ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గాలి వీయనుందా?

త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ, ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇరుపార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. పంజాబ్ లో కాంగ్రెస్ కు చెక్ పెట్టేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇదే సమయంలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ రెండు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న సంఘటనలు కాంగ్రెస్ కు కొత్త దారిని చూపిస్తున్నాయి. దీంతో ఆ పార్టీలో నయా జోష్ కన్పిస్తుందనే టాక్ విన్పిస్తోంది.  

పంజాబ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తిరిగి ఇక్కడ అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల సీఎం అభ్యర్థిని సైతం మార్చివేసింది. ప్రతిపక్షాల ప్లాన్ ను ముందుగానే గ్రహించిన కాంగ్రెస్ అందుకు తగ్గటుగానే ఎస్సీ వర్గానికి చెందిన చరణ్ జిత్ సింగ్ ను సీఎం చేసింది. ఇది ఆ పార్టీకి అడ్వాంటేజ్ గా మారుతుందని అంతా భావిస్తున్నారు. అయితే ఆపార్టీలో నెలకొన్న అధిపత్య పోరు ఆపార్టీని ఇరుకునపెడుతోంది.  

ఈక్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ నేతల్లో నెలకొన్న అసంతృప్తిని దూరం చేసేలా అధిష్టానం ప్లాన్ చేస్తోంది. ఎన్నికల్లో ఈ ప్రభావం ఏమాత్రం లేకుండా చూడాలని భావిస్తోంది. అయితే అధిష్టానం ప్రయత్నాలు బెడిసి కొడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణమాలన్నీ కూడా బీజేపీకి అడ్వాంటేజ్ గా మారుతున్నాయి. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో మాత్రం కాంగ్రెస్ బలపడుతుండటం బీజేపీకి మైసస్ గా మారుతోంది.

ఉత్తరప్రదేశ్ లో ఓ కేంద్ర మంత్రి కుమారుడు రైతులపై కారును ఎక్కించి నలుగురు ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. దీనిపై యోగీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం బీజేపీకి మైనస్ గా మారింది. ఇదే సమయంలో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు రైతుల పక్షాన పోరాడుతున్నాయి. ఇప్పటికే కేంద్ర సర్కారు రైతు వ్యతిరేక చట్టాలు చేస్తుందనే విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే ఈ సంఘటన జరుగడం బీజేపీని మరింత ఇరుకున పెడుతోంది.

ఉత్తరాఖండ్ లో బీజేపీ అధికారంలో వచ్చినప్పటి నుంచే ఆపార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గడిచిన నాలుగేళ్లలో ఇక్కడ ముగ్గురు సీఎంలను బీజేపీ మార్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నేతల మధ్య అనైక్యత స్పష్టంగా కన్పిస్తుంది. అధిష్టానం ఎన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టినా నేతల వైఖరిలో మార్పు రావడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఓ మంత్రి బీజేపీకి రాజీనామా చేసి తన కుమారుడితో సహా కాంగ్రెస్ లో చేరారు.

సదరు మంత్రి బాటలోనే మరికొంతమంది ఎమ్మెల్యే, మంత్రులు బీజేపీని వీడుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితులన్నీ కూడా బీజేపీకి మైనస్ గా మారుతున్నాయి. ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్ది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీజేపీలో పుట్టిన ముసలం కాంగ్రెస్ కు అనుకూలంగా మారేలా కన్పిస్తున్నాయి. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ గాలి వీస్తుందా? అనే చర్చ సైతం జోరుగా నడుస్తోంది. ఈ పరిస్థితుల నుంచి బీజేపీ ఎలా గట్టెక్కుతుందనేది మాత్రం వేచిచూడాల్సిందే..!

-Advertisement-ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గాలి వీయనుందా?

Related Articles

Latest Articles