17న విడుదలవుతున్న ‘హానీ ట్రాప్’

సందేశాత్మక అంశాలను కమర్షియల్ యాంగిల్ లో తెరకెక్కించే దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి. గతంలో ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, రొమాంటిక్ క్రిమినల్స్, వలస, గల్ఫ్’ లాంటి సందేశాత్మక సినిమాలును ఆయన రూపొందించారు. ఇప్పుడు సమకాలీన కథతో తెరకెక్కించిన ‘హనీ ట్రాప్’ మూవీని సెప్టెంబర్ 17 న విడుదల చేయటానికి సిద్ధమౌతున్నారు. రిషి, శిల్ప నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను వి. వి. వామనరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించిన నిర్మాత వామనరావు ఓ కీలక పాత్ర కూడా పోషించడం విశేషం.

ఈ సినిమా గురించి వామనరావు మాట్లాడుతూ, ”మిత్రుడు పి.యల్.కె. రెడ్డి ద్వారా సునీల్ కుమార్ రెడ్డి గారు పరిచయమయ్యారు. ఆయన రొమాంటిక్ సినిమాలు తీసినా అందులో అండర్ కరెంట్ మెసేజ్ తప్పకుండా ఉంటుంది. తను తీసిన రొమాంటిక్ సినిమాలన్నీ కమర్షియల్ గా విజయం సాధించాయి. ఆ సినిమాల కంటే భిన్నంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు మంచి మైలేజ్ వస్తుందనే నమ్మకం ఉంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఇందులోని సీన్స్ కట్ చేస్తే మూలకథకు ఇబ్బంది అవుతుందని భావించి, సీన్స్ కట్ చేయకుండానే మమ్మల్ని ప్రశంసించి, ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇది మేము గ్రేట్ అచీవ్మెంట్ గా భావిస్తున్నాం” అని అన్నారు.

దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ”నేను దర్శకత్వం వహించిన సినిమాలకు కథ నేనే రాసుకునే వాడిని. మొదటిసారి బయటి కథను డైరెక్ట్ చేశాను. నేనెప్పుడూ కాన్టెంపరరీ కథలు చేస్తుంటాను. వామనరావు గారు చాలా సెన్సిబుల్ రైటర్. నంది అవార్డు పొందిన నాటకాలను రచించిన రచయిత. ‘హనీ ట్రాప్’కు మంచి కథను ఇచ్చారు. మా ‘గల్ఫ్’ సినిమాలో నటించిన డింపుల్ బాలీవుడ్ కు ఎలా వెళ్ళిందో.. అలాగే ఈ చిత్రంలో నటించిన వారందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బి. బాపిరాజు, హీరోహీరోయిన్లు రిషి, శిల్ప నాయక్ కూడా పాల్గొన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-