హుజురాబాద్ ఉప ఎన్నిక ఎవరికి… ఎందుకు కీలకం ?

ఈ నెల 30న జరగనున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తెలుగు వారినే కాదు ఢిల్లీని కూడా ఆకర్షిస్తోంది. ఈ హైవోల్టేజీ ఎన్నికను టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ అనే కంటే కేసీఆర్‌ వర్సెస్‌ ఈటల అంటే బాగుంటుందేమో. నిజానికి హుజూరాబాద్‌ ప్రజలు అలాగే పరగణిస్తున్నారు. పైగా ఈ ఉప పోరును ఒకరిపై ఒకరికి ద్వేషంతో చేస్తున్న పోరుగా చూస్తున్నారు.

ఎలా మొదలైందో కానీ.. మొత్తానికి ఆట మొదలైంది. అయితే ఈ ఆటలో ఎవరు గెలుస్తారో ఇప్పటికి ఇప్పుడు చెప్పటం కష్టం. కానీ ఇది సీఎం కేసీఆర్ తోపాటు తెలంగాణ రాష్ట్ర సమితికి అత్యంత కీలకం అన్నది మాత్రం నిజం. 119 సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌కు తిరుగులేని బలం ఉంది. కాంగ్రెస్‌కు పన్నెండు, బీజేపీకి రెండంటే రెండు. అంత బలమైన అధికార పార్టీ రాజకీయ ఆధిపత్యానికి ఈ ఉప ఎన్నిక పెద్ద పరీక్ష కాబోతోంది.

అసెంబ్లీ బాలాబలాలతో సంబంధం లేకుండా ఇప్పుడు టిఆర్ఎస్‌కు బీజేపీ సుక్కలు చూపిస్తోంది. దుబ్బాక పరాభవాన్ని గులాబీ పార్టీ ఇంకా మర్చిపోలేదు. ఏడాది క్రితం GHMC ఎన్నికల్లో అనూహ్య విజయాలు సాధించి నిజంగానే గులాబీ దళంలో గుబులుపుట్టించింది. ఇప్పుడు హుజూరాబాద్‌ తెలంగాణ రాజకీయంగా పెద్ద మైలురాయి కాబోతోంది. ఎందుకంటే దీనిని ఇద్దరు ప్రత్యర్థుల మధ్య జరుగుతున్న సాదారణ పోరులా చూడట్లేదు రాజకీయ విశ్లేషకులు. ఇద్దరు వ్యక్తుల మధ్య ద్వేషపూరిత ఆటకు హుజూరాబాద్‌ వేదిక కాబోతోంది.

భూ కుంభకోణం ఆరోపణలతో రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించిన తరువాత ఈటల బిజెపిలో చేరారు. దాంతో ఆయన రాష్ట్రంలో ఆ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరుగా మారిపోయారు. అంతేకాదు… అక్టోబర్ 7 న పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌కి ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులయ్యారు. ఈటల గతంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు మాత్రమే కాదు కేసీఆర్‌ సన్నిహితుల్లో ఒకరు. ఇప్పుడు ఆయన ప్రత్యర్థి శిబిరం నుంచి కేసీఆర్‌ కు సవాలు విసురుతున్నారు.

ఒకవేళ ఈటల గనుక ఈ ఉప ఎన్నికలో విజయం సాధిస్తే అది టీఆర్‌ఎస్‌లోని ఇతర నేతలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. కేసీఆర్‌ పట్ల మునపటి స్థాయిలో నేతలు కేసీఆర్‌ విధేయత చూపుకుండా ఇది వారిని ప్రోత్సహిస్తుంది. ఇది టీఆర్‌ఎస్‌ వర్గాలు అంటున్న మాట. అంతేకాదు ఇటు బీజేపీ కూడా ఈటల గెలుపు పెద్ద బూస్ట్ అవుతుంది. గత ఏడాది ఆ పార్టీ సాధించిన అద్భుత విజయాలకు ఇది కొనసాగింపు. అలాగే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రధాన పోటీదారుగా బీజేపీ మారుతోందన్న అభిప్రాయాలను ఈ విజయం సుస్థిరం చేస్తుంది. అయితే ఈ పోరాటాన్ని జనం కేసీఆర్‌ వర్సెస్‌ ఈటలగానే చూస్తున్నారు. కానీ టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీగా చూడట్లేదని పరిశీలకులు అంటున్నారు. ఇది బీజేపీకి నచ్చని అంశం. నిజానికి, ఈటల చేరేదాకా హుజూరాబాద్‌లో బీజేపీ ఉనికి నామమాత్రమేనని వారు గుర్తుచేస్తున్నారు. అంటే ఈటల గెలిచినా ఆ క్రెడిట్‌ పూర్తిగా బీజేపీలో ఖాతాలో పడదు. ఇది ఆ పార్టీకి నచ్చని అంశం.

