వ్యతిరేక పవనాలు వీస్తున్న ‘కమలం’ వికసిస్తుందా?

ఈ ఏడాది దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మోదీ గ్రాఫ్ క్రమంగా పడిపోతున్న నేపథ్యంలో జరుగనున్న ఈ ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు మొగ్గుచూపుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై అందరి దృష్టి నెలకొంది. ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం బీజేపీ సర్కారు అధికారంలో ఉంది. దీనిని తిరిగి నిలబెట్టుకునేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇక్కడ బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీ పీఠం మరోసారి కమలదళం చేతిలోకి వెళ్లినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ లు ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని గెలవనీయకూడదని పట్టుదలగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు రాజకీయంగా చాలా ఆసక్తిని రేపుతున్నాయి.

దేశంలోకి కరోనా ఎంట్రీ తర్వాత మోదీ సర్కారుపై ప్రజల్లో కొంత వ్యతిరేక వచ్చినట్లు తెలుస్తోంది. కరోనాను అరికట్టడంలో, వ్యాక్సినేషన్ విషయంలో మోదీ సర్కారు ఘోరంగా విఫలమైందనే భావన ప్రజల్లో ఉంది. కేంద్రం ప్రకటించిన కరోనా సాయం కూడా కేవలం ప్రకటనలే పరిమితమైనట్లు కన్పిస్తోంది. దీనికితోడు పెట్రోల్, డీజీల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడం, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటడం, పార్లమెంటులో రైతు వ్యతిరేక చట్టాలు చేయడం వంటివి మోదీ సర్కారుపై వ్యతిరేకతను పెంచినట్లు కన్పిస్తోంది.

దేశవ్యాప్తంగా ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లుగానే ఉత్తరప్రదేశ్ లోనూ ఇదే వేవ్ కొనసాగుతోంది. అయితే ఇటీవల ఏబీపీ ఉత్తరప్రదేశ్ నిర్వహించిన సర్వేలో మాత్రం బీజేపీకి ఎక్కువ శాతం ఓటర్లు పట్టం కట్టడం ఆసక్తిని రేపుతోంది. ఏబీపీ సర్వే ప్రకారం ఉత్తరప్రదేశ్లో 42 శాతం మంది బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీకి దాదాపు 267 సీట్లు దక్కే అవకాశం ఉందని ఏబీపీ అంచనా వేస్తోంది. ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 248 కాగా బీజేపీకి సింగిల్ గానే 267 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో మరోసారి ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఏబీపీ అంచనా వేస్తోంది.

మరోవైపు ప్రాంతీయ పార్టీలైన సమాజ్ వాదీ పార్టీ.. బహుజన్ సమాజ్ పార్టీలు పెద్దగా పుంజుకోలేదని సర్వే వెల్లడించింది. సమాజ్ వాదీ పార్టీ వైపు 30 శాతం మంది ప్రజలు మొగ్గుచూపుతున్నట్టు తేలింది. ఆ పార్టీకి 117 సీట్లు వస్తాయని అంచనా వేస్తోంది. అదేవిధంగా మాయవతి పార్టీని ప్రజలు పెద్దగా విశ్వసించడం లేదని తేలిందట. 16శాతం ఓట్లతో ఆ పార్టీ 16 సీట్లకే పరిమితం కానుందని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ ఐదు శాతం ఓట్లతో కేవలం ఏడు సీట్లకు పరిమితం అవుతుందని సర్వేలో వెల్లడికావడం గమనార్హం. మొత్తంగా అన్ని పార్టీలు ఏకమై బీజేపీని అధికారం నుంచి దూరం చేయలేవని ఏబీపీ సర్వే ద్వారా రుజువు చేస్తోంది. దీంతో వ్యతిరేకతలోనూ మోదీ హవా ఉత్తరప్రదేశ్లో కొనసాగనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-