles

Latest Articles