పంజాబ్ కొత్త ముఖ్యమంత్రికి చిక్కులు

పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి చిక్కులు తప్పడంలేదు. ఓవైపు సొంత పార్టీనుంచి మరోవైపు విపక్షాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యమంత్రి. కొత్తగా నియమించిన డీజీపీ, అడ్వొకేట్ జనరల్ లను తొలగించాల్సిందేనని సిద్ధూ పట్టుబడుతుండగా, ఉన్నతస్థాయి సమావేశానికి సీఎం కొడుకు హాజరవడంపై విపక్షాలు విమర్శలను ఎక్కుపెడుతున్నాయి. పంజాబ్ కాంగ్రెస్‌ను ఏదో ఒకటి చేసేవరకు సిద్ధూ విశ్రమించేలా లేడు. కోరి ముఖ్యమంత్రి చేసిన చరణ్ జిత్ సింగ్ చన్నీతో అప్పుడే గొడవకు దిగాడు. డీజీపీ, అడ్వొకేట్‌ జనరల్ నియామకాన్ని తప్పుబడుతూ పీసీసీ చీఫ్ పదవికి ఇప్పటికే రాజీనామా చేశాడు.

వారిద్దరినీ వెంటనే తొలగించాలని తాజాగా మరోసారి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. డీజీపీ, అడ్వకేట్ జనరల్‌ను తొలగించకపోతే ప్రజల్లో తలెత్తుకు తిరగలేమంటూ తాజాగా ట్వీట్ చేశాడు. చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే.. డీజీపీగా ఇక్బాల్‌ ప్రీత్‌సింగ్‌ సహోతాకు బాధ్యతలు అప్పగించారు. అమర్‌ప్రీత్‌సింగ్‌ డియోల్‌ను అడ్వొకేట్‌ జనరల్‌గా నియమించారు. ఈ నిర్ణయాలను సిద్ధూ తప్పుబట్టారు. పీసీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత చన్నీ, సిద్ధూ భేటీ అయ్యారు. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

దీంతో అంత సమసిపోయిందనుకున్న సమయంలో … మూడు రోజుల తిరగకముందే సిద్ధు మరోసారి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. డ్రగ్స్‌ రాకెట్‌ కేసులో ప్రధాన నిందితులను పట్టుకోవడంలో విఫలమవడం వల్లే గత సీఎంను ప్రజలు పక్కకు తప్పించి కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని.. తాజాగా అడ్వొకేట్‌ జనరల్‌, డీజీపీ నియమించడం అంటే.. నాటి బాధితుల గాయాలపై కారం చల్లడమే అవుతుందంటూ సిద్ధూ ట్వీట్ చేశారు. సీఎం పీఠమెక్కిన మూడురోజులకే ఓ పక్క అంతర్గత సమస్యలు చుట్టుముట్టగా, మరోపక్క ఓ ఉన్నతస్థాయి సమీక్షకు తన కుమారుడు హాజరవడం చన్నీకి ఇబ్బందికరంగా మారింది. రాష్ట్ర భద్రతా వ్యవహారాలపై చన్నీ ఇటీవల డీజీపీ ఇక్బాల్‌ ప్రీత్‌ సింగ్‌ సహోటాతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో సీఎం కుమారుడు రిథమ్‌జిత్‌ సింగ్‌ సైతం పాల్గొన్నారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ప్రతిపక్ష నేతలు ముఖ్యమంత్రితోపాటు అధికారులపై విమర్శలకు దిగారు.

-Advertisement-పంజాబ్ కొత్త ముఖ్యమంత్రికి చిక్కులు

Related Articles

Latest Articles