సొంత పార్టీకి కూడా సీఎం జగన్ షాక్ ఇస్తున్నారా…?

అనూహ్య నిర్ణయాలు.. సంచలన ప్రకటనలతో ప్రతిపక్షాలకే కాకుండా సొంత పార్టీకి.. కేబినెట్‌ సహచరులకు కూడా సీఎం జగన్‌ షాక్‌ ఇస్తున్నారా? మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేయాలనే నిర్ణయం.. వేయి మెగావాట్ల షాక్‌ తగిలినట్టుగా మంత్రులు ఫీలయ్యారా? చివరి వరకు రహస్యం.. విషయం బయటకు పొక్కనీయకుండా తీసుకున్న జాగ్రత్తలతో మంత్రులందరికీ దిమ్మతిరిగి బొమ్మ కనిపించిందా?

సీఎం ఇచ్చిన షాక్‌ నుంచి ఇప్పటికీ తేరుకోని కొందరు మంత్రులు..?

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై సీఎం జగన్‌ చేసిన ప్రకటన ఎంతటి సంచలనం సృష్టించిందో.. ఆ మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేస్తూ చేసిన ప్రకటన కూడా అంతే సంచలనంగా మారింది. ఇప్పటికీ మంత్రులు సహా అధికారపార్టీ ఎమ్మెల్యేలు.. నాయకులకు ఈ అంశం అంతుచిక్కడం లేదట. న్యాయ, సాంకేతిక అంశాలను సరిచేసి.. తిరిగి సమగ్ర బిల్లును ప్రవేశపెట్టాలనే దిశగా ముఖ్యమంత్రి ప్రకటన చేసినా.. ఆ షాక్‌ నుంచి చాలామంది ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారట. అసెంబ్లీ లాబీల్లో ఇదే చర్చ. బయట ఉన్నవారే ఓ రేంజ్‌లో షాక్‌ తింటే.. కేబినెట్లో ఉన్న తామెంత షాక్‌ తినాలి అంటూ మంత్రులు ప్రస్తావిస్తున్నారట. కేబినెట్‌లో ఏం జరిగింది? మంత్రులకు 3 రాజధానుల చట్టం రద్దు గురించి ఎప్పుడు తెలిసిందని అంతా ఆరా తీస్తున్నారట.

మంత్రివర్గ ప్రక్షాళనపై నిర్ణయం తీసుకుంటారని భావించారట..!

చట్టాల రద్దుకు మంత్రిమండలి ఆమోదం కోసం అత్యవసర కేబినెట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. అజెండా చెప్పకుండా.. హుటాహుటిన కేబినెట్‌ సమావేశానికి రావాలని మంత్రులకు వర్తమానం పంపారట. ఎక్కడెక్కడో ఉన్న మినిస్టర్లు ఆగమేఘాలపై సచివాలయానికి చేరుకున్నారు. అత్యవసర కేబినెట్‌ భేటీ ఎందుకు? మీటింగ్‌లో ఏం చెబుతారు..అని మీటింగ్‌కు వచ్చేముందు కొందరు సహచర మంత్రులకు ఫోన్‌ చేశారట. మంత్రివర్గ ప్రక్షాళనపై ప్రస్తుతం చర్చ జరుగుతున్నందున.. దానిపై నిర్ణయం తీసుకుంటారేమోనని అనుమానించారట.

మంత్రులందరితో రాజీనామా చేయిస్తారని అనుకున్నారట..!

కేబినెట్‌ సమావేశం మొదలుకాగానే.. కొద్దిసేపు వరదలు.. వర్షాలు.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చ జరిగినట్టు సమాచారం. ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కో కాగితం మంత్రుల ముందుకు వచ్చాయట. ఇది చూసిన వారికి.. ఏదో పెద్ద పరిణామమే జరగబోతోంది.. కొంపదీసి మంత్రులందరితో రాజీనామా చేయించేస్తారా..? అని సందేహించారట. ఆ తర్వాత కాగితంలోని సారాంశం చూశాక.. ఒకింత రిలీఫ్‌ వస్తే.. కొండంత షాక్‌ తగిలిందట. ఆ సారాంశాన్ని చదువుకొని ఆమోదిస్తూ సంతకాలు చేయాలని సీఎం కోరినట్టు తెలుస్తోంది. ఏ ఉద్దేశ్యంతో 3 రాజధానుల చట్టం రద్దుకు నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందనే అంశాన్ని సీఎం జగన్ వివరించారట. ఆపై మంత్రులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా తానే ప్రకటన చేస్తానని.. అప్పటి వరకు ఎవ్వరూ ఈ అంశంపై మీడియాతో మాట్లాడొద్దని సీఎం జగన్‌ స్పష్టం చేసినట్టు సమాచారం.

చట్టాల రద్దు గురించి కొంతమంది మంత్రులకే ముందుగా తెలుసా?

కేబినెట్‌ మీటింగ్‌ నుంచి బయటకొచ్చిన మంత్రులు.. అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనే దానికంటే.. ఏ మంత్రికైనా ముందుగా ఈ విషయం తెలుసా? అని ఎక్కువగా ఆరా తీశారట. మంత్రివర్గ సమావేశం కంటే ముందుగా అతి కొద్దిమంది మంత్రులకు మాత్రమే ఈ సమాచారం తెలుసునని.. మిగిలిన వారికి కేబినెట్‌ భేటీలోనే తెలిసిందనేది వారికి అర్థమైందట. మంత్రులు బుగ్గన, బొత్స, కొడాలి, పేర్ని వంటి వారికి మాత్రమే ముందుగా ఈ సమాచారం తెలిసిందని.. మిగిలిన వారికి ఈ విషయం తెలియదని.. చివరకు అధికారుల్లో కూడా చాలా మందికి సమాచారం లేదని.. తెలిసిన ఒకరిద్దరు అధికారులు సైతం అత్యంత గోప్యంగానే ఉంచారని తెలుస్తోంది.

ముందు తప్పుపట్టినా.. తర్వాత బాస్‌ ఈజ్‌ రైట్‌ అంటారని మంత్రుల్లో చర్చ..!

దీంతో సీఎం జగన్‌ వ్యవహార శైలిపై మంత్రుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈయనేంటి..? ప్రతిపక్షానికి షాక్‌లిస్తారనుకుంటే.. మనకూ ఇచ్చేస్తున్నారని కొందరు మంత్రులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారట. అలాగే ఇంకొందరు మినిస్టర్లు మాత్రం సీఎం జగన్‌ తీసుకున్న ఏ నిర్ణయమైనా మొదట్లో ఎవరికీ అర్థంకాదని.. ముందు తప్పుపట్టినా.. రోజులు గడిచాక బాస్‌ ఈజ్‌ రైట్‌ అనుకుంటారని అభిప్రాయపడుతున్నారు. ఆ రోజు నిర్ణయం తీసుకోవడం వల్లే.. మనకివ్వాళ ఈ అడ్వాంటేజ్‌ వచ్చిందని గతంలో జరిగిన సంఘటనలను ఏకరవు పెడుతున్నారట. ఏది ఏమైనా.. సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడెలా ఉంటాయోనని తెగ చర్చించేసుకుంటున్నారట మంత్రులు.

Related Articles

Latest Articles