పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలి: మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

దేశంలో పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి డిమాండ్ చేశారు. నిర్మల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను నష్టపరిచే విధంగా వ్యవహరిస్తున్న బీజేపీకి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ రాసిన లేఖకు ప్రధాని వెంటనే జవాబు చెప్పాలన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలోనే రైతులు ఆనందంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలతో రైతులు ఆనందంగా ఉన్నారని ఆయన అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలకు కేసీఆర్‌ సర్కార్‌ పెద్ద పీట వేసిందన్నారు.

Read Also: ఊసరవెల్లి కేసీఆర్‌ను ప్రజలు గద్దె దింపాలి: విజయశాంతి

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కేసీఆర్‌ను దెబ్బకొట్టడానికే ఎరువుల ధరలను పెంచిందని మంత్రి మండిపడ్డారు. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవన్నారు. ఎరువుల ధరల పెంపు, వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు నిర్ణయాలకు వ్యతిరేకంగా అన్నదాతలు నాగళ్లు ఎత్తాలని కోరారు. రైతులను ముంచాలనుకుంటున్న బీజేపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్ళతో పెకిలించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎరువుల ధరల పెంపు పై రాష్ట్ర బీజేపీ నేతలు తమ వైఖరిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను మానుకుంటే మంచిదని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి హితవు పలికారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు అన్నదాతలు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో నిరనస కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

Related Articles

Latest Articles