సంచలనం సృష్టిస్తున్న ‘హౌస్ ఆఫ్ సీక్రెట్స్: ది బురారీ డెత్స్’

1 జులై 2018. ఢిల్లీ సబర్బన్ ఏరియా బురారీ ప్రాంతంలో కల్లోలం చెలరేగింది. అక్కడో ఊహించని సంఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మరణించారు. వారిది హత్యో, ఆత్మహత్యో తెలియని పరిస్థితి. మూడు తరాలకు చెందిన ఓ కుటుంబం మరణం వెనుక కారణాలు ఏమిటనేది ఆ క్షణాన ఎవరికీ తెలియ రాలేదు. ఉదయం మార్నింగ్ వాక్ కు రావాల్సిన లలిత్ చుందావత్ తన ఇంటి నుండి బయటకు రాకపోవడంతో అతని స్నేహితుడికి అనుమానం వచ్చింది. అలానే వాళ్ళకు సంబంధించిన దుకాణం కూడా అప్పటికి తెరవకపోవడంతో అది బలపడింది. పోలీసుల సాయంతో రెండతస్తుల ఆ భవంతి ప్రధాన ద్వారా తెరచి లోపలకు వెళితే ఇంట్లోని 10 మంది మర్రి చెట్టు ఊడల మాదిరి ఇంటి మధ్యలోని ఓ ఐరన్ రాడ్ కు విగతజీవులై వేలాడుతూ కనిపించారు. వారిలో అందరి కంటే పెద్దదయిన 80 వృద్ధ మహిళ పక్క గదిలో శవమై ఉంది. అయితే… ఈ చనిపోయిన 11 మంది కాకుండా అక్కడ బతికి ఉన్న జీవి ఒకటి ఉంది. అది ఆ ఇంటి కుక్క. టెర్రస్ మీద దాన్ని కట్టేయడంతో ఇంట్లో ఏం జరిగిందనేది దానికి తెలియనే తెలియదు.

ఒళ్ళు గగుర్పొడిచే ఈ మరణాల నేపథ్యాన్ని తెలుపడం కోసం ప్రముఖ దర్శకురాలు లీనా యాదవ్ ముందుకొచ్చారు. ‘హౌస్ ఆఫ్ సీక్రెట్స్: ది బురారీ డెత్స్’ పేరుతో ట్రూక్రైమ్ డాక్యూ సీరిస్ కు తెర తీశారు. ఈ కేసును ఇన్వెస్ట్ గేట్ చేసిన పోలీసు అధికారులను, లలిత్ ఇంటిచుట్టు పక్కల వ్యక్తులను, దూరపు బంధువులను ఇంటర్వ్యూ చేశారు.

పదకొండు శవాలు ఉన్న ఆ ఇంటిలో పదకొండు డైరీలు పోలీసులకు లభ్యమయ్యాయి. వాటిలోని రాతలకు, ఈ మరణాలకు సంబంధం ఉందని తేలింది. 2006లో తండ్రిని కోల్పోయిన లలిత్… ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన ఆత్మ తనతో మాట్లాడుతోందనే భావనకు లోనయ్యాడు. తన తండ్రి ఇచ్చిన సందేశాలంటూ ఓ క్రమంలో వరుసగా డైరీలు రాశాడు. పెద్దాయన ఇలా చేయమన్నాడంటూ ఇంటిలోని సభ్యులందరినీ ఆత్మహత్యకు సిద్దం చేశాడు. లలిత్ మాటలనే వేదవాక్కుగా వారంతా పాటించడమే అందరికీ విడ్డూరాన్ని కలిగించే అంశం.

లీనా యాదవ్ తెరకెక్కించిన ఈ డాక్యూ సీరిస్ చూసినప్పుడు రోమాంచితమౌతుంది. మనుషులు ఇంత త్వరగా ఎదుటివారి ప్రభావానికి లోనై ప్రాణాలను సైతం తీసుకోవడానికి సిద్ధపడతారా? అనే సందేహం కలుగుతుంది. మానసికమైన సమస్యలతో బాధ పడుతున్న వ్యక్తులను కుటుంబ సభ్యులు వైద్యులకు చూపించకుండా, దానిని దాచిపెట్టడం వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయో ఈ డాక్యూ సీరిస్ చూస్తే అర్థమౌతుంది.

అక్టోబర్ 8 న ‘హౌస్ ఆఫ్ సీక్రెట్స్ : ది బురారీ డెత్స్’ డాక్యూ సీరిస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది. మొదటి ఎపిసోడ్ ’11 బాడీస్’ 46 నిమిషాలు, రెండో ఎపిసోడ్ ’11 డైరీస్’ 43 నిమిషాలు, మూడో ఎపిసోడ్ ‘బియాండ్ 11’ 48 నిమిషాల నిడివి ఉంది. ఎలాంటి సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా, ఓ దురదృష్టకర సంఘటన, దాని వెనుక అసలు కారణాలను లీనా యాదవ్ ఆసక్తికరంగా ఈ డాక్యూ సీరిస్ ద్వారా తెలియచేశారు. అయితే… ఈ కేసును జనం ముందుకు తీసుకొచ్చే క్రమంలో ఆ చుట్టుపక్కల వారిని, అలానే వైద్య నిపుణులను మరింత ఆసక్తికరమైన, ఉపయోగకరమైన ప్రశ్నలు వేసి ఉండాల్సింది. దాని వల్ల సమాజంలోఅవేర్ నెస్ తీసుకొచ్చే ఆస్కారం ఉండేది. ఏదేమైనా… ఓ భయానక సంఘటనకు కమర్షియాలిటి పేరుతో రంగులు అద్దకుండా… ఉన్నది ఉన్నట్టుగా చూపించడం, అందులోనూ ఆసక్తి రేకెత్తేలా చూపడం అనేది గొప్ప విషయం. అందుకు ఎ.ఆర్. రెహమాన ఇచ్చిన నేపథ్య సంగీతం కూడా కొంత ఉపయోగపడింది. అందుకే ‘హౌస్ ఆఫ్ సీక్రెట్స్: ది బురారీ డెత్స్’ ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది.

-Advertisement-సంచలనం సృష్టిస్తున్న 'హౌస్ ఆఫ్ సీక్రెట్స్: ది బురారీ డెత్స్'

Related Articles

Latest Articles