డాన్సుల్లో మరపురాని హెలెన్ మెరుపులు!

ఈ తరానికి హెలెన్ అంటే సల్మాన్ ఖాన్ పిన్ని అని, లేదా ఓ సీనియర్ యాక్ట్రెస్ అని మాత్రమే తెలుసు. కానీ, ఆ నాటి ప్రేక్షకులకు హెలెన్ శృంగార రసాధిదేవత! ఐటమ్ గాళ్స్ లో సూపర్ స్టార్ అనిపించుకున్న మేటి డాన్సర్ హెలెన్. ఆ రోజుల్లో హెలెన్ పాట కోసం జనం థియేటర్లకు పరుగులు తీసేవారు. కొన్ని చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు హెలెన్. అయితే వందలాది సినిమాల్లో ఐటమ్స్ తోనే మురిపించారు. హెలెన్ దాదాపు 700 చిత్రాలలో తెరపై వెలుగులు విరజిమ్మారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో హెలెన్ ప్రకాశిస్తూనే ఉన్నారు.

హెలెన్ పూర్తి పేరు హెలెన్ యాన్ రిచర్డ్ సన్. 1938 నవంబర్ 21న హెలెన్ బర్మాలో జన్మించారు. ఆమె తండ్రి ఆంగ్లో ఇండియన్, తల్లి బర్మాకు చెందినవారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆమె తండ్రి మరణించడంతో, వారి కుటుంబం అస్సామ్ చేరుకుంది. తరువాత అక్కడే చదువుసంధ్యలు సాగాయి. తన కుటుంబ పోషణ కోసం హెలెన్ హై స్కూల్ చదువుకు తిలోదకాలిచ్చారు. ఆ రోజుల్లో కుకూ అనే ఆంగ్లో ఇండియన్ డాన్సర్ ఉండేవారు. హెలెన్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన కుకూ ప్రోత్సాహంతోనే హెలెన్ హిందీ చిత్రసీమలో అడుగు పెట్టారు. రాజ్ కపూర్ ‘ఆవారా’లో గ్రూప్ డాన్సర్స్ లో ఒకరిగా తెరపై కనిపించారు. అలాగే కొన్ని సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా నటించారు హెలెన్. తెలుగులో యన్టీఆర్ హీరోగా జూపిటర్ సంస్థ నిర్మించిన ‘సంతోషం’ చిత్రంలో తొలిసారి హెలెన్ మెయిన్ డాన్సర్ గా నర్తించారు. అందులోని “రూపాయి కాసులోనే ఉన్నదీ తమాషా…” పాటలో హెలెన్ నృత్యం జనాన్ని ఆకట్టుకుంది. ఈ సినిమా తరువాత ఏయన్నార్ హీరోగా రూపొందిన ‘దొంగల్లో దొర’ చిత్రంలో “విన్నావా చిన్నవాడా…” అనే పాటలోనూ హెలెన్ డాన్స్ ఎంతగానో అలరించింది. అదే సమయంలో ‘భూకైలాస్’ లో రావణుని తపస్సును భగ్నం చేసే దేవనర్తకిగా “సుందరాంగ… అందుకోరా…” గీతంలో హెలెన్ నృత్యం మరింతగా జనాన్ని మురిపించింది. ఆ తరువాతే ‘హౌరా బ్రిడ్జ్’లోని “మేరా నామ్ చిన్ చిన్…” సాంగ్ తో యావత్ దేశాన్నే ఓ ఊపు ఊపేశారు హెలెన్.