ఈటల రాజేందర్ ఈ సంవత్సరం మే వరకు కేసీఆర్‌ మంత్రివర్గంలో ఆరోగ్య మంత్రిగా ఉన్నారు. భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో కేసీఆర్‌ ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించారు. ఈటలపై కొందరు రైతులు ఏప్రిల్ 30 న ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దాంతో సిఎం విచారణకు ఆదేశించారు. ఆదేశించిన కొన్ని గంటల లోపే నివేదిక ఇచ్చారు. వెంటనే ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు. ఆగమేఘాల మీద అన్నీ చకచకా అయిపోయాయి. తర్వాత నెల రోజులకు రాజేందర్ టీఆర్ఎస్ నుంచి వైదొలిగి బీజేపీలో చేరారు.

అసలు ఈటలకు కేసీఆర్‌తో ఎక్కడ చెడింది అంటే..గత కొన్ని సంవత్సరాలుగా ఇద్దరి మధ్య సంబంధాలు అంత బాగా లేవు. కేసీఆర్‌ పాలనా శైలిపై ఈటల తనచూ ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. మంత్రి పదవి ఎవరి దయకాదు..పార్టీ ఎవరి అబ్బసోత్తు కాదు..అందరూ ఓనర్లే అంటూ రకరకాల వ్యాఖ్యలు చేశారు. రాను రాను ఈటల గులాబీ పార్టీ బాస్‌కు చాలెంజ్‌గా మారతాడనే ఆందోళన బహుశా కేసీఆర్‌లో కలిగివుండవచ్చు. అందుకే ఆయనను బయటకు పంపించారని రాజకీయ వర్గాల్లో టాక్. ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన సందర్భంలో కూడా కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ క్యాబినెట్‌లో పనిచేటం బానిసగా ఉండటం కంటే అధ్వాన్నమని అన్నారు. సీఎం నిరంకుశ పాలనపై ఇద్దరి మధ్య విభేధాలు తలెత్తాయని అన్నారు.

నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ మంత్రులకు ఇవ్వలేదని, అడుగడుగునా అవమానాలకు గురయ్యారని. అపాయింట్‌మెంట్‌లు లేకుండా సిఎమ్‌ని కలవడానికి మంత్రులను అనుమతించలేదని ఈటల ఆరోపించారు. సీఎం తన కుమారుడు కేటీఆర్‌ని తన స్థానంలో కూర్చోబెట్టాలనుకుంటున్నాడని. అందుకు ఎలాంటి ఆటంకం లేకుండా తన లాంటి వారిని బయటకు పంపించి జాగ్రత్త పడుతున్నారని కూడా ఈటల ఆరోపించారు.

తెలంగాణ ఉద్యమం తొలినాళ్ల నుంచి ఈటల రాజేందర్ కేసీఆర్‌తో ఉన్నారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అంత సన్నిహితంగా ఉన్నవారు ఇప్పుడు బద్ధ శత్రువులు. ఒకరిపై ఒకరు పళ్లు నూరుకుంటున్నారు.

హుజురాబాద్ గత రెండు దశాబ్ధాలుగా ఈటల కంచుకోట. ఇక్కడి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరి ఈటల కోటను కేసీఆర్‌ బద్ధలు కొట్టగలడా అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న.

ఏదేమైనా..ఈటల రాజేందర్‌ని ఓడించడం కేసీఆర్‌కు చాలా ముఖ్యం. రాజేందర్ లాంటి “ఆత్మగౌరవం” అనే వారికి పాఠం నేర్పినట్టవుతుంది. తనకు వ్యతిరేకంగా వెళితే ఏ గతి పడుతుందో పార్టీ నాయకులకు ఓ సందేశమవుతుంది ఈ విజయం. అయతే ఇది అధికార బలానికి, ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న యుద్దమని ఈటల బహిరంగంగానే ప్రకటించారు. కాబట్టి ఇప్పడు ఈటలను ఓడిస్తే పార్టీలో అలాంటి వారు పుట్టుకురారు. అందుకే ఈటలను ఓడించటం కేసీఆర్‌ కు చాలా చాలా ముఖ్యం.

