రివ్యూ: హీరో (కన్నడ డబ్బింగ్)

కన్నడ చిత్రం ‘కిరికి పార్టీ’తో అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు దర్శకుడు రిషబ్ శెట్టి. ఆ మధ్య వరకూ సినిమాల్లో సరదాగా నటించిన రిషబ్ కన్నడ చిత్రం ‘బెల్ బాటమ్’లో హీరోగా చేశాడు. ఇప్పుడు మరోసారి తానే హీరోగా నటిస్తూ ‘హీరో’ అనే సినిమాను నిర్మించాడు. ఎం. భరత్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ కన్నడ సినిమా మార్చి 5న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఆహాలో ‘హీరో’ పేరుతోనే తెలుగు అనువాదం శుక్రవారం నుండి స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళితే… రిషబ్ ఓ భగ్న ప్రేమికుడు. కాలేజీలో చదువుకునే రోజుల్లో గన్వీని ప్రేమిస్తాడు. పెళ్ళి విషయంలో మీనమేషాలు లెక్కిస్తుండగా ఆమె పెళ్ళి పరమ దుర్మార్గుడైన ప్రదీప్ శెట్టితో అయిపోతుంది. అతను 400 ఎకరాల విస్తీర్ణం ఉన్న అశోక వనంలోని ఎస్టేట్ లో ఉంటాడు. ఆ ఎస్టేట్ హక్కుదారు టైగర్ ప్రభాకర్ ను మోసం చేసి, అతని కుటుంబాన్ని హత్య చేసి దాన్ని చేజిక్కించుకుంటాడు. ఇదిలా ఉంటే లవ్ బ్రేకప్ తో డిప్రషన్ లోకి వెళ్ళిపోయిన రిషభ్…. తాగుడుకు బానిస అవుతాడు. ఓ సెలూన్ లో బార్బర్ గా పనిచేస్తున్న అతనికి ఓ రోజున అశోక వనంలోని ప్రదీప్ శెట్టికి హెయిర్ కట్ చేసే పని పడుతుంది. దాంతో అశోక వనంలోకి వెళ్ళి అక్కడున్న తన మాజీ ప్రియురాలిని హత్య చేయాలనుకుంటాడు. అయితే అశోక వనంలోకి వెళ్ళిన రిషభ్ ఆ పని చేయగలిగాడా? మాజీ ప్రియుడిని అక్కడ చూసిన గన్వీ రియాక్షన్ ఏమిటీ? వీళ్ళిద్దరి సంగతి తెలిసిన అశోక వనంలోని గూండాలు ఏం చేశారు? ఇదంతా మిగిలిన కథ.

తమిళ సినిమాలు కొన్నింటిలో మనం అంతులేని అతిని చూస్తుంటాం. ఇప్పుడు అదే పంథాలో కొన్ని కన్నడ సినిమాలు సైతం తెరకెక్కుతున్నాయి. ఓ రకంగా చూసినప్పుడు ‘హీరో’ సినిమా కూడా అలాంటిదే. అయితే ప్రధమార్థం అంతా ఆసక్తికరంగానే సాగిపోతుంది. హీరో అశోక వనంలోకి వెళ్ళడం, అక్కడ అతను ఊహించని ట్విస్టులు జరగడం, అక్కడ నుండి అడవిలోకి ఈ ప్రేమజంట పారిపోవడం వరకూ ఓకే. కానీ అక్కడ నుండే వీక్షకుల సహనానికి పరీక్ష మొదలవుతుంది. ఎడతెగని ఛేజింగ్ ఒకానొక సమయంలో చికాకు తెప్పిస్తుంది. కానీ అంతలోనే ఒకటి రెండు యాక్షన్ సీన్స్ మళ్ళీ ఆసక్తిని కలిగిస్తాయి. ఇక క్లయిమాక్స్ లో హీరో తాగి చేసే ఫైట్ మరీ చిత్రంగా ఉంది.

