హైదరాబాద్ ను వణికించిన వర్షం.. పలు కాలనీలు జలమయం

హైదరాబాద్‌ గుండె మరోసారి చెరువైంది. రోడ్లు జలాశయాలను తలపించాయి. దాదాపు రెండు గంటల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షానికి భాగ్యనగరం చిగురుటాకులా వణికిపోయింది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా కురిసిన భారీ వర్షానికి ఏది రోడ్డో , ఏది నాలానో తెలియని పరిస్థితి. నగరవాసులు ఇళ్లకు చేరుకునే సమయంలో వర్షం మొదలవడంతో ఎక్కడికక్కడ జనం రోడ్లపక్కన తలదాచుకున్నారు. వరదనీటిలో చిక్కుకుని పలువురు ప్రమాదానికి గురయ్యారు. ఎల్బీనగర్‌ సమీపంలోని చింత కుంటలో డ్రైనేజీలో పడి గల్లంతైన వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. భారీ వర్షం వల్ల డ్రైనేజి పొంగడంతో ఏది రోడ్డో… ఏది కాలువో కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో బైక్ ప్రయాణిస్తున్న జగదీశ్ దానితో సహా డ్రైనేజిలో పడిపోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు సహాయ చర్యలు ప్రారంభించారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్… బైక్‌ని వెలికి తీసినా… అప్పటికే జగదీశ్ కొంత దూరం కొట్టుకుపోయాడు. అయితే… జగదీశ్ కోసం గాలింపు కొనసాగించిన రెస్క్యూ టీమ్… అతన్ని ప్రాణాలతో రక్షించింది.

బాధితుడిని రంగారెడ్డి జిల్లా మంకాల గ్రామానికి చెందిన జగదీష్‌గా గుర్తించారు.ఇప్పటికే భారీ వర్షాలకు చెరువులన్నీ నిండి ఉండటం.. ఒక్క సారిగా కుండపోత వర్షం కురియడంతో… నగరంలోని రోడ్లపై వరదలు పారాయి. నీటి ఉధృతికి కార్లు, ఆటోలు, బైకులు… కొట్టుకుపోయాయి. కాలనీ రోడ్లపై వేగంగా వరద నీరు ప్రవహిస్తుండటంతో.. ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పట్టుకొని ఇంటికి చేరుకున్నారు. భారీ వర్షానికి వాహనాలు తడిసి మొరాయించడంతో మరికొందరు వాటిని తోసుకుంటూ వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం ఎంతకీ తగ్గకపోగా.. ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయింది. రోడ్లపైనే గంటలకొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బంజారాహిల్స్ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌.. అరగంటలో వెళ్లే దూరానికి మూడుగంటలకు పైగా సమయం పట్టిందంటేనే వర్షం వల్ల కలిగిన ఇబ్బందిని అర్థం చేసుకోవచ్చు. మరికొన్ని చోట్ల వరద నీరు వెళ్లేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది మ్యాన్‌ హోల్స్‌ను తెరిచిపెట్టారు. దీంతోనూ ప్రమాదాలు జరిగాయి. పాతబస్తీలో ఓ కాలనీలో ఓ టూవీలర్ కాస్తలో ప్రాణాలతో బయటపడ్డాయి. తెరిచిన మ్యాన్‌హోల్‌ను గమనించకుండా ముందుకు వెళ్లడంతో కింద పడ్డాడు. అయితే నాలాలో పడకపోవడంతో… ప్రాణాలు దక్కాయి.

హైదరాబాద్‌లో వర్షం కురిస్తే… కుమ్మరింతే అన్నట్టుగా పరిస్థితి మారింది. నిన్న కూడా రెండు, మూడు గంటల్లోనే కొన్ని చోట్ల పది సెంటీ మీటర్ల వర్షపాతం కురిసింది. లింగోజిగూడలో అత్యధికంగా 10.6 సెంటీమీటర్ల వర్షం పడింది. కుర్మగూడలో 10, హస్తినాపురంలో 8.8, అస్మాన్‌గఢ్‌లో 8.7, సర్దార్ మహల్‌లో 8.6, కంచన్ బాగ్‌లో 8.4, జూపార్క్‌లో 8 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇక జహానుమాలో 7.6 సెంటీమీటర్లు, అలకాపురి కాలనీలో 7.1, అత్తాపూర్‌లో 7, రాజేంద్రనగర్‌లో 6.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శంషాబాద్‌లో అప్ప చెరువు పొంగిపొర్లడంతో… హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై నీళ్లు ఉద్ధృతంగా ప్రవహించాయి. దాంతో… ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. వాహనాలు ఎటూ కదల్లేని పరిస్థితి ఏర్పడటంతో… శంషాబాద్ వైపు వెళ్లే రోడ్డును పూర్తిగా మూసివేశారు పోలీసులు. ట్రాఫిక్‌ ఇతర మార్గాలకు మళ్లించారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

-Advertisement-హైదరాబాద్ ను వణికించిన వర్షం.. పలు కాలనీలు జలమయం

Related Articles

Latest Articles