బండి పాదయాత్రను.. కేసీఆర్ ఢిల్లీయాత్ర పాడు చేసిందా?

తెలంగాణలో ‘బండి’ దూకుడుకు సీఎం కేసీఆర్ కళ్లెం వేశారా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. తాజాగా సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను బట్టి చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతోంది. ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగిందే తడువుగా ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు ఇచ్చేశారు. వారంతా కేసీఆర్ కు రెడ్ కార్పెట్ పర్చడం చూస్తుంటే ఢిల్లీ పెద్దల వద్ద కేసీఆర్ కు ఎంత పలుకుబడి ఉందో అర్ధమవుతోంది. టీఆర్ఎస్ భవనానికి భూమి పూజ చేయడం కోసమని ఢిల్లీ వెళ్ళిన కేసీఆర్ తెలంగాణా భవన్ నిర్మాణానికి స్థలం కోసం మోదీతో హామీ ఇప్పించుకొని టూర్ ను సక్సెస్ చేసుకున్నారు.

ఈ పరిణామాలన్నీ కూడా తెలంగాణ బీజేపీకి కంటగింపుగా మారాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం అయినప్పటి నుంచి ఆయన సీఎం కేసీఆర్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు. టీఆర్ఎస్ సర్కారును టార్గెట్ చేస్తూ బీజేపీని బలోపేతం చేస్తున్నారు. ఈక్రమంలోనే టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం మారుతుందనే ప్రచారం జరిగింది. దీంతో దుబ్బాక, జీహెచ్ఎంఎసీ ఎన్నికల్లో బీజేపీ కారు స్పీడుకు బ్రేకులు వేసింది. త్వరలోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో బండి సంజయ్ టీఆర్ఎస్ పాలనను వ్యతిరేకిస్తూ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.

టీఆర్ఎస్ ఏడేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగేందేమీ లేదని బండి సంజయ్ తన పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలోనే సీఎం కేసీఆర్ పై ఓ రేంజులో ఫైర్ అవుతున్నారు. సీఎం అధికారిక నివాసమైన ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం.. కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి సీఎంను జైలుకు పంపుతామంటూ బహిరంగంగా శపథాలు కూడా చేశారు. బండి సంజయ్ ఎక్కడ మాట్లాడినా కేసీఆర్ తాట తీస్తానంటాడు.. తోలు తీస్తానంటాడు. మరీ ఢిల్లీ పెద్దలేమో ఆయనకు రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతం పలుకుతున్నారు. దీంతో కేసీఆర్ విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావీస్తుంది.

కేసీఆర్ మూడురోజుల ఢిల్లీ పర్యటన కాస్తా ఐదురోజులు సాగింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర మంత్రులతో ఆయన బీజీబీజీగా గడిపారు. దక్షిణాది రాష్ట్రాల్లోని ఏ పార్టీకి ఇప్పటివరకు సొంత భవనం లేదు. కానీ టీఆర్ఎస్ మాత్రం సొంత భవనానికి స్థలం సంపాదించగలిగింది. బీజేపీ పెద్దలతో ఉన్న సయోధ్య కారణంగా కేంద్రంలోని మోదీ సర్కారు టీఆర్ఎస్ పార్టీకి ఢిల్లీలో స్థలం కేటాయించిందనే టాక్ విన్పిస్తోంది. ఇక పలుమార్లు కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చిన సమయంలో కేసీఆర్ పై ఎలాంటి విమర్శలు చేసిన దాఖలాలు లేవు. దీనికితోడు ఆయన పథకాలు బ్రహ్మాండం అంటూ కితాబు ఇచ్చి ఆపార్టీకి మైలేజ్ చేకూర్చేవారు.

ఒక్క కిషన్ రెడ్డి స్థానికుడు కావడంతోనే టీఆర్ఎస్ పై అడపాదడపా విమర్శలు చేస్తున్నారు. మిగతా వారంతా కేసీఆర్ తో మంచి సంబంధాలను కలిగి ఉన్నారు. తాజాగా ఢిల్లీలో కేసీఆర్ పర్యటన విజయవంతం అవడం చూస్తుంటే వీరిమధ్య పైకి కోట్లాట, లోపల స్నేహం ఉందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బండి సంజయ్ రాష్ట్రంలో ఎన్ని పాదయాత్రలు చేసినా పార్టీకి పెద్దగా ఉపయోగం ఉండదనే టాక్ విన్పిస్తోంది. ఏదిఏమైనా తెలంగాణలో బండి దూకుడు సీఎం కేసీఆర్ ముక్కుతాడు వేయడంతో టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఖుషీ అవుతున్నాయి.

Related Articles

Latest Articles

-Advertisement-