ఎండెమిక్ స్టేజిలోకి ఇండియా: కరోనాతో కలిసి బతకాల్సిందే..!

కరోనా మహమ్మరి పేరు చెబితేనే ప్రపంచం ఉలిక్కి పడిపోతుంది. కంటికి కన్పించకుండా ఈ మహమ్మరి ప్రపంచాన్ని మొత్తాన్ని కబలించేస్తోంది. ఈ వైరస్ దాటికి ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు మృత్యు అంచులదాకా వెళ్లి బ్రతుకు జీవుడా అంటూ బయటపడ్డ సంఘటనలు అనేకం ఉన్నాయి. భారత్ లోనూ కరోనా ప్రభావం భారీగానే కన్పించింది. అక్టోబర్లో థర్డ్ వస్తుందన్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ స్వామినాథన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

కరోనా ఫస్ట్ వేవ్ సమర్ధవంతంగా ఎదుర్కొన్న భారత్ సెకండ్ వేవ్ లో మాత్రం తడబడింది. ఊహించని విధంగా కరోనా సెకండ్ వేవ్ రావడంతో చాలామంది కరోనా బారినపడ్డాయి. ఇప్పటివరకు భారత్ లో 4లక్షల 35వేల మంది మరణించినట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. అయితే రికవరీ భారత్ లో ఎక్కువగా ఉండటం సానుకూల అంశమని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇండియాలో కరోనా కేసులు నిలకడగా ఉన్నాయి. ఇదే సమయంలో భారత్ లో కరోనా ఎండమిక్ స్టేజ్లో ఉందని స్వామినాథన్ వ్యాఖ్యలు చేశారు.

దీంతో అసలు ‘ఎండెమిక్’ అంటే ఏమిటీ? భారత్ లో కరోనా ఏ స్టేజ్ లో ఉందోనని తెలుసుకునేందుకు ప్రతీఒక్కరు ఆసక్తి చూపుతున్నారు. ఎండమిక్ అంటే ఒక వ్యాధి మనమధ్యే శాశ్వతంగా ఉండిపోవడం. ప్రస్తుతం మనమధ్యే ఉన్న మశూచి.. తట్టూ.. హైపటైటిస్-ఎ, బీ వ్యాధుల్లాగే కరోనా కూడా మనమధ్య ఉంటుందన్న మాట. మనిషి ఇప్పటికే ఈ వ్యాధులతో సహజీవనం చేస్తుండగా ఇప్పుడు కరోనా కూడా ఆ జాబితాలో చేరుతుందని తెలుస్తోంది.

కరోనా కట్టడికి ఇప్పటికే చాలావరకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. బ్రిటన్ వంటి దేశాల్లో 60శాతం వ్యాక్సినేషన్ పూర్తికాగా భారత్ లో 35శాతం పూర్తయింది. బ్రిటన్లో కరోనా వైరస్ మనషుల మధ్య ఉన్న ఎక్కువగా వ్యాప్తి చెందడం లేదు. దీంతో అన్ని వ్యాధుల్లానే కరోనా వైరస్ అక్కడ మారిపోయిందని తెలుస్తోంది. ఇక భారత్ లోనూ వ్యాక్సిన్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తే కొన్నిరోజుల్లోనే ఇక్కడ కూడా వైరస్ ఎండమిక్ స్టేజ్ లోకి వెళుతుందని నిపుణులు అంటున్నారు.

ప్రస్తుతం ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. కేసుల సంఖ్య నిలకడగా ఉంది. అయితే అక్టోబర్లో థర్డ్ వేవ్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో భారత్ ఎండమిక్ స్టేజీలోకి రావాలంటే త్వరితంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయడంతోపాటు ప్రజలు అలవాట్లలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ను ఎవరూ ఊహించకపోవడంతో వైరస్ వేగంగా వ్యాపించి ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవించాయి. అయితే కొన్నిరోజులుగా కేసుల సంఖ్య తగ్గముఖం పడుతుంది. అంటే సెకండ్ వేవ్ మొత్తం పాండమిక్ అన్నమాట. ఇప్పుడు కేసుల నిలకడగా ఉన్నాయి అంటే దీనిని ఎండెమిక్ అనొచ్చు అని నిపుణులు అంటున్నారు.

ఇండియాలో ప్రస్తుతం కరోనా కట్టడికి వ్యాక్సిన్లు రెండు డోసులుగా ఇస్తున్నారు. త్వరలోనే కరోనా ఎండమిక్ స్టేజీలోకి రానుండటంతో బూస్టర్ డోస్ అవసరం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొంతమందికి బూస్టర్ డోస్ వేసి ట్రయల్ నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే వైరస్ తీవ్రత తగ్గితే బూస్టర్ డోస్ అవసరం ఉండకపోవచ్చని నిపుణులు అంటున్నారు. వైరస్ తీవ్రతను బట్టి బూస్టర్ డోస్ వేయాలా? వద్దా? అనే నిర్ణయం ఉండనుంది. ఏదిఏమైనా కరోనా మనల్ని విడిచి వెళ్లనని మొండికేస్తోంది. దీంతో మనం కూడా కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-