హుజూరాబాద్‌ షెడ్యూల్‌ విడుదల…

హుజూరాబాద్‌ సస్పెన్స్‌కు తెరపడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న షెడ్యూల్‌ విడుదలైంది. వాస్తవానికి ఈ నెల మొదట్లోనే నోటిఫికేషన్ వస్తుందని అంతా అనుకున్నారు. అయితే కోవిడ్ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల అభిప్రాయం తీసుకుంది. దాంతో తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేయాలని కోరింది. అధికార టీఆర్ఎస్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. బీజేపీ మాత్రం ఎన్నికలు నిర్వహించాలని కోరింది. అయితే ప్రభుత్వ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం హుజూరాబాద్‌ ఉప ఎన్నికను వాయిదా వేసింది. అయితే ఈటల రాజేందర్‌ రాజీనామా చేసి నాలుగు నెలలు అవుతోంది. ఆరునెలల లోపు ఖాలీగా ఉన్న నియోజకవర్గాలకు విధిగా ఎన్నికలు జరపాల్సి వుంటుంది. దాంతో ఉప ఎన్నిక షెడ్యుల్ విడుదల అనివార్యంగా మారింది.

షెడ్యూల్‌ విడుదలతో హుజూరాబాద్‌ బైపోల్‌ నగారా మోగినట్టయింది. అంటే కౌంట్‌ డౌన్‌ స్టార్టయినట్టే. టీఆర్ఎస్‌, బీజేపీ ప్రచారపర్వం తదుపరి అంకానికి చేరుతుంది. రెండు పార్టీలు గెలుపు ధీమాతో ఉన్నాయి. నోటిఫికేషన్‌ ఆలస్యం కావటంతో ఎన్నికల వేడి కాస్త చల్లారింది. కానీ తాజా ప్రకటనతో మళ్లీ పార్టీ శ్రేణుల్లో జోష్‌ వచ్చింది.

భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో తెరమీదకు వచ్చిన ఈటల ఎపిసోడ్‌ తెలంగాణ రాజకీయాలనే మార్చేసింది. హుజూరాబాద్‌ గెలుపు ఓటములు టీఆర్‌ఎస్‌, ఈటల భవిష్యత్‌ను నిర్ధేశించనున్నాయి. ఈ ఎన్నికల్లో ఓడిపోతే ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఈటల రాజేందర్‌ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాల్సిందే అనే పట్టుదలతో ఉంది. అందుకు అన్ని వనరులను ఉపయోగించుకుంటోంది. దీంతో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అత్యంత ఖరీదైన ఎన్నిక కాబోతోంది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌ని తెలుగు రాష్ట్రాలే కాదు ఢిల్లీ కూడా ఆసక్తిగా గమనిస్తోంది.

ప్రధాన ప్రత్యర్థులుగా బావిస్తున్న టీఆర్ఎస్, బీజేపీలకు చెందిన నేతలను పెద్ద ఎత్తున్న హుజూరాబాద్‌లో మకాం వేశారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతున్నారు. ఈటల రాజేందర్ పాదయాత్రతో నియోజకవర్గాన్ని చుట్టేస్తూ ఆత్మగౌరవం నినాదాన్ని బలంగా జనంలోకి తీసుకుపోతున్నారు. మరోవైపు, టీఆర్ఎస్ పలువురు మంత్రులను రంగంలోకి దింపి అభివృద్ధి మంత్రాన్ని ప్రజల మనస్సుల్లో నాటుతోంది.

మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ గులాబీ దండును నడిపిస్తున్నారు. హుజూరాబాద్‌లోనే మకాం వేసి కథ నడిపిస్తున్నారు. వారితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు హుజూరాబద్‌ను చుట్టేస్తున్నారు. ఎక్కడికక్కడ కుల సంఘాలతో మీటింగ్‌లు పెట్టి హామీల వర్షం కురిపిస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన దళిత బంధు స్కీం టీఆర్‌ఎస్‌ తురుపు ముక్క కానుంది.

ఎన్నికల నేపథ్యంలో హుజూరాబాద్‌లో నిధుల వరద పారుతోంది. మంత్రులు నియోజవర్గం కలియతిరుగుతూ సమస్యలు తెలుసుకుంటున్నారు. కుల సంఘాలకు స్థలాలు, భవనాలకు నిధులు కురిపిస్తున్నారు. జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీల పనులకు కావాల్సిన నిధులను వచ్చేశాయి. డ్వాక్రా మహిళలకు కావాల్సిన నిధులు అందిస్తూ వారి మెప్పుకు కృషి చేస్తున్నారు. ఇలా అధికార పార్టీ అన్ని వర్గాలను ఆకట్టుకుంటోంది. అయితే అది ఓట్లుగా మారతాయా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.

టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా బీసీ అభ్యర్థిని బరిలో దించింది. ఇక దళితులను ఆకట్టుకునేందుకు దళితబంధు ఉండనే ఉంది. దీని ద్వారా నియోజకవర్గంలోని 20వేల కుటుంబాలకు ఆర్థికగంఆ లబ్ధి చేకూరుతుంది. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఈ నియోజకవర్గంలో దాదాపు 40వేల దళిత ఓట్లున్నాయి. దళితబంధును విమర్శించే సాహసం ఏ రాజకీయ పార్టీ చేయట్లేదు.

ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత నియోజవర్గంలోనే మాకం వేశారు. అనంతరం పాదయాత్ర నిర్వహించారు. అయితే అనారోగ్య కారణాలతో దాన్ని విరమించినా… నిత్యం నియోజకవర్గంలోనే ఉంటూ ఆయన భార్య జమునతోపాటు ఈటల రాజేందర్ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఈటల రాజేందర్ ప్రచారానికి ఆయన చేసిన అభివృద్దితోపాటు ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న దళిత బంధు లాంటి పథకాలు తన రాజీనామా వచ్చాయని ప్రచారం చేస్తున్నారు. దీంతో పాటు బీజేపీ అగ్రనాయకులతో ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు.

మరోవైపు, షెడ్యూల్‌ విడుదలతో అక్కడ ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. కరీంనగర్‌, హనుమకొండ జిల్లాల్లో కోడ్‌ అమలులో ఉంటుంది. ఈవీఎంల మొదటి దశ తనిఖీ పూర్తయింది. ఉప ఎన్నిక కోసం 305 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి తెలిపారు. అవసరమైతే అదనపు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 2,36,269 మంది ఓటర్లున్నారు. ఎన్‌ఆర్‌ఐ, సర్వీస్ ఓటర్లను కలిపితే ఓటర్ల సంఖ్య 2,36,430కి చేరుతుంది.

అక్టోబర్ ముప్పైన ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌లో పేర్కొంది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్ దాఖలుకు అక్టొబర్ 8 చివరి తేదీ. కాగా ఉప సంవసంహరణకు అక్టోబర్ 13 వరకు గడువు ఉంటుంది. అక్టోబర్‌ 30న పోలింగ్‌, నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి. ముప్పై రోజుల ప్రణాళికతో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

-Advertisement-హుజూరాబాద్‌ షెడ్యూల్‌ విడుదల...

Related Articles

Latest Articles