చట్టాల రద్దు యూపీ, పంజాబ్‌ కోసమేనా?

గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్రం వ్యవసాయ సంస్కరణలు చేపట్టింది. అందులో భాగంగా మూడు నూతన చట్టాలను ఆమోదించింది. దేశ వ్యాప్తంగా రైతు సంఘాలు వీటిని వ్యతిరేకించాయి. మొదట పంజాబ్‌, హర్యానా రైతులు ఆందోళనలకు దిగారు. కానీ, కేంద్రంలోని మోడీ సర్కార్‌ ఏ మాత్రం పట్టించుకోలేదు. ప్రతిపక్షాల మాటనూ బేఖాతరు చేసింది. దాంతో ఉద్యమ వేదిక ఢిల్లీకి మారింది.

2020, నవంబర్ 26న రైతు ఆందోళన కొత్త మలుపు తిరిగింది. పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ నుంచి వేలాదిగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనకు దిగారు. ఐతే, ప్రభుత్వ బలగాలు ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపాయి. ఐనా ఆన్నదాతలు తట్టుకుని నిలిచారు. నేటికీ ఆందోళన కొనసాగుతూనే ఉంది. చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఆందోళన ఆగదని రైతు నేతలు తెగేసి చెప్పారు. ఏడాది కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లోనే టెంట్లు వేసుకుని నిరసన కొనసాగిస్తున్నారు.

రైతు ఆందోళనలు తీవ్రరూపం దాల్చటంతో గత సంవత్సరం అక్టోబర్ 14న తొలిసారి ప్రభుత్వం రైతులను చర్చలకు ఆహ్వానించింది. కాని అవి ఫలించలేదు. తరువాత 2020 నవంబర్‌లో మరోసారి రైతు నేతలతో చర్చించారు. కానీ, ప్రభుత్వం కనీస మద్దతు ధరకు గ్యారంటీ ఇవ్వకపోవటంతో చర్చలు ఫలించలేదు. తరువాత డిసెంబర్లో పలు మార్లు చర్చలు జరిగాయి. హోం మంత్రి అమిత్‌ షా చర్చల్లో పాల్గొని పలు ప్రతిపాదనలను రైతుల ముందు పెట్టారు. కానీ ఏదీ వారిని సంతృప్తి పరచలేకపోయింది. కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలన్న డిమాండ్‌ను వారు వదులుకోలేదు. పలితంగా నిరసనలు కొనసాగుతూ వచ్చాయి.

ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ అనూహ్యంగా నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. రైతులకు క్షమాపణ కూడా చెప్పారు. అన్నదాత సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దీనిపై ప్రకటన చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. మరోవైపు, ప్రధాని మోడీ చెప్పిన ఆ రోజు వరకూ వేచిచూస్తామని రైతు ఉద్యమ సారధి రాకేశ్ టికాయత్ దీనిపై స్పందించారు. ఐతే, పార్లమెంటులో నూతన చట్టాల రద్దు ప్రక్రియ పూర్తయ్యేవరకు ఆందోళన కొనసాగుతుందని ప్రకటించారు. ఎంఎస్‌పీతో పాటు రైతుల ఇతర సమస్యలపైనా ప్రభుత్వం చర్చించాలన్నారాయన. దీనిని బట్టి రైతు ఆందోళనలకు ప్రధాని ప్రకటన తెరదించలేదని స్పష్టంగా అర్థమవుతోంది.

రైతు నేతలతో పాటు ఉద్యమానికి మొదటి నుంచి మద్దతు తెలిపిన వివిధ ప్రతిపక్ష నేతలు ట్విట్టర్ వేదికగా స్పందించారు. అహంకారం ముక్కలైపోయింది.. నా దేశ రైతు గెలిచాడంటూ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఇది అన్యాయంపై రైతు విజయమని రాహుల్‌ అభినందించారు. గురు నానక్ పుట్టిన నాడు మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై పంజాబ్ మాజీ సీఎం హర్షం కెప్టెన్ అమరీందర్ సింగ్ హర్షం వ్యక్తంచేశారు. చట్టాల రద్దు మినహా మోదీకి వేరే దారి లేకుండా పోయిందని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వ్యంగ్యాస్త్రం సంధించారు.

నూతన రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని స్వయంగా ప్రకటించినా రైతు నేతలకు నమ్మకం కుదిరినట్టు లేదు. రాకేష్‌ టికైత్‌ ప్రకటనను బట్టి చూస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది. నిజానికి ప్రధాన మోడీ తన ప్రకటనలో ఎక్కడా నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు మంచిది కాదని చెప్పలేదు. ఈ చట్టాల విషయంలో రైతుల అపోహలను తొలగించాలని ఎంతో ప్రయత్నించామని ..కానీ వారు వినలేదు. అందుకే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రధాని చెప్పటం ఆలోచింపచేస్తోంది.

