జిల్ జిల్ జిగేలు రాణి… పూజా హెగ్డే!

కన్నెలను కన్నెత్తి చూడని ఋష్యశృంగులనైనా వీపున బాజా మోగించి, తనవైపు చూపు తిప్పేలా చేసే కాకినాడ ఖాజాలాంటి అమ్మాయి పూజా హెగ్డే. ముంబైలో పుట్టిన పూజా హెగ్డే దక్షిణాది మూలాలు ఉన్నదే! ఉత్తర దక్షిణాలను తన అందంతో కలగాపులగం చేస్తోన్న ఈ భామ నేడు టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా రాజ్యమేలుతోంది. టాలీవుడ్ లో టాపు లేపుతూ సాగుతోంది పూజా హెగ్డే.

పూజా హెగ్డే 1990 అక్టోబర్ 13న ముంబైలో జన్మించింది. ఆమె కన్నవారు కర్ణాటకలోని ఉడుపికి చెందినవారు. ముంబైలోని ఎమ్.ఎమ్.కె. కాలేజ్ లో చదువుతున్న రోజుల్లోనే పలు భాషల్లో పట్టు సాధించడమే కాదు, ఫ్యాషన్ షోస్ లో పాల్గొని అలరించింది. అలా అలా పూజా హెగ్డే పేరు గ్లామర్ మార్కెట్ లో మారు మోగింది. తమిళ దర్శకుడు మిస్కిన్ తన ‘ముగమూడి’ చిత్రంలో నాయికగా ఎంచుకున్నారు. జీవా హీరోగా రూపొందిన ఈ చిత్రంలో తొలిసారి తెరపై తళుక్కుమంది పూజా హెగ్డే. తరువాత నాగచైతన్య హీరోగా రూపొందిన ‘ఒక లైలా కోసం’తో తెలుగునాట అడుగుపెట్టింది. ఆపై ‘ముకుంద’ చిత్రంలోనూ నటించింది. ఈ మూడు చిత్రాలేవీ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. హిందీలో ఆమె తొలి చిత్రం హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన ‘మొహెంజో దారో’. అదికూడా అలరించలేదు. దాంతో పూజా హెగ్డే పాదంపై చిత్రసీమలో పలు అనుమానాలు రేకెత్తాయి. అల్లు అర్జున్ సరసన నటించిన ‘దువ్వాడ జగన్నాథం’లో పూజా హెగ్డే అందం చిందులు వేసింది. ఆమెను చూడటానికే అన్నట్టు సినిమాకు జనం పరుగులు తీశారు. ఆ చిత్రం మంచి ఓపెనింగ్స్ చూసింది. రామ్ చరణ్ ‘రంగస్థలం’లో “జిల్ జిల్ జిగేలు రాణి…”గా కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన ‘సాక్ష్యం’లో మెరిసింది. మళ్ళీ మామూలే అన్నట్టుగా సాగింది పూజా చిత్ర ప్రయాణం. జూనియర్ యన్టీఆర్ తో ‘అరవింద సమేత’లో అరవిందగా ఆకట్టుకుంది. ‘మహర్షి’లో మహేశ్ బాబు సరసన మురిపించింది. ‘గద్దలకొండ గణేశ్’లో మరో శ్రీదేవి అనిపించింది. ఇక అల్లు అర్జున్ తో రెండో సారి నటించిన ‘అల వైకుంఠపురములో…’తో బంపర్ హిట్ ను తన బ్యాగ్ లో వేసుకుంది.

అప్పటి దాకా పూజా హెగ్డే చిత్ర ప్రయాణం ఓ తీరున సాగితే, ‘అల…వైకుంఠపురములో’ తరువాత మరో తీరున సాగింది అని చెప్పాలి. ఆచిత్రం తరువాత పూజా నటించిన ఏ సినిమా కూడా జనం ముందుకు రాలేదు. దసరా పండగకు అక్టోబర్ 15న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో జనం ముందుకు రానుంది. ఇక ‘ఆచార్య’లో రామ్ చరణ్ జోడీగా నటించింది. వచ్చే యేడాది ఈ సినిమా వెలుగు చూడనుంది. ప్రభాస్‌ ‘రాధే శ్యామ్’లోనూ పూజా అందం కనువిందు చేయనుంది. ఇది కూడా రాబోయే సంక్రాంతి కానుకగా రానుంది. తమిళ స్టార్ హీరో విజయ్ సరసన ‘బీస్ట్’లో నటిస్తోంది. రణవీర్ సింగ్ తో జోడీ కట్టి ‘సర్కస్’ చూపించనుంది. వీటిలో ఏది బంపర్ హిట్ అయినా, మళ్ళీ పూజా హెగ్డే కాల్ షీట్స్ కాస్ట్లీగా మారిపోతాయి. ఇప్పటి దాకా అందంతోనే శ్రీగంధాలు పూసిన పూజా హెగ్డే భవిష్యత్ లో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ లోనూ మురిపిస్తోందేమో చూడాలి.

-Advertisement-జిల్ జిల్ జిగేలు రాణి… పూజా హెగ్డే!

Related Articles

Latest Articles