బోర్డర్లో పడిగాపులు.. అప్ఘన్ ప్రజల గోడు ఎవరికీ పట్టదా?

తాలిబన్ల దురాక్రమణతో అప్ఘనిస్తాన్ వారి హస్తగతమైంది. తమ పాలనను ఒప్పుకున్నారా సరే? లేదంటే ఖతం కావాల్సిందే? అన్నట్లుగా తాలిబన్ల వైఖరి ఉంది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అక్కడి ప్రజలు తాలిబన్ల ప్రభుత్వాన్ని అంగీకరించాల్సి వస్తోంది. అయితే ఇప్పటికే తాలిబన్ల అరాచక పాలన చూసిన మహిళలు మాత్రం వారి పాలనలో బతకడం కంటే చావడం మేలు అన్నట్లుగా ఉన్నారు. దీంతో దేశం నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కారణంగానే ఆ దేశ బోర్డర్లో వేలాది మంది అఫ్ఘన్లు బతుకు జీవుడా అంటూ పక్కదేశాల అనుమతి కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. ఈ దృశ్యాలన్నీ కూడా చాలా హృదయవిదారకంగా ఉండటంతో ప్రపంచ దేశాలపై విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి.

అప్ఘనిస్తాన్లో తాలిబన్లు అరాచక పాలనకు తెగబడుతున్నా ప్రపంచ దేశాలు మిన్నకుండిపోతుండటం శోచనీయంగా మారింది. ఉగ్రవాదులపై సమష్టిగా పోరాడుతామని ప్రగల్భాలు పలికే అగ్రదేశాలు అప్ఘనిస్తాన్ విషయంలో చేస్తుంది? ఏంటీ అనే విమర్శలు వస్తున్నాయి. అమెరికా, చైనా, పాకిస్తాన్ మద్దతుతోనే తాలిబన్లు ఆదేశాన్ని స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ దేశాల వైఖరి చూస్తుంటే తాలిబన్లకు వీరి సహకారం పరోక్షంగా ఉందని అర్థమవుతోంది. తాలిబన్లు గతంలో మాదిరిగానే తమ ప్రభుత్వం షరియా చట్టాలను కఠినంగా అమలు చేస్తుందని ప్రకటించారు. దీంతో అప్ఘన్లు ఇక ఏమాత్రం ఆదేశంలో ఉండేందుకు ఇష్టపడటం లేదు.

గతంలోనే షరియా చట్టాల పేరుతో తాలిబన్లు మహిళలను ఇంటికే పరిమితం చేశారు. మతచాందస వాదులైన తాలిబన్లు షరియా చట్టాలను గతంలో కఠినంగా అమలు చేయడంతో అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అమెరికా ఎంట్రీతో తాలిబన్ల పాలన అంతమై దాదాపు 20ఏళ్లు గడుస్తుంది. ఈ 20ఏళ్లలో అఫ్ఘనిస్తాన్ ప్రజల్లో చాలా మార్పులు వచ్చాయి. తాజాగా మరోసారి అఫ్ఘన్లో తాలిబన్ల పాలన మొదలు కావడంతో అక్కడి ప్రజలు దేశం విడిచి పారిపోయేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే అఫ్ఘన్ తో సరిహద్దుగా ఉన్న దేశాలన్నీ ఇప్పటికే బోర్డర్లను మూసివేశాయి. దీంతో వేలాది మంది ప్రజలు సరిహద్దుల్లోనే ఇతర దేశాల అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు.

అఫ్ఘనిస్తాన్ పొరుగునే ఉన్న తజికిస్తాన్.. పాకిస్తాన్.. ఇరాన్ దేశాలు తమ సరిహద్దులను ఇప్పటికే మూసివేశాయి. అప్ఘన్ నుంచి ఎవరినీ తమ దేశంలోకి అనుమతి ఇవ్వడం లేదు. మరోవైపు కాబుల్.. కాందహార్.. మజర్-ఐ-షరీఫ్.. జలాలాబాద్ వంటి సరిహద్దులకు ఆనుకుని ఉన్న నగరాల నుంచి బయటికి వెళ్లే మార్గాలను తాలిబన్లు మూసివేశారు. నగరాలన్నింటినీ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయినప్పటికీ అఫ్ఘన్లు దేశం విడిచి వెళ్లేందుకు ఎలాంటి అవకాశం దొరకపోతుందా? అని బోర్డర్లో వెయిట్ చేస్తున్నారు. పాకిస్తాన్‌తో సరిహద్దులను పంచుకుంటోన్న స్పిన్ బోల్డాక్ ప్రావిన్స్‌ చమన్ సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద వారం రోజులుగా వేలాది మంది అఫ్ఘన్లు గుంపులుగుంపులుగా ఉన్న శాటిలైట్‌ దృశ్యాలు కొన్ని బయటికి వచ్చాయి.

ఈ ఫోటోలు అప్ఘన్ల దయనీయ పరిస్థితికి అద్ధం పడుతున్నాయి. అఫ్ఘన్లను తమ దేశంలోని అనుమతించని పోరుగు దేశాలు సరిహద్దుల్లో మాత్రం వారికి తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన వస్తువులను అందజేస్తుండడం కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది. ఏదిఏమైనా తాలిబన్ల అరాచక పాలనలో బతుకడం కంటే దేశం విడిచి పారిపోవడమే ఉత్తమమని మెజార్టీ అప్ఘన్లు ఆలోచిస్తున్నారు అనడానికి ఈ శాటిలైట్ ఫొటోలే నిదర్శనంగా కన్పిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు స్పందించి అఫ్ఘన్లో మునుపటి పరిస్థితులు ఏర్పడేలా చూడాలని మానవతావాదులు కోరుతున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-