పారాలింపిక్స్‌ లో భారత్‌కు పతకాల పంట…

పారా ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. పతకాలు కొల్లగొడుతూనే ఉన్నారు. అవని లేఖరా… ఒకే పారా ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించారు. పతకాల పట్టికలో ఇండియా 37వ స్థానంలో నిలిచింది. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…ఈ నెల 9న పారా ఒలింపియన్లను కలుసుకోనున్నారు.

భారత దేశ బంగారు బాలిక అవని లేఖారా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళా పారాలింపియన్‌గా ఘనత సాధించింది. మహిళల 50ఎం రైఫిల్ 3పీ ఎస్‌హెచ్1 ఫైనల్‌లో కాంస్య పతకం సాధించింది. అంతకుముందు మహిళల 10ఎం ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 ఈవెంట్‌లో బంగారు పతకం పొందింది.

టీ64 పురుషుల హై జంప్‌లో ప్రవీణ్ కుమార్ రజత పతకాన్ని సాధించాడు. 2.07 మీటర్ల జంప్‌తో పతకాన్ని సాధించాడు. దీంతో 18 ఏళ్ళ ప్రవీణ్ సరికొత్త ఆసియన్ రికార్డు నెలకొల్పాడు. వరల్డ్ నెంబర్ 3 ప్రవీణ్ కుమార్ సాధించిన విజయంతో ఈ పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 11కు చేరింది.

ఆర్చరీలో హర్విందర్ సింగ్ కాంస్య పతకం గెలుచుకుని ఈ విభాగంలో భారత్‌కు తొలి పతకం అందించాడు. దక్షిణ కొరియా ఆటగాడు కిమ్ మిన్ సు తో జరిగిన కాంస్య పతక పోరులో విజయం సాధించిన హర్విందర్ పతకం సాధించాడు. ఫలితంగా టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 13కు పెరిగింది. ఇప్పటి వరకు 2 స్వర్ణ పతకాలు, 6 రజతం, 5 కాంస్య పతకాలు సాధించారు. పతకాల పట్టికలో భారత్ ప్రస్తుతం 37వ స్థానంలో ఉంది.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ నెల 9న టోక్యో పారాలింపిక్స్ విజేతలను కలవనున్నారు. పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు ఇప్పటికే 13 పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. పారా గేమ్స్‌లో భారత్‌కు ఇన్ని పతకాలు రావడం ఇదే తొలిసారి. మొత్తం 54 మంది పారా అథ్లెట్లు 9 వేర్వేరు విభాగాల్లో పోటీపడుతున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-