ఆ నాటి కండలవీరుడు… ధర్మేంద్ర!

హిందీ చిత్రసీమలో కండలు తిరిగిన సౌష్టవంతో స్టార్స్ గా రాణించిన ఆ నాటి నటుల్లో ధర్మేంద్ర స్థానం ప్రత్యేకమైనది. ‘మేచో మేన్’గా పేరొందిన తొలి హిందీ హీరో ధర్మేంద్ర అనే చెప్పాలి. అప్పట్లో ఎంతోమంది అందాలభామల కలల రాకుమారునిగా ధర్మేంద్ర రాజ్యమేలారు. ‘డ్రీమ్ గర్ల్’గా పేరొందిన హేమామాలిని అంతటి అందాలభామను తన సొంతం చేసుకున్నారు ధర్మేంద్ర. తనదైన అభినయంతో ధర్మేంద్ర బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచీ అలరిస్తూ సాగారు. కలర్ సినిమా రోజుల్లో అయితే ధర్మేంద్ర చిత్రాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తూ విజయకేతనం ఎగురవేశాయి. కాశ్మీరం నుండి కన్యాకుమారి దాకా ధర్మేంద్రకు అభిమానగణాలున్నాయి. అందరినీ అలరిస్తూ దాదాపు రెండున్నర దశాబ్దాలు ధర్మేంద్ర తన బాణీ పలికించారు.

ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. 1935 డిసెంబర్ 8న పంజాబ్ లోని నస్రాలీలో ఆయన జన్మించారు. లూధియానా పట్టణ సమీపంలోని లాల్టోన్ కలాన్ అనే గ్రామం ప్రాథమిక పాఠశాలలో ధర్మేంద్ర తండ్రి ప్రధానోపాధ్యాయునిగా పనిచేసేవారు. అక్కడే ధర్మేంద్ర ప్రాథమిక విద్య సాగింది. 1952లో ధర్మేంద్ర మెట్రిక్యులేషన్ పాసయ్యారు. అప్పటి నుంచీ నాటకాలు వేస్తూ సాగారు. అప్పట్లో ‘పిలిమ్ ఫేర్’ మేగజైన్ కొత్తవారిలో ప్రతిభను ప్రోత్సహించేందుకు ఓ కార్యక్రమం చేపట్టింది. అందులో ధర్మేంద్ర విజేతగా నిలిచారు. దాంతో కొందరు బొంబాయికి వస్తే సినిమా అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ‘ఫిలిమ్ ఫేర్’ న్యూ టాలెంట్ విన్నర్ గా బొంబాయి చేరిన ధర్మేంద్రకు నిరాశ ఎదురయింది. అయితే పట్టువదలకుండా అక్కడే వేట సాగించారు. ఆ సమయంలో అర్జున్ హింగోరానీ అనే దర్శకుడు ధర్మేంద్ర పర్సనాలిటీ చూసి, తన సినిమాలో హీరోగా అవకాశం కల్పించారు. ఆ చిత్రమే ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’. అందులో బలరాజ్ సహానీ వంటి మేటి నటునితో కలసి నటించారు ధర్మేంద్ర. కుమ్ కుమ్ నాయికగా కనిపించిన ఈ చిత్రంలో ఆయన ధర్మేందర్ గా టైటిల్ వేశారు. తరువాత కొన్ని చిత్రాలలో సైడ్ హీరోగానూ నటించారు. 1962లో వచ్చిన ‘అన్ పడ్’ ధర్మేంద్రకు బ్రేక్ నిచ్చింది. 1966లో తెరకెక్కిన ‘ఫూల్ ఔర్ పత్థర్’తో ధర్మేంద్రకు స్టార్ డమ్ లభించింది.

నూతన్ తో ధర్మేంద్ర నటించిన “సూరత్ ఔర్ శీరత్, బందినీ, దిల్ నే ఫిర్ యాద్ కియా, దుల్హన్ ఏక్ రాత్ కీ” చిత్రాలు ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టాయి. అలాగే మాలా సిన్హాతో ధర్మేంద్ర అభినయించిన “అన్ పడ్, పూజా కే ఫూల్, బహారే ఫిర్ భీ ఆయేగీ, ఆంఖే” చిత్రాలు జనాన్ని అలరించాయి. ఆయన కంటే సీనియర్ నటి అయిన మీనా కుమారితో ధర్మేంద్ర ఏడు చిత్రాలలో నటించి ఆకట్టుకున్నారు. వీరిద్దరూ నటించిన “మై భీ లడ్కీ హూ, కాజల్, పూర్ణిమ, ఫూల్ ఔర్ పత్థర్, మజ్లీ దీదీ, చందన్ కా పాలనా, బహారోంకీ మంజిల్” సినిమాలు విశేషాదరణ చూరగొన్నాయి. వీరిద్దరి మధ్య ఏదో అనుబంధం ఉందన్న వదంతులు అప్పట్లో విశేషంగా వినిపించాయి. హృషీకేశ్ ముఖర్జీ తెరకెక్కించిన ‘అనుపమ’లో ధర్మేంద్ర అభినయం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇక 1970ల ఆరంభంలో హేమామాలినితో జోడీ కట్టడం ఆరంభించారు ధర్మేంద్ర. వారిద్దరి జంట ప్రేక్షకులకు కన్నుల పండుగ చేసింది. “రాజా-జానీ, సీతా ఔర్ గీతా, షరాఫత్, నయా జమానా, పత్థర్ ఔర్ పాయల్, తుమ్ హసీన్ మై జవాన్, జుగ్ను, చరస్, దోస్త్, మా, షోలే, ఆజాద్” వంటి చిత్రాలలో ధర్మేంద్ర, హేమామాలిని జంట జనానికి నయనానందం కలిగించడమే కాదు, జైత్రయాత్రలూ చూశారు. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ అంకురించింది. అప్పటికే ధర్మేంద్రకు పెళ్ళయి పిల్లలు ఉన్నా, హేమ మనసు ఆయనతో జీవితాన్ని కోరుకుంది. తత్ఫలితంగా 1980లో వీరు వివాహం చేసుకున్నారు. వారికి ఇషా డియోల్, అహనా డియోల్ పిల్లలు. ఇక ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాశ్ కౌర్ పిల్లల్లో సన్నీ డియోల్, బాబీ డియోల్ సైతం హీరోలుగా అలరించారు. తన తనయులను హీరోలుగా పరిచయం చేస్తూ చిత్రాలు నిర్మించారు. సన్నీతో ‘బేతాబ్’, బాబీతో ‘బర్సాత్’ తెరకెక్కించారు. ఇవి కాకుండా మరికొన్ని చిత్రాలనూ తమ విజేత ఫిలిమ్స్ పతాకంపై నిర్మించారాయన. వాటిలో తనయుడు సన్నీతో నిర్మించిన ‘ఘాయల్’ మంచి పేరు సంపాదించి పెట్టింది.

ధర్మేంద్ర రాజకీయాల్లోనూ రాణించారు. 2004లో రాజస్థాన్ బికనీర్ నుండి లోక్ సభకు ఎన్నికయ్యారు. తనయులతో కలసి చివరగా ‘యమ్లా పగ్లా దీవానా’లో నటించారాయన. 2012లో ఆయనకు ‘పద్మభూషణ్’ అవార్డు లభించింది. డిసెంబర్ 8తో 86 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ధర్మేంద్ర మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం.

Related Articles

Latest Articles