తగ్గేదే లే.. కరోనా భయం జనంలో పోయిందా?

మన పొరుగుదేశం చైనాలో పుట్టిన కరోనా మహమ్మరి ప్రపంచాన్ని ఎంతలా భయపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత రెండేళ్లుగా కరోనా పేరు చెబితినే ప్రపంచ దేశాలు వామ్మో అంటున్నాయి. అగ్ర దేశాలైతే కరోనా పేరుచెబితే హడలిపోతుండగా.. భారతీయులు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. కరోనాపై ప్రజల్లో ఎంత అవగాహన వచ్చిందో తెలియదుగానీ దాన్ని మరీ పుచికపుల్లలా తీసిపారేస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

చైనా నుంచి కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు, పక్కనే ఉన్న భారత్ కు రావడానికి పెద్ద సమయమేమీ పట్టలేదు. ఈ మహమ్మరి ధాటికి చైనా కంటే అధికంగా ఇటలీ, బ్రిటన్, అమెరికా లాంటి దేశాలు మూల్యం చెల్లించుకున్నాయి. ఇక భారత్ లోనూ కరోనా ప్రభావం భారీగానే ఉంది. ప్రపంచ దేశాల్లో సంభవిస్తున్న కరోనా వార్తల నేపథ్యంలోనే భారత్ ముందుగానే అప్రమత్తమైంది. కరోనా ఫస్టు వేవ్ లో కొన్ని మరణాలు, కేసులతోనే భారత్ తప్పించుకుంది. అయితే కరోనా సెకండ్ వేవ్ సమయానికి భారత్ భారీ మూల్యం చెల్లించుకుంది.

కరోనా సెకండ్ వేవ్ కు ప్రభుత్వం, ప్రజలు ముందస్తుగా సిద్ధం కాకపోవడంతో కరోనా కేసులు, మరణాలు ఎక్కువగా సంభవించాయి. ఆక్సిజన్ సిలిండర్లు సరిపడా లేక చాలామంది ప్రాణాలను కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్డౌన్లు విధించగా కొన్ని రాష్ట్రాల్లో పాక్షిక లాక్డౌన్లు, నైట్ కర్ఫ్యూలు వంటి చర్యలు చేపట్టాల్సి వచ్చింది. రెడ్ జోన్, గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్ పేరిట పలు జాగ్రత్తలు తీసుకున్నారు.

కరోనా కేసులు ఎక్కువగా నమోదైన సమయంలో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్లు చేసుకున్నారు. అత్యవసరం అయితే గానీ బయటికి వెళ్లలేదు. పెళ్లిళ్లు, పేరంటాలు, పండుగలకు దూరంగా ఉన్నారు. దీంతో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే కరోనా కేసులు ఇప్పటికీ ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. ప్రజల్లో అయితే మార్పు కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది.

భారత్ కరోనా ప్రస్తుతం కట్టడిలోనే ఉంది. కరోనా కేసులు ప్రస్తుతానికి తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా బారిన పడినవారు త్వరగానే రికవరీ అవుతున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. దీంతో ప్రజలు ఇప్పుడు కరోనాను పెద్దగా పట్టించుకోవడం లేదు. కరోనా వచ్చినా రికవరీ అవుతామని భావిస్తున్నారే తప్పితే కరోనా జాగ్రత్తలను ఎవరూ పెద్దగా పాటించడం లేదు.

ఇక ఇప్పుడు పెళ్లిళ్లు.. ఇత‌ర ఫంక్షన్లు.. పండుగలు ఆడంబరంగా జ‌రుగుతున్నాయి. నాలుగైదు వంద‌ల మంది అతిథుల‌తో ఈ త‌ర‌హా వేడుక‌లు జ‌రుగుతున్నాయి. పెళ్లిళ్ల‌లో మాస్కు కూడా ధ‌రించడం ఇప్పుడు ఒక ఆభ‌ర‌ణంగా మారిపోయింది. చాలా మంది అది కూడా త‌గిలించుకోవడానికి ఇష్టపడడం లేదు. దీనికితోడు వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నా అందరూ టీకాలు వేసుకోవడానికి బద్దకిస్తున్నారు. ప్ర‌భుత్వ అధికారులు ఇంటింటి వ‌చ్చి వ్యాక్సిన్ వేస్తామ‌న్నా కొందరు ఆసక్తి చూపడం లేదు.

అక్టోబర్లో కరోనా థర్డ్ వేవ్ వస్తుందని మీడియా గగ్గోలు పెడుతున్నా ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. కరోనా విషయంలో గతంలో శాస్త్రవేత్తలు చెప్పిన ఏ విషయాలు నిజం కాలేదని దీంతో వీటిని కూడా ప్రజలు నమ్మడం లేదని తెలుస్తోంది. ఒకవేళ భారత్ లో మూడోవేవ్ వచ్చిన కరోనాను జయించగలమనే ధోరణితోనే ప్రజలు ఉన్నారు. దీంతో వారంతా కరోనా జాగ్రత్తలను గాలికొదిలేస్తున్నారు.

ఈ ధోరణి ఇలానే కొనసాగితే అసలు కరోనా మహమ్మరి అనేది ఒకటి ఉందా? అన్న భావన ప్రజల్లో కలుగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వాలు లాక్డౌన్లు పెడితే ఇంట్లో కూర్చుంటాం.. లేదంటే ఇలానే ఉంటాం అన్నట్లుగా ప్రజలతీరు మారిపోయింది. ఏదిఏమైనా కరోనా చూసి ప్రపంచ దేశాలు వణికిపోతుంటే భారతీయులు మాత్రం తగ్గెదేలా అన్నట్లు వ్యవహారిస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-