కాలుష్యానికి కేరాఫ్‌ అడ్రస్‌గా దేశ రాజధాని…

కాలుష్యానికి కేరాఫ్‌ అడ్రస్‌గా దేశ రాజధాని ఢిల్లీ మారిపోయింది. పరిస్థితి ప్రమాదకర స్థాయికి చేరింది. ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాలలో గాలి నాణ్యత ఘోరంగా దిగజారింది. ప్రతి ఏటా వింటర్‌లో ఈ బాధ తప్పట్లేదు. దాంతో చలికాలం వస్తోందంటే జనం భయంతో వణికిపోయే పరిస్థితి ఏర్పడింది.

ఇప్పుడు ఢిల్లీలో గాలి విషంతో సమానం. ఊపిరితిత్తుల క్యాన్సర్, హృద్రోగాల వల్ల కలిగే మరణాల్లో 33 శాతం వాయు కాలుష్యం వల్లే సంభవిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు తలెత్తిన ప్రతిసారి ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం కోసం ప్రయత్నిస్తోంది.

ప్రపంచంలోని కాలుష్య రాజధానుల్లో ఢిల్లీదే అగ్ర స్థానం. ఇలా తొలి స్థానంలో నిలవడం వరసగా ఇది మూడోసారి. ప్రపంచంలోని టాప్‌ -30 పొల్యూటెడ్‌ సిటీస్‌లో మనవే 22 ఉన్నాయి. ఇక కాలుష్య దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది. స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ IQ Air నివేదికలో ఈ విషయాలు తెలిశాయి. ప్రపంచ వ్యాప్తంగా 30 నగరాలు అ‍త్యంత కలుషితమైనవిగా గుర్తించారు. చైనాలోని జింజియాంగ్‌.. ప్రపంచంలో అత్యంత కలుషిత నగరంగా నిలిచింది. ఆ తర్వాత 9 నగరాలు భారత్‌కు చెందినవే కావడం గమనార్హం.

ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడింది. గాలి నాణ్యత మెరుగుకు తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై ఢిల్లీ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్కారు కుంటిసాకులు చెపుతోందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న ఆదాయాలపై ఆడిట్ నిర్వహించాలని సూచించింది.

చెత్తను తగులబెట్టడంతో పాటు రవాణా, పరిశ్రమలు, వాహనాల రాకపోకలు వాయు కాలుష్యానికి ప్రధాన కారణమని సుప్రీంకోర్టు గుర్తించింది. ఐతే, ఏయే పరిశ్రమలను ఆపవచ్చు, ఏ వాహనాలను నడపకుండా నిరోధించవచ్చు, ఏ విద్యుత్ ప్లాంట్లను నిలిపి వేయవచ్చు, ప్రత్యామ్నాయ విద్యుత్‌ను ఎలా అందించాలనే దానిపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాలని స కోరింది.

ఇదిలావుంటే, పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సర్కార్‌ ఈనెల 20 వరకు స్కూళ్లు మూసి వేసింది. గవర్నమెంట్‌ ఆఫీసులు క్లోజ్‌ అయ్యాయి. ఉద్యోగులు కొద్ది రోజులు ఇంటి నుంచి పనిచేస్తారు. నిర్మాణ కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. డీజిల్ జనరేటర్లు, బొగ్గు బట్టీలు మూతపడ్డాయి. వ్యక్తిగత వాహన వినియోగాన్ని తగ్గించేందుకు పార్కింగ్ ఫీజు భారీగా పెరిగింది. దీనివల్ల ప్రజలు ప్రజారవాణాను ఆశ్రయిస్తారు. అందుకే మెట్రో రైళ్లు, బస్సుల ఫ్రీక్వెన్సీ పెరిగింది.

పొరుగు రాష్ట్రాల నుంచి వెలువడే కాలుష్యం ఢిల్లీకి శాపమైంది. పంట వ్యర్థాల దహనం, వాహన ఉద్గారాలు , చుట్టుపక్కల ఉన్న థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు, పరిశ్రమలు, చెత్త కాల్చడం, దుమ్ము దూళి కారణంగా ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. చలి కాలంలో ఢిల్లీ వాసులకు కాలుష్యం పెద్ద సమస్యగా మారింది. ఈ సమయంలో రాజధానిని కాలుష్యం ముంచెత్తడానికి ప్రధాన కారణం పొరుగు రాష్ర్టాలు. అక్కడి రైతులు పంట వ్యర్థాలను పెద్ద ఎత్తున దహనం చేస్తున్నారు.

