లంచం డిమాండ్ చేయడంలో నా రూటే సెపరేట్ అంటున్న ఆ అవినీతి అధికారి !

లంచాల విషయంలో ఆ ఆఫీసర్‌ రూటే సెప..రేటు. అన్ని అనుమతులు ఉన్నా.. చేతిలో బరువు పెట్టాల్సిందే. లేదంటే ఎక్కడో ఒకచోట కొర్రీలు పెట్టేస్తారట. ఈ క్రమంలో ఓ పోలీస్‌ అధికారికి సైతం ఝలక్ ఇచ్చారట ఆ అవినీతి ఆఫీసర్‌. ఉద్యోగవర్గాల్లో కథలు కథలుగా చెప్పుకొంటున్న ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. 

అనుమతులున్న వెంచర్లనూ వదలని అధికారులు!

హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో భూములకు ఉన్న డిమాండ్‌ అందరికీ తెలిసిందే. ఎన్నో వెంచర్లు వెలిశాయి. ఈ వెంచర్లు.. భూములు.. శివారు మున్సిపాలిటీలు..మున్సిపల్‌ కార్పొరేషన్లకు కాసులు కురిపిస్తాయని తెలిసిందే. నోట్ల కట్టలు కొడితే చాలు అక్రమ వెంచర్లు క్షణాల్లో సక్రమం అవుతాయి.  పునాదులు లేచి.. కొత్త కాలనీలు పుట్టుకొస్తున్నా.. అధికారులకు ముట్టాల్సింది ముడితే.. అటు వైపు కన్నెత్తి కూడా చూడరు. అయితే అన్ని అనుమతులు తీసుకుని వేసుకున్న వెంచర్లను కూడా అధికారులు వదలిపెట్టరు. అలాంటి వెంచర్ల వెనక పెద్దలు ఉన్నా.. లోకల్‌ అధికారులకు అవేమీ పట్టవు. ఈ క్రమంలో జరిగిన ఓ వివాదం ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. 

పది ఎకరాల్లో వెంచర్‌ వేసిన పోలీస్‌ అధికారి బంధువు

డబ్బుల కోసం లోకల్‌ లీడర్లు, అధికారులు ఎత్తుగడ

హైదరాబాద్‌ శివారు ఆదిభట్ల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఓ పోలీస్‌ అధికారి బంధువు వెంచర్‌ వేశారట. HMDA నుంచి పూర్తి అనుమతులు తీసుకుని పది ఎకరాల్లో వెంచర్‌ వేసినట్టు చెబుతున్నారు. అన్ని పర్మిషన్లు ఉండటంతో స్థానిక అధికారులకు మింగుడు పడలేదట. ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలని అనుకున్న అక్కడి ఆఫీసర్‌.. ముందుగా లోకల్‌ పొలిటికల్‌ లీడర్‌ను ఫీల్డ్‌లోకి పంపారట.  ఓ కార్పొరేటర్‌ భర్త.. వెంచర్‌ దగ్గరకు వెళ్లి కొలతలు తీసుకునే ప్రయత్నం చేశారట. అక్కడున్నవారు కార్పొరేటర్‌ భర్తను అడ్డుకుని.. కొలతలు కావాలంటే మున్సిపల్‌ సిబ్బంది తీసుకుంటారు.. మీకేంటి సంబంధం అని ప్రశ్నించారట. విషయం తెలిసి సదరు పోలీస్‌ అధికారి  కార్పొరేటర్‌ భర్తతో మాట్లాడినట్టు చెబుతున్నారు. ఆ ఫోన్‌ కాల్‌ తర్వాత వెంచర్‌  ప్రాంతం నుంచి కార్పొరేటర్‌ భర్త జారుకున్నారట. 

రూ.5-10 లక్షలు కావాలని డిమాండ్‌ చేసిన లోకల్‌ అధికారి?

రెండోసారి లోకల్‌ మీడియా ప్రతినిధులు ఎంట్రీ ఇచ్చారట. వెంచర్‌లో కొన్ని తప్పులు ఉన్నాయి.. డబ్బులు ఇవ్వకపోతే వాటిని బయటపెడతాం అని బెదిరించారట. మళ్లీ పోలీస్‌ అధికారి నుంచి ఫోన్‌ రావడంతో వచ్చినవాళ్లు వచ్చినట్టే వెళ్లిపోయారట. ఇక లాభం లేదని అనుకున్నారో ఏమో లోకల్‌ అధికారి ఫీల్డ్‌లోకి వచ్చారట. ఐదు నుంచి పది లక్షలు ఇవ్వాలని నేరుగానే అడిగేసినట్టు సమాచారం. ఆ ఫిగర్‌ విన్నంటనే పోలీస్‌ అధికారికి మైండ్‌ బ్లాంక్‌  అయ్యిందట. చిల్లి గవ్వ కూడా ఇవ్వం అని ఆ పోలీస్‌ అధికారి తేల్చిచెప్పేశారట. 

ఇంటి పర్మిషన్‌కు రూ.2 లక్షలు డిమాండ్‌

ఏసీబీ ఎంట్రీతో ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్‌!

ఆ సమయంలో కామ్‌ అయిన లోకల్‌ అధికారి.. ఆ వెంచర్‌లో ఇంటి పర్మిషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నవారిపై ఫోకస్‌ పెట్టారట. కనీసం రెండు లక్షలు ఇస్తేకానీ పర్మిషన్‌ రాదని చెప్పినట్టు తెలుస్తోంది. రెండు నెలలపాటు ఇదే తంతు సాగిందట. చివరకు ఏసీబీ అధికారులు  ఎంట్రీ ఇవ్వడంతో లోకల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల్లో గుబులు మొదలైందట. ఫైళ్లు వేగంగా కదిలినట్టు చెబుతున్నారు. మొత్తానికి హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో ఓ మున్సిపల్‌ అధికారి ఏకంగా పోలీస్‌ ఆఫీసర్‌కే ఝలక్‌ ఇవ్వడం రచ్చ రచ్చ అవుతోంది. మరి.. అవినీతి కట్టపాములపై చర్యలు తీసుకుంటారో లేక సమస్యను రహస్యంగానే సమాధి చేస్తారో చూడాలి. 

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-