బ్రిటన్‌లో కొత్త వేరియంట్ కల్లోలం.. రష్యాలో మరణ మృదంగం

కరోనా మహమ్మారి రూపం మార్చుకుంటూ యావత్ ప్రపంచ మానవాళి గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తోంది. ధనిక, పేద దేశాలు అని తేడా లేకుండా అందరిమీద దాడి చేస్తూనే ఉంది.. జన్యుపరమైన మార్పులు చోటు చేసుకుంటూ ప్రజలను భయపెడుతోంది. ఇప్పుడు డెల్టా వేరియెంట్‌లోని ఏవై.4.2 రకం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తాజాగా కొత్త వేరియంట్ లక్షణాలు కనిపించినట్టు డాక్టర్లు ప్రకటించారు.

యూకేలో కొత్త వేరియంట్ కేసులు ఆగడం లేదు. ఇటు, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌లో కూడా వెలుగు చూస్తున్నాయి. భారత్‌లో వెలుగులోకి వచ్చిన డెల్టా వేరియెంట్‌లో.. ఇప్పటి వరకు 55 సార్లు జన్యుపరమైన మార్పులు జరిగాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవి అంత ప్రమాదకరం కాకపోయినా.. వదిలేయడానికి లేదు.. కానీ, ఇప్పుడు మాత్రం ఏవై.4.2 వ్యాప్తి కలవరానికి గురిచేస్తోంది.. కరోనా వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌ మ్యుటేషన్లు అయిన ఏ222వీ, వై145హెచ్‌ల సమ్మేళనంగా ఈ కొత్త వేరియెంట్‌ పుట్టుకొచ్చినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

తాజాగా బ్రిటన్‌లో వేగంగా వ్యాపిస్తున్న డెల్టా ప్లస్‌ (ఏవై.4.2) వేరియంట్‌ను యూకే ఆరోగ్య భద్రత సంస్థ వేరియంట్‌ అండర్‌ ఇన్వెస్టిగేషన్‌ (వీయూఐ-21ఓసీటీ-01)గా పేర్కొంది. డెల్టాను మించిన వేగంతో ఇది విస్తరిస్తున్నా అంతగా ప్రమాదకరమయింది కాకపోవచ్చంటున్నారు.

అయితే, ఇలాంటి వేరియంట్లు విస్తరించడానికి కారణాలను అన్వేషిస్తున్నారు. బ్రిటన్‌లో ఈనెల 20న నమోదైన కేసుల్లో 15,120 వీయూఐ-21ఓసీటీ-01 వేరియంట్‌ సోకడం వల్ల తలెత్తినవేనని గుర్తించారు. రష్యాలో ఇటు తగ్గినట్టే తగ్గి మళ్ళీ ప్రతాపం చూపుతోంది కరోనా వైరస్. రష్యాలో 37,678 కేసులు, 1,075 మరణాలు సంభవించాయి. సెప్టెంబరు నాటి గణాంకాలతో పోలిస్తే, ఇప్పుడు కేసులు 70శాతం పెరగగా, మరణాలు 33శాతం అధికంగా నమోదయ్యాయి.

చైనాలో స్కూళ్ళు మూసివేశారు. చైనాలో తాజాగా 47 కేసులు నమోదైనట్టు జాతీయ ఆరోగ్య కమిషన్‌ తెలిపింది. దీంతో ఆంక్షలు విధించారు. విమానాలు రద్దుచేశారు. ఆస్ట్రేలియాలో కేసులు పెరుగుతుండటంతో… టీకా తీసుకోనివారిపై ఆంక్షలు విధించడానికి రంగం సిద్ధం అవుతోంది. ఉక్రెయిన్‌లో గతంలో లేని విధంగా 23,785 కేసులు, 614 మరణాలు నమోదయ్యాయి. రాజధాని కీవ్, మరికొన్ని చోట్ల ఆంక్షలు విధించారు.

Related Articles

Latest Articles