కాయ్ రాజా కాయ్.. ‘మా’ ఎన్నికలపై బెట్టింగ్?

కాదేదీ కవితకు అనర్హం అన్నట్లుగా.. బెట్టింగ్ రాజాలు కూడా అదే పంథాను ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు కోళ్లపై, గుర్రాలపై పందేలు కాసేవాళ్లు. ఆ తర్వాత రాజకీయాలు, క్రికెట్ వంటి క్రేజీ అంశాలపై బెట్టింగులు నిర్వహిస్తూ పందెంరాయుళ్లు కోట్లలో సంపాదించడం మొదలుపెట్టారు. అయితే ట్రెండ్ మారుతున్న కొద్ది బెట్టింగ్ రాజాలు సైతం అప్ డేట్ అవుతున్నారు. మీడియాలో ఏ అంశంపై ప్రజలు విపరీతంగా చర్చిస్తూ ఉంటారో అలాంటి అంశాలనే పందెంరాయుళ్లు దృష్టిసారిస్తున్నారు. వాటిపైనే లక్షల్లో పందేలు కాస్తూ జేబులు నింపుకుంటునే ప్రయత్నం చేస్తున్నారు.

బెట్టింగ్ రాజాల కన్ను తాజాగా ‘మా’ ఎన్నికలపై పడింది. కొద్దిరోజులుగా మీడియాలో ‘మా’ ఎన్నికల అంశమే ప్రధానంగా ఫోకస్ అవుతూ వస్తున్నాయి. సాధారణ ఎన్నికలను తలపించేలా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. రాజకీయ నాయకులను తలదన్నేలా నటీనటులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే ఇండస్ట్రీ రెండు గ్రూపులుగా విడిపోయిందా? అన్న సందేహాలు సైతం కలుగుతున్నాయి. అయితే ఇష్యూలో సినీపెద్దలు సైలంట్ గా ఉండటం విస్మయానికి గురిచేస్తోంది.

‘మా’ ఎన్నికల్లో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు అధ్యక్ష పదవీకి పోటీ చేస్తున్నారు. వీరిద్దరి మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. ఇందులో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ బలంగా ఉండగా మంచు విష్ణు ప్యానల్ కొంచెం వీక్ గా కన్పిస్తోంది. ప్రకాశ్ రాజ్ కు మెగా కుటుంబం నుంచి మద్దతు లభిస్తుండగా మంచు విష్ణుకు మోహన్ బాబుతోపాటు పలువురు సీనియర్ల మద్దతు లభిస్తుందనే ప్రచారం ఇండస్ట్రీలో ఉంది.

తొలుత ప్రకాశ్ రాజ్ ప్యానల్ ఈజీగా గెలుస్తుందనే ప్రచారం జరిగింది. అయితే మంచు విష్ణు క్రమంగా రేసులోకి రావడంతో ప్రకాశ్ రాజ్ గెలుపు అంతా ఈజీ కాదనే టాక్ ప్రస్తుతం విన్పిస్తోంది. ఎవరు గెలిచినా 50 లేదా 60ఓట్లతోనే గెలిచే అవకాశాలు ఉండటంతో ఎవరికీ వారు తగ్గెదేలా అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఓ దశలో విష్ణు వర్గం పైచేయి సాధిస్తుందన్నట్లు కన్పించినా ఆ ప్యానల్ చేసిన తప్పుల కారణంగా మళ్లీ వెనుకపడింది. ఇదే సమయంలో మెగాబ్రదర్ నాగబాబు సీన్ లోకి ఎంట్రీ ప్రకాశ్ రాజ్ కు అండగా నిలబడ్డారు.

ప్రకాశ్ రాజ్ ను గెలిపించేందుకు మెగా బ్రదర్ నాగబాబు తనశక్తి మేర ప్రయత్నాలు చేస్తుంటంతో మరోసారి సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఈనేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ పరిణామాలను బెట్టింగ్ రాయుళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ‘మా’ ఎన్నికలపై లక్షల్లో పందేలు కాస్తున్నట్లు తెలుస్తోంది. పలువురు నటీనటులు సైతం ‘మా’ ఎన్నికలపై పందేలు కాస్తున్నారనే గుసగుసలు ఇండస్ట్రీలో విన్పిస్తున్నాయి. రేపటితో ఈ ఉత్కంఠకు తెరపడనుండటంతో ఎవరు గెలుస్తారో సస్పెన్స్ గా మారింది.

-Advertisement-కాయ్ రాజా కాయ్.. ‘మా’ ఎన్నికలపై బెట్టింగ్?

Related Articles

Latest Articles