ఎన్నారైల సోషల్ మీడియా పోస్టులపై నిఘా

అసభ్యకర పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టటం.. విద్వేషపూరితంగా సందేశాల్ని వ్యాప్తి చేయటం.. ఫోటోల్ని మార్ఫింగ్ చేసే ఉదంతాలపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ అధికారులను ఆదేశించారు. అమాయకుల ఫోటోల్ని మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి.. అసభ్యకర పదజాలంతో పోస్టు చేస్తూ వేధింపులకు గురిచేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు. సోషల్ మీడియాలో అసత్యాల్ని వ్యాప్తి చేసే వారి పై కేసుల్ని నమోదు చేయటంతో పాటు.. వేగవంతంగా శిక్షలు పడేలా విచారణ సాగాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

“సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని నేరాలు చేసే వారిపై వచ్చే ఫిర్యాదుల మీద స్పందిస్తూ.. కేసులు నమోదు చేస్తున్నారు కానీ అలాంటి నిందితులపై చర్యలు తీసుకోవటంలో ఆలస్యం జరుగుతోందని, పూర్తి స్థాయిలో కేసులను వేగవంతంగా పరిశోధించి.. చట్టప్రకారం శిక్ష పడేలా చేయాలి” అని పోలీసు అధికారుల్ని కోరారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఎస్ హెచ్ఓ.. ఏసీపీ.. డీసీపీ..జాయింట్ సీపీ.. అడిషనల్ సీపీతో సహా అన్ని విభాగాల పోలీసు అధికారులతో హైదరాబాద్ సీపీ సి.వి.ఆనంద్ మొదటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సైబర్ నేరాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సైబర్ నేరాల విషయంలో అనుసరించాల్సిన తీరుపై పలు సూచనలు చేశారు. సైబర్ నేరాల కేసుల నమోదులో ఉన్న వేగం.. వాటి విచారణ పూర్తి చేసి శిక్షలు పడే విషయంలో వెనుకబడి ఉన్న విషయాన్ని ప్రస్తావించిన సీపీ సి.వి. ఆనంద్.. ఆ దిశగా అధికారులు విచారణను వేగవంతం చేయాలన్నారు. కొందరు ఎన్.ఆర్ ఐలు సోషల్ మీడియాలో ఏం చేసినా తమకేం కాదన్న ధీమాతో సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు పెడుతున్నారని.. అలాంటి వారిపైనా కేసులు నమోదు చేసి లుక్అవుట్ నోటీసులు జారీ చేయొచ్చన్నారు.

అలాంటి వారి పాస్ పోర్టులు.. వీసాలను కూడా రద్దు చేయించవచ్చని చెప్పారు. వారు పెట్టిన ఫోటోల్ని.. వీడియోల్ని వెంటనే డిలీట్ చేయించాలన్నారు. అందుకు సంబంధించి సంబంధిత వర్గాలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇవ్వమని హైదరాబాద్ సీపీ కోరారు. అదే పనిగా నేరాలు చేసే అలవాటున్న నేరస్తులను గుర్తించి.. వారిపై చర్యలు తీసుకోవాలి. అప్పుడు మిగిలిన వారు తప్పులు చేయటానికి జంకుతారని సీవీ శ్రీ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు. ‘ఏదైనా కేసుల్లో అనుమానాలు ఉంటే వెంటనే లీగల్ అడ్వైజర్ సలహాలు సూచనలు తీసుకొని కేసుల్ని త్వరగా పరిష్కరించాలి. విచారణను వేగవంతం చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలి. ప్రతి పోలీస్ స్టేషన్ అధికారి మీకు మీరుగా స్వయంగా చర్యలు తీసుకోవటం అలవాటు చేసుకోవాలి.

పై అధికారుల ఉత్తర్వుల కోసం వేచి చూడొద్దు. నేరాల్ని నిరూపించేందుకు అవసరమైన రీతిలో విచారణ పక్కాగా.. శాస్త్రీయంగా సాగాలి. ఆధారాల సేకరణకు అవసరమైన సాంకేతిక సాయాన్ని తీసుకోండి’ అని సీపీ సూచించారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అధికారులు ప్రజలకు న్యాయం చేసేలా నడుచుకోవాలని.. ఎలాంటి అన్యాయాలకు తావు ఇవ్వొద్దని.. హైదరాబాద్ సీపీ స్పష్టం చేశారు. ప్రజలు ఆశించిన రీతిలో పోలీసింగ్ ఉండాలని.. సిబ్బంది పని తీరు అలా ఉండటం తప్పనిసరి అని అన్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎక్కువగా రోడ్ల మీదనే ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయని సీపీ సి.వి. ఆనంద్ అన్నారు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జివోను పకడ్భందిగా అమలు చేయాలి. ప్రతి ఆఫీసులో, పోలీసు స్టేషన్లో వెంటిలేషన్ ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు. పార్టనా మందిరాలవద్ద, మా వద్ద ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండ చూసుకోవాలి. ఈ విషయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్యూనిటీ పెద్దలతో మాట్లాడి కోవిడ్ నిబంధనలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వివరించాలన్నారు.

Related Articles

Latest Articles