ప్రధాని కాన్వాయ్ ఘటన ఓ డ్రామా.. హీరో సిద్ధార్థ్ వరుస ట్వీట్లు

పంజాబ్‌లో ప్రధాని మోదీ కాన్వాయ్‌ను రైతులు అడ్డుకున్న వ్యవహారం సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఈ వ్యవహారంపై హీరో సిద్ధార్థ్ స్పందిస్తూ… ఇదో పెద్ద డ్రామాగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశాడు. నిజంగా ఇది ప్రధాని కాన్వాయేనా…? అసలు అందులో ప్రధాని ఉన్నారా? అంటూ ప్రశ్నించాడు. ప్రధాని కాన్వాయ్‌లో ఉన్నది నటులు కావొచ్చని.. గతంలోనూ పలువురు బీజేపీ నేతలు ఎన్నోసార్లు నాటకాలు ఆడిన సందర్భాలు ఉన్నాయంటూ సిద్ధార్థ్ ఆరోపించాడు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశాడు. హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్లపై బీజేపీ నేతలు మండిపడుతుంటే… మరికొందరు మాత్రం సమర్ధిస్తున్నారు.

మరోవైపు ప్రధాని కాన్వాయ్ ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయ్యింది. ఈ ఘటనకు తామే కారణమని భారతీయ కిసాన్ యూనియన్ చేసిన ప్రకటనపై విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కూడా స్పందించింది. పంజాబ్‌లో జరిగిన ఘటన నిజంగా అవమానకరమని… ప్రధానమంత్రి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేత అని… ఆయన 140 కోట్ల ప్రజల గొంతుక అని కంగనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని అభివర్ణించింది. పంజాబ్ టెర్రరిస్ట్ కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోందని… వారిని ఇప్పుడు కనుక నిలువరించకపోతే తర్వాత దేశం మొత్తం పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కంగనా హెచ్చరించింది.

Related Articles

Latest Articles