వరంగల్ కు కేసీఆర్ న్యాయం చేస్తున్నారా…?

ఆ జిల్లాల నుండి ఒకరు ఇద్దరు కాదు.. ఎనిమిదిమంది ఎమ్మెల్సీలు…మండలిలో వరంగల్లు జిల్లాకు ఎక్కువ ప్రాధాన్యత దక్కిందా?తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వరంగల్లుకు కెసీఆర్‌ న్యాయం చేస్తున్నారా?శాసన మండలిలో వరంగల్ జిల్లా ఆధిపత్యం కనిపించనుందా?

మండలిలో తెలంగాణలో ఏ ఇతర జిల్లాకు రానంత ప్రాధాన్యం వరంగల్ జిల్లాకు వచ్చిందా..?అవుననే టాక్‌ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఎంఎల్సీ పదవుల్లో సింహభాగం ఓరుగల్లుకే దక్కాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ఎమ్మెల్సీలున్న జిల్లాగా వరంగల్ జిల్లాకు గుర్తింపొచ్చింది. ఒక్కరు.. ఇద్దరు కాదు ఏకంగా 8 మందికి వరంగల్ నుంచి ఎమ్మెల్సీలు గా అవకాశం ఇచ్చారు గులాబీ అధినేత.

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న వరంగల్ జిల్లా టిఆర్ఎస్ నేతలకు పదవుల పంట పండుతోంది. ప్రతి సందర్భంలోనూ సీఎం కేసీఆర్ వరంగల్‌ జిల్లా నేతలకు అవకాశాలు ఇస్తుండగా తాజాగా ఎమ్మెల్సీ ఎంపికలోనూ వరంగల్‌ ఉమ్మడి జిల్లాకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే అందులో, వరంగల్‌ ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురికి అవకాశం కల్పించారు.

మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావు ఎమ్మెల్సీగా అవకాశం పొందారు. సోమవారం ఈ ముగ్గురు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. అలాగే టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి ప్రభుత్వ నామినేటెడ్‌ కోటాలో ఎమ్మెల్సీ కానున్నారు. ఇక స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ స్థానానికి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్ది నామినేషన్ వేశారు. పూర్తి ఆధిక్యంలో ఉన్న టిఆర్ఎస్ అభ్యర్థి గా ఉన్న పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గెలుపు లాంఛనమే..

కొత్తగా అవకాశం పొందిన ఈ నలుగురితో పాటు ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే మరో ముగ్గురు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఉన్న సత్యవతి రాథోడ్‌, బస్వరాజు సారయ్య ఎమ్మెల్యే కోటాలోనే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ తరుపున పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ ఏడాది ఎన్నికయ్యారు. మూడు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం వహించే పల్లా రాజేశ్వర్‌రెడ్డి వరంగల్‌ ఉమ్మడి జిల్లాకు చెందినవారే. తాజాగా ఎన్నికవుతున్న వారితో కలిపి వరంగల్‌ ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్సీలుగా ఉండనున్నారు. దీంతో శాసన మండలిలో వరంగల్ జిల్లా ఆధిపత్యం కనిపిస్తోందనే టాక్‌ ఉంది.

వరంగల్ జిల్లా నుండి ఎక్కువ మంది రాజకీయ పదవులు పొందడం వెనుక కేసీఆర్ టిఆర్ఎస్ కార్యకర్తలకు ఒక సందేశం ఇచ్చేలా చేశారని స్థానిక నేతలు చెబుతున్నారు. పార్టీ పైనా అధిష్టానం పైన నమ్మకం తో ఉండి సిన్సియర్ గా పని చేస్తే పదవులు వస్తాయనేదానికి …ఒకేసారి ఇంత మందికి ఈ ఎమ్మెల్సీ అవకాశం కల్పించడమే ఉదాహరణగా చెబుతున్నారు. ఏది ఏమైనా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న వరంగల్ కి మాత్రం అధిక ప్రాధాన్యత ఇవ్వడం వెనక కేసీఆర్ ముందు చూనే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..

Related Articles

Latest Articles