నిన్న మొన్నటి వరకు కేంద్ర మంత్రలు ఏం చెప్పారు? మెజార్టీ రైతులు చట్టాలకు ఒప్పుకున్నారు కేవలం కొద్ది మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారని పదే పదే ఢంకా భజాయించారు. అసలు ఆందోళనలు చేస్తున్నవారు రైతులే కాదన్నారు. రైతుల వేశంలో సంఘ విద్రోహ శక్తులు చేరారని..ప్రతిపక్షాలు కావాలని వారిని ఎంకరేజ్‌ చేశారన్నారు. ఇలా చాలా చాలా అన్నారు. రైతుల ఆందోలన నేపథ్యంలో చట్టాలను సస్పెన్షన్‌ లో పెట్టమని సుప్రీంకోర్టు చెప్పినా వినలేదు మోడీ సర్కార్‌. దాంతో సుప్రీంకోర్టు స్వయంగా కొన్నాళ్ల పాటు వాటిని సస్పెండ్‌ చేసింది. అంత మొండిగా వ్యవహరించిన వారు ఉన్నట్టుండి ఈ అనూహ్య నిర్ణయం వెనక మర్మం ఏమిటి? అనే అనుమానం ఎవరికైనా కలుగుతుంది.

నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కితీసుకుంటూ ప్రధాని మోడీ చేసిన ప్రకటన ఉద్యమాల చరిత్రలో మైలురాయి వంటిది. ప్రజా సమీకరణతో ప్రభుత్వాలు దిగివస్తాయనటానికి ఈ రైతు ఆందోళన ఒక ఉదాహరణ. ఐతే, ఏ ప్రభుత్వమూ తమకు రాజకీయ ప్రయోజనం లేకుండా ఏ నిర్ణయం తీసుకోదు. మరి మోడీ ఇప్పుడే ఎందుకు వీటిని రద్దు చేసినట్టు? దీనికి సమాధానం చాలా సింపుల్‌ అంటున్నారు విశ్లేషకులు.

వచ్చే ఏడాది మొదట్లో ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌ సహా మరో మూడు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ గెలవాలంటే ఈ చట్టాలు అడ్డు కాకూడదు. అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారని రైతు నాయకులు అనుమానిస్తున్నారు.ఎన్నికల కోసం రద్దు చేస్తున్న ఈ చట్టాలు ఎన్నికల తరువాత మరో రూపంలో రావన్న గ్యారంటీ ఏమిటి? అలా వచ్చే ప్రమాదం ఉందని వారి భయం. ఈ చట్టాలు రైతు ప్రయోజనాలను ఎలా దెబ్బతీస్తాయో చెపుతూ మోడీ ప్రకటన చేసి ఉంటే రైతులకు ఏ అనుమానం ఉండేది కాదన్నది పరిశీలకుల అభిప్రాయం. కానీ మోడీ అలా చేయలేదు. ఇవి రైతు ప్రయోజనాలను ఉద్దేశించనవే అని చెపుతూ కేవలం రైతులు వద్దంటున్నారు కాబట్టి రద్దు చేస్తున్నామని చెప్పటమే అనుమానాలకు తావిస్తోంది. చట్టాలు తప్పని ప్రభుత్వం అనటం లేదు.. మంచివనే అంటోందని మరిచిపోవద్దు.

ప్రధాని ప్రకటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందన ఆసక్తిని కలిగిస్తోంది. పంజాబ్, ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో మోదీకి మరో దారి లేకుండా పోయిందని అసదుద్దీన్‌ అన్నారు. ఆలోచిస్తే. నిజంగా మోడీ నిర్ణయం వెనక కారణం ఇదేనా అనిపిస్తుంది. వచ్చే ఏడాది పంజాబ్, ఉత్తరప్రదేశ్ తో సహా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ఈ ప్రకటన ఇవ్వాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.

ఇటీవల పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన లఖింపూర్ ఖేరీ ఘటన మొత్తం కథనే మార్చినట్టు కనిపిస్తోంది. రైతు ఆందోళనల గురించి రాష్ట్రం మొత్తం చర్చించుకునేలా చేసింది. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంతో ఇది ఇప్పట్లో సమసిపోయేలా లేదు. ఇది ఎన్నికల సమయం కాకపోయి వుంటే బీజేపీ దీనిని పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ ఇప్పుడు గ్రామం గ్రామంలో పెద్దఎత్తున ఆందోళన స్వరం ప్రతిధ్వనించటంతో బీజేపీ ఎప్పటిలా కూల్‌గా ఉండలేకపోయింది. ఇది ఇలాగే సాగితే 2014 నుండి బీజేపీకి వెన్నెముకగా నిలిచిన జాట్లు, చిన్న, సన్నకారు రైతులు దూరమవుతారని భయపడి ఉండవచ్చు. కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీ అమలుకు వారు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

వ్యవసాయ చట్టాలు అమలు చేసినంత కాలం బీజేపీ పశ్చిమ యుపి ప్రాంతంలో రైతు వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది తమ పతనానికి ఆరంభమని బీజేపీ భయం. ప్రస్తుతం సాగుతున్న రైతు ఆందోళనలో జాట్లు ముందుంటడమే దాని భయాలకు కారణం గత మూడు దశాబ్దాలుగా వీరు బీజేపీకి అండగా ఉన్నారు. ఇక్కడ గనుక వారి ఓట్లు కోల్పోతే మొత్తం లెక్క తలకిందులవుతుంది. పోనీ, జాట్లు, ఏబీసీ రైతుల మధ్య కుల విభజనతో ఈక్వేషన్‌ బ్యాలెన్స్‌ చేసే వ్యూహం కూడా బీజేపీకి ఉంది. ఐనా, జాట్లను దూరం చేసుకునే సాహసం చేయలేకపోతోంది.

