సంచలనంగా మారుతున్న మాజీ మంత్రి వ్యాఖ్యలు ?

ఆ మాజీ మంత్రి కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారారా? విపక్షాలు వేగం పెంచడంతో టంగ్‌ స్లిప్‌ అవుతున్నారా? వివాదాస్పద కామెంట్స్‌ ప్రచారం కోసమా లేక ఫస్ట్రేషన్‌తో చేస్తున్నారా? ఎవరా మాజీ మంత్రి?

హామీ ఇస్తే విపక్షాలకు 6 నెలలు అధికారం అప్పగిస్తారట!

జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. మాజీ మంత్రి కూడా. ఈ మధ్య కాలంలో ఆయన చేస్తున్న కామెంట్స్‌ సంచలనంగా మారుతున్నాయి. ఆయనకు ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నారు? అనే ప్రశ్నలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలను నిలిపివేసి.. ఎన్నికల ముందు వాటిని పెట్టాలని ఒకసారి.. మున్సిపల్‌ ఎన్నికల వేళ ఓట్లు తక్కువొస్తే డబుల్ బెడ్‌రూమ్‌లు ఇవ్వబోనని ఇంకోసారి చెప్పి కలకలం రేపారు. తాజాగా ఇంటికో ఉద్యోగం ఏ ప్రభుత్వానికైనా సాధ్యమయ్యే పనేనా? కోటి కుటుంబాలుంటే కోటి ఉద్యోగాలు ఇవ్వలగమా? దీనికి మూడింత బడ్జెట్‌ కూడా సరిపోదని లక్ష్మారెడ్డి చెప్పుకొచ్చారు. దళితబంధుపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు మరింత మసాలా జోడించారు ఈ మాజీ మంత్రి. దళిత, బీసీ, మైనారిటీ బంధు ఇస్తామని బీజేపీ, కాంగ్రెస్‌లు రాతపూర్వకంగా హామీ ఇస్తే ఆర్నెళ్లు వారికి అధికారం అప్పజెబుతామని సవాల్‌ విసిరారు. ఈ కామెంట్సే ఇప్పుడు రచ్చ రచ్చగా మారాయి.

జడ్చర్ల టీఆర్ఎస్‌లో జరుగుతున్న ప్రచారం ఆలోచనలో పడేసిందా?

టీఆర్ఎస్‌ తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు లక్ష్మారెడ్డి. టీఆర్‌ఎస్‌ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినా.. లక్ష్మారెడ్డికి కేబినెట్‌లో చోటు దక్కలేదు. మళ్లీ మంత్రి కావాలనే ఆశ ఆయనలో ఉండిపోయిందట. లేదా కేబినెట్‌ హోదా పదవి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారట. రోజులు గడిచిపోతున్నాయే కానీ.. పదవియోగం లేదు. జడ్చర్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఇదే సమయంలో మరోచర్చ జరుగుతోంది. జడ్చర్లలో వచ్చే ఎన్నికల నాటికి కొత్త నేత ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతారని.. లక్ష్మారెడ్డిని ఎంపీగా పోటీ చేయిస్తారని ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం మాజీ మంత్రిని ఆలోచనలో పడేసినట్టు సమాచారం.

కాంగ్రెస్‌ గేర్‌ మార్చడంతో లక్ష్మారెడ్డి దూకుడు పెంచారా?

జడ్చర్లకు వదిలిపెట్టే ఉద్దేశం లేదో ఏమో.. రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నట్టు చెప్పడానికి లక్ష్మారెడ్డి కాంట్రవర్సీ కామెంట్స్‌ చేస్తున్నారని టీఆర్ఎస్‌ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయట. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌ అయ్యాక.. జడ్చర్లలో కాంగ్రెస్‌ నేతలు యాక్టివ్‌ అయ్యారు. అదే పనిగా లక్ష్మారెడ్డిపై గురిపెడుతున్నారు. ముఖ్యంగా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ కాంగ్రెస్‌లో చేరాక నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మారాయని టాక్‌. అప్పటి నుంచీ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి దూకుడు పెంచారని అనుకుంటున్నారు. ఆ క్రమంలోనే లక్ష్మారెడ్డి కామెంట్స్‌ చేస్తున్నారని.. అవి కాస్తా వివాదాస్పదం అవుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. జడ్చర్ల పరిణామాలపై ఆయన నోటికి పని చెబుతున్నా.. వ్యాఖ్యలు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా చర్చగా మారుతున్నాయి. మరి.. సంగతి గుర్తించారో లేదో కానీ.. తరచూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు మాజీ మంత్రి.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-