సీఎం తనదైన శైలిలో హుజూరాబాద్ ప్రచారంలో ముందు వరుసలో ఉన్నారు. ఆయన అరుదుగా బయట కనిపించినప్పటికీ ఆగస్టులో హుజూరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించారు. త్వరలో మరో భారీ బహిరంగ సభను పార్టీ ప్లాన్ చేసినట్టు సమాచారం. అయితే ఎన్నికల సంఘం ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఉప ఎన్నిక ఒక్క కేసీఆర్‌ కే కీలకం కాదు. ఈటలకు కూదా. ఇది ఆయన రాజకీయ భవిష్యత్‌తో ముడిపడి ఉంది. ఓడితే క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఇప్పటికే ప్రకటించారు. కానీ ఈ ఎన్నిక కేవలం ఆయన వ్యక్తి గత కారణాలతో వచ్చిందన్న విషయాన్ని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. అది ఆయనకు ఆత్మ గౌరవ సమస్య అయితే కావచ్చు. ప్రజలకు ఆయన రాజీనామాతో ఏమిటి సంబంధం అనే ప్రశ్న వస్తోంది. రాష్ట్రంలో కోవిడ్ నిర్వహణపై విమర్శలు వచ్చినప్పుడు కానీ, ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో కానీ ఈటల తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవి. పోరాటం అన్యాయానికి వ్యతిరేకంగా ఉండేది. కాని ఇప్పుడు భూ కబ్జా ఆరోపణలపై కేసీఆర్‌ ఆయనను తొలగించటంతో ఈ ఎన్నిక అవసరమైంది. కేవలం ఆయన వ్యక్తి గత కారణాల వల్ల వచ్చిన ఎన్నికగా చెప్పొచ్చు. మరి దీనిని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారనే దీనిమీదే ఈటల గెలుపు ఓటములు అధారపడి ఉన్నాయి.

తాను ఎలాంటి అవిధేయతను సహించబోనని రాజేందర్‌ను తొలగించటం ద్వారా కెసిఆర్ స్పష్టంగా చెప్పారు. తనకు ఎదురుతిరిగ ఎవరికైనా ఇదే గతి పడుతుంది అని ఈటలని ఓడించటం ద్వారా ఇంకా గట్టిగా సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. నియోజకంవర్గంలో నిధుల వరద పారించటమే అందుకు సాక్ష్యం.

అలాగే బిజెపితో ఈటల రాజేందర్ అనుబంధం కూడా ఎన్నికల చర్చలో కీలకం మారింది. ఈటల రాజేందర్‌ వామపక్ష వాది. అలాంటి ఆయన బీజేపీలో చేరటం నిజంగా విచిత్రమే అనిపిస్తుంది. ఆయనకు ఇష్టం ఉందో లేదో తెలియదు కానీ..ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ని ఎదుర్కోవాలంటే బీజేపీలో చేరటం ఒక్కటే మార్గమని బహుశా ఆయన భావించి వుండవచ్చు. ఇక బీజేపీకి కూడా ఆయన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణలో మెల్లమెల్లగా ఎదుగుతోంది. భవిష్యత్‌లో అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్న రాష్ట్రం. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత ఆపార్టీ అంచనాలు బాగా పెరిగాయి. ఇప్పుడు రాజేందర్‌ గెలిస్తే బీజేపీ కి మరింత బలం చేకూరుతుంది. పైగా హుజురాబాద్‌ ఈటల కంచుకోట. ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందినవాడు. పైగా దళిత ఓట్లు ఎక్కువ. ఎలా చూసినా గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వాక్బాణాల గురించి తెలియంది కాదు. ఇప్పుడు కెసిఆర్ ని ఘాటుగా విమర్శిస్తూ రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్ లో బహిరంగ సభ నిర్వహించారు. దానికి హోం మంత్రి అమిత్‌ షా హాజరై రాజేందర్‌ని ప్రశంసించారు. టీఆర్ఎస్ ధన బలం, కండ బలం కంటే ఈటల వంటి “కష్టపడి పనిచేసే” అభ్యర్థిని ఎన్నుకోవాలని రాష్ట్ర ప్రజలను కోరారు. ఐతే, హుజురాబాద్‌లో ఈటల బలాన్ని తగ్గించడం కానీ, విస్మరించడం కానీ చేయటానికి వీలు కాదు.

ఇప్పటి వరకు జరిగిన అన్ని ఉప ఎన్నికలలో కెల్లా హుజూరాబాద్‌ బై ఎలకక్షన్‌ని అత్యంత ఖరీదైనదిగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. మరి ఈ పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో ఇంకా కొన్ని రోజులు వేచి చూడక తప్పదు!!

-Advertisement-హుజురాబాద్ ఉప ఎన్నిక ఎవరికి... ఎందుకు కీలకం ?

Related Articles

Latest Articles