సామాజికంగా చైతన్యవంతమైన యుపిలో ఏ ఒక్క అంశాన్ని విడిగా చూడలేము. అవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. రైతు ఉద్యమ నేత రాకేష్‌ టికైత్‌కు చౌదరి జయంత్ సింగ్ మద్దతిచ్చారు. దాంతో ఆయన నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌దళ్‌- ఆర్‌ఎల్డీ బలం పుంజుకుంటోంది. పైగా, వచ్చే ఎన్నికల్లో అది సమాజ్ వాదీ పార్టీతో జతకట్టే అవకాశం చాలా ఉంది. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తరచూ రైతు సమస్యలపై గళమెత్తుతున్నారు. కేంద్రం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ధ్వజమెత్తుతున్నారు. ఇది బీజేపీ కలవరపెడుతోంది. యూపీ ఎన్నికల రాజకీయాల్లో రైతులే కీలకం అనే సంగతి కమళనాథులకు తెలియంది కాదు.

కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయకుంటే బీజేపీకి పెద్దగా నష్టం వచ్చేదా? అంటే అవుననే సమాధానం వస్తుంది. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ఆ పార్టీ హిందుత్వ నినాదం, వాటికి తోడు ప్రధాని మోడీ జనాకర్షణ. ఇవన్నీ బీజేపీకి బలం. కానీ వాటిని వ్యవసాయ సమస్యలు నీడలా వెంటాడే అవకాశాలను ఆ పార్టీ తోసిపుచ్చలేకపోయింది. మోడీ ఇమేజీ, హిందుత్వం సిద్ధాంతాల కంటే అఖిలేష్‌ ప్రచారం చేస్తున్న ప్రజా సమస్యలకు, రైతు సమస్యలకు ప్రజలు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. అప్పుడు ఎన్నికల పథం వేరే మలుపు తిరిగి ఉండేది. చట్టాల రద్దుతో యూపీ వంటి అతి పెద్ద రాష్ట్రం తిరిగి తన పట్టులోకి వస్తుందని బీజేపీ అంచనా.

నిజానికి, రైతు అనుకూల పార్టీగా యూపీలో బీజేపీకి ఏనాడూ పేరు లేదు. కానీ ఆ పార్టీలో విజేతలు చాలా వరకు వ్యవసాయ మూలాలు కలిగి.. గ్రామాల నుంచి వచ్చినవారే. పార్టీలో వారి బలాన్ని ఏమాత్రం విస్మరించే పరిస్థితి ఇప్పుడు లేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకుండా ఉండే పరిస్థితి లేదని చెప్పటానికి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు ఒక సూచన. జరగబోయే నష్టం నుంచి బయటపడటం ఎలాగే బీజేపీకి బాగా తెలుసు. సకాలంలో డ్యామేజ్‌ కంట్రోల్‌ చర్యలకు దిగుతుంది. నూతన వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గటం అలాంటిదే అనటంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రధాని తాజా ప్రకటన ఉత్తరప్రదేశ్‌ మాత్రమే కాదు పంజాబ్‌లో కూడా బీజేపీకి చాలా అవసరం. పంజాబ్‌ అర్బన్‌ ప్రాంతాల్లోపి హిందు ఓటర్లలో ఆ పార్టీకి మంచి పట్టుంది. ఐతే, పంజాబ్‌ రైతులే ఆందోళనలో ముందున్నారు. ఈ రైతు చట్టాల అమలైనంత వరకు అక్కడి ఓటర్లు బీజేపీని ఆదరించే అవకాశం లేదు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఎన్‌డీఏ నుంచి వైదొలిగిన దాని చిరకాల మిత్రుడు శిరోమణి అకాళీదళ్‌ తాజా పరిణమాలతో తిరిగి దగ్గరయ్యే అవకాశాలను కొట్టిపారేయలేం. అలాగే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా బీజేపీతో చేతులు కలపొచ్చు. రైతు చట్టాలను వెనక్కి తీసుకుంటే బీజేపీతో కలిసి ఎన్నికల్లో వెళ్లటానికి ఇబ్బందిలేదని అమరీందర్‌ సింగ్‌ ఇప్పటికే ప్రకటించారు. నాలుగు దశాబ్దాలకు పైగా పంజాబ్‌ కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న ఆయనకు జనంలో మంచి ఇమేజ్‌ ఉంది. ఐతే, మనం ఎన్ని లెక్కలు వేసినా మోడీ ప్రకటనను రైతులు ఏమేరకు విశ్వసిస్తారనేది పెద్ద ప్రశ్న.
Dr. Ramesh Babu Bhonagiri

Related Articles

Latest Articles