‘హౌరా బ్రిడ్జ్’ తరువాత హెలెన్ మరి వెను తిరిగి చూసుకోలేదు. ఆమె నాట్యం కోసం సినీజనం ఎర్రతివాచీ పరిచేశారు. ప్రతి చిత్రంలోనూ తన నాజూకు సోకులతో హెలెన్ మత్తెక్కించే నృత్యం చేశారు. ఆమె డాన్స్ కు ఆశా భోస్లే పాటకు జోడీ కుదిరి వందలాది చిత్రాలు విజయపథంలో పయనించాయి. కొన్ని చిత్రాలలో లిప్ మూవ్ మెంట్ కూడా లేకుండా కేవలం హెలెన్ చిందులతోనే జనం ఊగిపోయిన సందర్భాలున్నాయి. ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ ‘షోలే’లో “మెహబూబా మెహబూబా…” పాటలో కేవలం హెలెన్ నర్తించారే తప్ప, ఆమెకు ఆ పాటలో పెదాల కదలికనే లేదు. అయినా, ఆ పాట జనాన్ని ఏ తీరున ఊపేసిందో చెప్పక్కర్లేదు. తరువాతి రోజుల్లో ఏయన్నార్, కృష్ణ నటించిన ‘హేమాహేమీలు’ తెలుగు చిత్రంలోనూ “ఏ ఊరూ… ఏ పేరూ…” అనే పాటలో హెలెన్ డాన్స్ ఆకట్టుకుంది.

రాజేశ్ ఖన్నా, సాధన జంటగా రూపొందిన ‘దిల్ దౌలత్ దునియా’ చిత్రంలో హెలెన్ రీటా అనే కీలక పాత్ర పోషించారు. ఆ చిత్ర దర్శకుడు ప్రేమ్ నారాయణ్ అరోరా, హెలెన్ ను 1957లోనే పెళ్ళి చేసుకున్నారు. అప్పటికి హెలెన్ ఇంకా డాన్సర్ గా పేరు సంపాదించలేదు. నిజానికి హెలెన్ కంటే ప్రేమ్ నారాయణ్ అరోరా వయసులో 27 ఏళ్ళు పెద్దవారు. అప్పటి అవసరం ఆమెను ఆ పెళ్ళికి ప్రోత్సహించింది. అయినా 1974 వరకు ఆయనతో సవ్యంగానే కాపురం చేశారు హెలెన్. తరువాత విడాకులు తీసుకొని తన స్వేచ్ఛకు ఆటంకం లేని వాతావరణాన్ని సృష్టించుకున్నారామె. ఆ వాతావరణంలోకి ప్రముఖ రచయిత సలీమ్ ఖాన్ అడుగు పెట్టారు. వారిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రణయంగా మారింది. తరువాత 1981లో పరిణయమూ జరిగింది. సలీమ్ ఖాన్ పెద్ద కొడుకే ఈ నాటి మేటి హీరో సల్మాన్ ఖాన్. హెలెన్ కు పిల్లలంటే ఎంతో ఇష్టం. అలా సల్మాన్ ను బాగా చూసుకున్నారామె. అందువల్లే ఇప్పటికీ సల్మాన్ కు తన పిన్ని హెలెన్ అంటే ఎంతో అభిమానం. తాను విదేశాలకు వెళ్ళిన ప్రతీసారి హెలెన్ కు ఏదో ఒక ప్రత్యేక బహుమతి తేవడం సల్మాన్ కు అలవాటు. సల్మాన్, మనీషా కొయిరాల నటించిన ‘ఖామోషీ : ద మ్యూజికల్’ మూవీలో హెలెన్ కీలక పాత్ర పోషించారు. సంజయ్ లీలా భన్సాలీకి దర్శకునిగా ఇదే తొలి చిత్రం. ఇందులో హెలెన్ పై చిత్రీకరించిన “గాతే థే పెహ్లే అఖేలే…” పాట ఇప్పటికీ ఆమె అభిమానులకు ఎంతో ఇష్టం. కరీనా కపూర్ తో మధుర్ భండార్కర్ 2012లో రూపొందించిన ‘హీరోయిన్’లో కీలక పాత్ర పోషించారు. ఆ సినిమా తరువాత 2021లో తెరకెక్కిన ‘పగ్లీ షాదీ గో దాదీ’లో హెలెన్ కనిపించారు. 83 ఏళ్ళ వయసులోనూ ఇప్పటికీ ఎంతో చలాకీగా ఉన్న హెలెన్ మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం.

Related Articles

Latest Articles