పారిశ్రామిక, వాహన కాలుష్యం, భవన నిర్మాణల వల్ల ఏర్పడే ధూళి వల్ల కూడా ఢిల్లీలో పరిస్థితి జటిలమవుతోంది. కనీసం మన ముందున్న వస్తువులను కూడా చూడలేనంతగా పొగమంచు కమ్మేసింది. ఒక్క ఢిల్లీలోనే కాదు దేశంలోని నగర ప్రాంతాలన్నిటిని కాలుష్యం కాటేస్తోంది. ముఖ్యంగా ఉత్తారిధిలో తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంది. ఉత్తర భారతదేశంలోని 48 కోట్ల మంది ప్రజలు ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన వాయు కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో ఈ అధిక వాయు కాలుష్య స్థాయిలు ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తాయి.

ప్రపంచ కాలుష్య ర్యాంకింగ్‌లలో భారతీయ నగరాలు ముందు వరుసలో ఉన్నాయి. ప్రతి ఏడాది 10 లక్షల మందిని కాలుష్యం కాటేస్తోంది. మన నగర ప్రజలు ప్రపంచం కన్నా 10 రెట్లు ఎక్కువ కాలుష్యం బారినపడుతున్నారు. అత్యంత కలుషితమైన ఐదు దేశాల్లో బంగ్లాదేశ్, భారతదేశం, నేపాల్, పాకిస్తాన్‌లు ఎప్పుడూ ఉంటాయి.

వాయు కాలుష్యం వల్ల నగర ప్రాంత ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారినపడుతున్నారు. కాలుష్యం వల్ల భారతీయుల ఆయుష్షు తగ్గుతుందని అధ్యయనాలు అంటున్నాయి. గత ఇరవై ఏళ్లలో భారతీయుని సగటు ఆయుర్దాయం మూడేళ్లు తగ్గింది.

వాయు కాలుష్యంతో పాటు ప్లాస్టిక్‌ కాలుష్యం కూడా పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. 60కి పైగా దేశాలు ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధించాయి. భారత్‌లోనూ కొన్ని రాష్ట్రాల్లో దీనిపై ఆంక్షలున్నాయి. ఒకసారి ఉపయోగించిన తరువాత వీటిని రీసైకిల్ చేస్తారు. లేదా వ్యర్థంగా పడేస్తారు. ప్లాస్టిక్ బ్యాగ్‌లు, నీళ్ల సీసాలు, సోడా సీసాలు, స్ట్రాలు, ప్లేట్లు, కప్పులు, ఫుడ్ ప్యాకేజీ కంటెయినర్లు తదితర ప్లాస్టిక్ వస్తువులు ఇలాంటివే. 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉండే ప్లాస్టిక్ సంచులను సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ అంటున్నారు.

1950 నుంచీ ప్లాస్టిక్ ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. ఇప్పుడు పదార్థాలన్నింటినీ ప్లాస్టిక్ దాటేసింది. ప్రపంచ ప్లాస్టిక్ వ్యర్థాల్లో సగం శాతం వరకు ప్యాకేజీ రూపంలోని ప్లాస్టిక్‌. దేశాల వారీగా చూస్తే ప్యాకేజీ ప్లాస్టిక్ వ్యర్థాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. నగరాలవారీగా చూస్తే ఢిల్లీలో రోజుకు 700 టన్నులకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. తర్వాత స్థానాల్లో చెన్నై, కోల్‌కతా,ముంబయి ఉన్నాయి.

పాలిథీన్ బ్యాగ్స్‌ వాడకంపై అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆంక్షలు పెట్టాయి. కానీ అమలులో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. కర్నాటక, పంజాబ్‌ రాష్ట్రాల్లో నిషేధిత ప్లాస్టిక్‌ సంచులు విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఒకటి రెండు రాష్ట్రాలు మినహాయిస్తే దాదాపు అంతటా ఇలాంటి పరిస్థితినే చూస్తాం. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఒకటి నుంచి ఐదు ట్రిలియన్ టన్నుల ప్లాస్టిక్ బ్యాగ్‌లు వినియోగంలో ఉన్నాయి. ప్లాస్టిక్ బ్యాగులు, ఫుడ్ ప్యాకేజీ కంటెయినర్లు పర్యావరణంలో కలిసేందుకు వెయ్యేళ్లు పడుతుంది.

ప్లాస్టిక్‌ పదార్థాల్లో పలు విషపూరిత రసాయనాలుంటాయి. ఇవి మనిషిని వ్యాధుల బారినపడేస్తాయి. అనేక రుగ్మతలకు దారితీస్తాయి. అంతేకాదు నేలకు కూడా వీటి వల్ల ముప్పే. పండించే పంటలతోపాటు జల వనరులూ కాలుష్యం అవుతాయి. జలచరాల ప్రాణాలకూ ఇవి ముప్పుగా పరిణమించాయి.

