ఐపీఎల్-2022 మెగా వేలానికి ముహూర్తం ఫిక్స్

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ -2022 మెగావేలానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం నిర్వహించనున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ వెల్లడించారు. అలాగే ఈ ఏడాది కొత్తగా వ‌స్తున్న ల‌క్నో, అహ్మదాబాద్ జ‌ట్లకు బీసీసీఐ ఫార్మల్ క్లియ‌రెన్స్ కూడా ఇచ్చిందని ఆయన ప్రకటించారు. ఆయా ఫ్రాంఛైజీలకు లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ను జారీ చేయాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. రెండు బిడ్‌లను గవర్నింగ్ కౌన్సిల్‌ ఆమోదించిందని… దీనికి సంబంధించిన ఎల్‌ఐవోను త్వరలోనే జారీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.

లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను జారీ చేయడం ద్వారా ఐపీఎల్ మెగా వేలానికి ముందే ఈ రెండు జట్లు తమ ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉందని బ్రిజేష్ పటేల్ తెలిపారు. మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్‌కు కొత్త స్పాన్సర్ రానుంది. చైనా కంపెనీ వివోకు బదులు టాటా సంస్థను ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా నియమించింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. అటు లక్నో జట్టుకు కేఎల్ రాహుల్‌, అహ్మదాబాద్‌ జట్టుకు హార్థిక్‌ పాండ్యా కెప్టెన్సీ వహిస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Related Articles

Latest Articles