ఆఖరి టెస్ట్ : రద్దు చేసారా… వాయిదా వేసారా…?

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఆఖరి టెస్ట్ ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌పై తుది నిర్ణయం ఏంటన్నదే ఇప్పుడు తేలట్లేదు. మ్యాచ్‌ను వచ్చే ఏడాది వీలును బట్టి నిర్వహిస్తారని వార్తలొస్తున్నా.. ఇందుకు బీసీసీఐ కూడా అంగీకారం తెలిపినప్పటికీ.. తుది నిర్ణయం ఏంటన్నదే తెలియడం లేదు.ప్రస్తుతం రద్దయిన మ్యాచ్‌ను తర్వాత నిర్వహించుకునే అవకాశాన్ని ఈసీబీకి ఇచ్చామని. ఇరు బోర్డులు కలిసి ఈ మ్యాచ్‌ను మళ్లీ ఎప్పుడు ఆడించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటాయన్నారు బీసీసీఐ కార్యదర్శి జై షా.

ఐదో టెస్టు మళ్లీ ఆడించే అవకాశం లేకుంటే, రీషెడ్యూల్‌ చేయడంపై ఐసీసీ అభ్యంతరం చెబితే ఈ మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేసే అవకాశముంది. అప్పుడిది అయిదు టెస్టుల సిరీస్‌ కాదు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌గా ముగుస్తుంది. సిరీస్‌ 2-1తో భారత్‌ సొంతమవుతుంది. కాని బీసీసీఐ, ఈసీబీ ప్రస్తుతం ఆగిపోయిన మ్యాచ్‌ను మళ్లీ వీలు చూసుకుని ఆడించాలనే భావిస్తున్నాయి. వచ్చే ఏడాది పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌ కోసం భారత జట్టు ఇంగ్లాండ్‌కు వెళ్లినపుడు ఈ మ్యాచ్‌ను నిర్వహించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుత సిరీస్‌లో భాగంగానే ఆ మ్యాచ్‌ను ఆడిస్తారా.. లేక ఆ మ్యాచ్‌ వేరా అన్నదానిపై స్పష్టత లేదు.

Related Articles

Latest Articles

-Advertisement-