రీసైకిల్ చేయడం, తగలబెట్టడం, నేలలో పాతిపెట్టడం, చెత్తకుప్పలుగా పోసి ఈ ప్లాస్టిక్‌ను నిర్మూలిస్తారు. మొత్తం ప్లాస్టిక్‌లో రీ-సైకిల్ అయ్యేది కేవలం 10 శాతం కన్నా తక్కువే. ఎక్కువ భాగాన్ని గాలికి వదిలేస్తున్నాం.

పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో భారత్‌ విశేష కృషి జరుపుతోంది. ప్రధాని మోదీ పర్యావరణ అంశాల్లో క్రియాశీలంగా ఉన్నారు. 2014లో ప్రధాని పదవి చేపట్టిన తరువాత పలు కీలక చర్యలు చేపట్టారు. 2022 నాటికి భారత శుద్ధ ఇంధన సామర్థ్యం 1,75,000 మెగావాట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ లక్ష్యాన్ని రెట్టింపు చేశారు. ఫ్రాన్స్ తో కలిసి సౌర కూటమి ఏర్పాటు చేసింది. ఇందులో ఇప్పుడు 100 సభ్య దేశాలున్నాయి. సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచి తక్కువ ధరకు అందుబాటులోకి తేవటం ఈ కూటమి లక్ష్యాలు. మోదీ ప్రవేశపెట్టిన ఉజాలా పథకంతో దేశంలో ఎల్‌ఈడీ బల్బుల వినియోగం పెరిగింది.

మన్మోహన్ సింగ్‌ హయాంలో కూడా పర్యావరణం పట్ల భారత్‌ విశేష కృషి చేసింది. దక్షిణాఫ్రికా, బ్రెజిల్, చైనాలతో కలిసి భారత్ BASIC కూటమిని ఏర్పాటు చేసింది. ‘ఫ్రిజ్‌లు, ఏసీలు వంటి వాటి కర్బన ఉద్గారాల పరిమితుల స్థాయిలను 2007లోనే నిర్ణయించారు. తయారీదారులకు రెండేళ్ల గడువు ఇచ్చి 2009 నుంచి వాటిని తప్పనిసరి చేశారు. ఇంధన పరిరక్షణ గైడ్‌లైన్స్‌ని 2007లోనే ప్రవేశపెట్టారు.

ప్రపంచ వాతావరణ మార్పులపై ఈ నెల 1 నుంచి 12 వరకు యూకేలో కాప్-26 సదస్సు జరిగింది. 2015 పారిస్ ఒప్పందం విజయాలు, వైఫల్యాలపై ఈ సమావేశాల్లో చర్చించారు. భూతాపం 1.5 డిగ్రీ సెల్సియస్‌ గ్రేడ్‌ దాటకుండా కట్టడి చేసేందుకు ఇదే చివరి అవకాశమని కాప్ 26 సదస్సు పిలుపునిచ్చింది. 1.5 దాటితే ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు.

కార్బన్ డయాక్సైడ్‌ను అత్యధికంగా విడుదల చేస్తున్న దేశం చైనా. ప్రపంచంలో పావు వంతు ఉద్గారాలకు ఈ దేశమే కారణం. 2026 నాటికి బొగ్గు వాడకాన్ని తగ్గిస్తామని చైనా వాగ్దానం చేసింది. అమెరికాలో 80 శాతం కన్నా ఎక్కువ ఇంధన శక్తి శిలాజ వనరుల నుంచి వస్తోంది. అయితే, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం క్రమంగా పెరుగుతోంది.కాగా, గ్రీన్ ఎనర్జీని మరింత విస్తరించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. యురోపియన్‌ యూనియన్‌ దేశాల్లో జర్మనీ, ఇటలీ, పోలండ్ కర్బన ఉద్గారాల్లో ప్రథమ స్థానంలో ఉన్నాయి.

కాలుష్యం మనుషుల మీదే కాదు ఇతర జీవరాశుల మీదా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా పక్షలపై. కాలుష్యం వల్ల ఇప్పటికే పలు పక్షి జాతులు కరుమరుగయ్యాయి. గత ఐదు దశాబ్దాలలో భూమి మీద పక్షుల సంఖ్య 29 శాతం క్షీణించింద లెక్కలు చెబుతున్నాయి. మానవ కార్యకలాపాల వల్ల ఆవాసం కోల్పోవడం ఈ క్షీణతకు ప్రధాన కారణం.

గతంలో మన ఇంటి పెరట్లో నిత్యం కనిపించే పక్షులు ఇప్పుడు కనిపించట్లేదని మీరు ఎప్పుడైనా గమనించారా! గమనించి ఉంటే వాటిని కాలుష్య రక్కసి మింగేసిందని అర్థమయ్యేది!!

Related Articles

Latest Articles