అలర్ట్‌ : మూడు రోజులపాటు అతిభారీ వర్షాలు

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 3 రోజులు రాష్ట్రంలో ఆరెంజ్ అలెర్ట్, ఆ తరువాత 4 రోజులు ఎల్లో అలెర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో ములుగు జిల్లా, వెంకటాపురంలో 12 సెంటి మీటర్ల వర్షపాతం నమోదవ్వగా, భద్రాద్రి కొత్తగూడెంలో 13, నల్గొండ జిల్లా చండూరులో 11.5, సిద్దిపేట జిల్లాలో 11.6, మేడ్చల్ పారిశ్రామిక ప్రాంతంలో 11, సంగారెడ్డి జిల్లాలో 10.5 సెం.మీ, హైదరాబాద్‌లో 10, రంగారెడ్డిలో 8.8సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక వికారాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో వర్షాల కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే కురిసిన వర్షాలతో చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. ఇక నగరంలో ప్రతి రోజు ఏదో ఒక సమయంలో కుండపోతగా వర్షం కురుస్తుండడంతో వాహనదారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఏపీలోనూ పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడ్డాయి. భారీ వర్షాలు పడిన ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో కురిసిన వర్షాలకు ఆకూరు- బడిగుంట గ్రామాల మధ్య ఉన్న వాగు ఉధృతికి గల్లంతై ముగ్గురు మృత్యువాత పడ్డారు.

కడప జిల్లా పెద్ద ముడియం మండలంలో కుందూ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కుందూ నది పరీవాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింతగా బలపడి.. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు మూడు రోజులపాటు భారీ వర్షసూచన ఉందని తెలిపింది వాతావరణశాఖ. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డిలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షసూచన ఉందని హెచ్చరించింది వాతావరణశాఖ.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-