‘వీలైతే ఓ వెబ్ సిరీస్… కుదిరితే ఒక కొత్త సినిమా’ అంటోన్న ‘బొమ్మరిల్లు’ సిద్ధూ!

‘బాయ్స్’ సినిమాతో హీరో అయిన సిద్ధార్థ్ కోలీవుడ్ లో ఎంత పేరున్న నటుడో టాలీవుడ్ లోనూ అంతే పాప్యులర్. అయితే, ఒక దశలో తెలుగులోనూ డైరెక్ట్ చిత్రాలు చేస్తూ యమ బిజీగా ఉన్న ‘బొమ్మరిల్లు’ స్టార్ గ్రహాలు కలసి రాకో, స్వయంకృతాపరాధం వల్లో బాగా వెనుకబడ్డాడు. తమిళంలో ఈ ‘హ్యాండ్సమ్ పయ్యన్’ పరిస్థితి ఫర్లేదు అన్నట్టుగానే కొనసాగుతూ వస్తోంది. కాకపోతే, ఈ మధ్య కాలంలో మన లవర్ బాయ్ కి మరోసారి టైమొచ్చినట్టు కనిపిస్తోంది!

2019లో ‘అరువమ్’ సినిమాలో కనిపించిన సిద్ధార్థ్ మళ్లీ ఇంత వరకూ తెర మీదకు రాలేదు. ఆయన ఖాతాలో కొన్ని సినిమాలు ఉన్నప్పటికీ కరోనా కారణంగా ఆలస్యం అవుతూ ఉన్నాయి. అయితే, త్వరలోనే మణిరత్నం ‘నవరస’ వెబ్ సిరీస్ లో సిద్ధూ కనిపించబోతున్నాడు. అంతే కాదు, శంకర్ ‘ఇండియన్ 2’లోనూ ఆయన ఉన్నాడు. కార్తీక్ జీ. క్రిష్ అనే డైరెక్టర్ ‘టక్కర్’ మూవీలో కూడా సిద్ధార్థే హీరో. అయితే, ఇవన్నీ కాకుండా ‘మహాసముద్రం’ సినిమాలో శర్వానంద్ తో పాటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు! చాలా గ్యాప్ తరువాత ఓ స్ట్రెయిట్ తెలుగు మూవీలో సిద్ధూ ఇప్పుడే కనిపిస్తుండటం విశేషం…

తెలుగులో కమ్ బ్యాక్ కి రెడీ అవుతోన్న సిద్దూ వెబ్ సిరీస్ తోనూ అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. మరోవైపు, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ స్టార్ కి కోలీవుడ్ లో కొత్త ఆఫర్ కూడా ఒకటి వచ్చింది. ధనుష్ తో ‘మారీ’ లాంటి సక్సెస్ ఫుల్ సినిమా తీసిన బాలాజీ మోహన్ ఈయనతో ఓ మూవీకి రెడీ అయ్యాడట. సెప్టెంబర్ చివర్లో షూటింగ్ ప్రారంభమయ్యే ఈ ఎంటర్టైనర్ ‘వై నాట్ స్టూడియోస్’ నిర్మిస్తోంది. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది…

మధ్యలో కొంత కాలం స్లో అయిన సిద్ధార్థ్ మరోసారి తెలుగు, తమిళ రంగాల్లో బిజీ అవుతాడా? ఓటీటీలోనూ సత్తా చాటుతాడా? మరి కొద్ది రోజులు ఆగితేగానీ… చెప్పలేం!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-