నిజానికి ఈ చిత్రానికి ‘హీరో’ అనే పేరు పెట్టకుండా ‘అశోక వనం’ అని పెట్టి ఉంటే చాలా యాప్ట్ గా ఉండేది. ఎందుకంటే ఇందులో హీరోకి హీరో లక్షణాలు ఉండవు, హీరోయిన్, విలన్ పాత్రల్లో ఎవరు ఏమిటో తెల్చుకోవడం కూడా కష్టమే. ఇక సినిమా మొత్తంలో కాస్తంత వినోదాన్ని పండించే పాత్రలు ఏవైనా ఉన్నాయంటే అవి వంటవాడు, వైద్యుడివే. అశోక వనం ఎస్టేట్ లో మొసలి సరదాగా అటూ ఇటూ సంచరించడం, దానికి కుర్ర డాక్టర్ చేసే వైద్యం ఫలించినట్టుగా సినిమా క్లయిమాక్స్ లో సజెస్టివ్ షాట్ చూపడం బాగుంది. ఇలాంటి కొన్ని చమక్కులు దర్శకుడు భరత్ రాజ్ మూవీలో అక్కడక్కడా చూపించక పోలేదు. కానీ మొత్తంగా చూసినప్పుడు కథ ఎటు నుండి ఎటు పోతోందో అర్థం కాదు. భూమి గుండ్రంగా ఉందన్నట్టు అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ అశోక వనం ఎస్టేట్ కే అది చేరుతుంది.

నటీనటుల్లో రిషబ్ శెట్టి హీరో మెటీరియల్ కాదు. నటన మీద మోజు ఉండి తానే హీరోగా ఈ సినిమా నిర్మించాడనేది అర్థమైపోతోంది. ఇందులో అందరినీ అట్రాక్ట్ చేసే ఏకైక పాత్ర హీరోయిన్ గన్వీ లక్ష్మణ్ ది. ఇది ఆమెకు మొదటి సినిమానే అయినే అందంగా కనిపించడమే కాదు, చక్కని నటన కూడా కనబర్చింది. ఇక విలన్ గా ‘లైవ్’లో ప్రదీప్ శెట్టి కనిపించేది కొద్దిసేపే అయినా… క్రూరత్వం బాగా చూపించాడు. అతనికి డబ్బింగ్ చెప్పిన వాయిస్ కూడా బాగా సూట్ అయ్యింది. ముందు అనుకున్నట్టు వంటవాడి పాత్రలో కిరణ్‌ కిన్నా, డాక్టర్ గా అనిరుధ్ మహేశ్ నవ్వులు పూయించారు. విలన్ గ్యాంగ్ నాయకుడిగా ప్రదీప్ శెట్టి, టైగర్ ప్రభాకర్ కొడుకు పాత్రలో మంజునాథ్ గౌడ్ ఒళ్ళు దాచుకోకుండా బాగా ఫైట్స్ చేశారు. యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ బాగానే ఉంది. అందులో హైలైట్ ఏమిటంటే… కుక్కర్ మూతలోంచి రక్తం ఎగచిమ్మడం! అయితే అడవిలోని ఛేజింగ్ సన్నివేశాలను కాస్తంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. తెలుగులో సినిమా విడుదలైంది ఓటీటీలో కాబట్టి చేతిలో రిమోట్ ఉంటుంది కదా…. నచ్చని సీన్స్ ను వీక్షకులే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటారని వదిలేసి కూడా ఉండొచ్చు!

రాంబాబు గోసాల రాసిన పాటల సాహిత్యం, వేణుబాబు సంభాషణలు బాగున్నాయి. అజనీశ్ లోకనాథ్ నేపథ్య సంగీతం, అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ కూడా సన్నివేశాలను ఎలివేట్ చేసేలా ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ను కరోనా టైమ్ లో సింగిల్ షెడ్యూల్ లో అతి తక్కువ మందితో చిత్రీకరించారు. అయినా మేకింగ్ వాల్యూస్ విషయంలో హీరో కమ్ ప్రొడ్యూసర్ రిషబ్ శెట్టి రాజీపడలేదు. సినిమాలో ఓ చోట చెప్పినట్టు ధైర్యానికి – మూర్ఖత్వానికి చాలా తేడా ఉంటుంది. అయినా ధైర్యం చేసి ఈ సినిమాను చూడాలనుకుంటే ఓకే… ఓ కొత్త అనుభూతిని పొందొచ్చు!

రేటింగ్ : 2.25 / 5

ప్లస్ పాయింట్స్
హీరోయిన్ నటన
యాక్షన్ సన్నివేశాలు
ప్రొడక్షన్ వాల్యూస్

మైనెస్ పాయింట్
ఎడతెగని ఛేజింగ్ సీన్స్
అడ్డదిడ్డంగా సాగే కథ

ట్యాగ్ లైన్: ‘హీరో’యిజంలేని హీరో!

Related Articles

Latest Articles

-Advertisement-