‘సాహో’రే… ప్రభాస్!

(అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు)
నవతరం కథానాయకుల్లో అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ పొందుతున్న హీరో ఎవరంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరే సమాధానంగా నిలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ పేరు యావద్భారతంలో మారుమోగి పోతోంది. ‘బాహుబలి’గా ప్రభాస్ అభినయం ఆబాలగోపాలాన్నీ అలరించింది. అప్పటి నుంచీ ప్రభాస్ సినిమాలకై మన దేశంలోని సినీ ఫ్యాన్స్ కళ్ళింతలు చేసుకొని చూస్తున్నారు. ‘సాహో’లో అహో అనిపించక పోయినా, ఉత్తరాదిన మాత్రం ఆ సినిమా ఆకట్టుకుంది. రాబోయే సంవత్సరంలో ప్రభాస్ అభిమానులకు డబుల్ ధమాకా అందించనున్నారు. ‘రాధే శ్యామ్’, ‘సలార్’ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆ చిత్రాల ముచ్చట్లను అప్పుడే అభిమానులు చర్చించుకుంటున్నారు.

ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. 1979 అక్టోబర్ 23న ప్రభాస్ జన్మించారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు సొంత తమ్ముడు సూర్యనారాయణ రాజు చిన్న కొడుకు ప్రభాస్. కృష్ణంరాజు హీరోగా గోపీకృష్ణా మూవీస్ పతాకంపై ‘భక్త కన్నప్ప, అమరదీపం, శివమెత్తిన సత్యం, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్రపాపారాయుడు’ వంటి చిత్రాలను నిర్మించారు సూర్యనారాయణ రాజు. కృష్ణంరాజు రెబల్ స్టార్ గా జనం మదిలో నిలిచారు. పెదనాన్న బాటలోనే పయనిస్తూ నటనను ఎంచుకున్న ప్రభాస్ ‘యంగ్ రెబల్ స్టార్’గా అభిమానులను ఆకట్టుకున్నారు. చిన్నప్పటి నుంచీ పెదనాన్న నటన చూస్తూ, ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన ప్రభాస్ చదువు కంటే అభినయంపైనే శ్రద్ధ చూపించారు. దాంతో ప్రభాస్ కు నటనలో తగిన శిక్షణ ఇప్పించారు. 2002లో ‘ఈశ్వర్’ సినిమాతో తొలిసారి హీరోగా జనం ముందుకు వచ్చారు ప్రభాస్. జయంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈశ్వర్’ యంగ్ రెబల్ స్టార్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది. తరువాత ‘రాఘవేంద్ర’గానూ ఆకట్టుకున్నారు ప్రభాస్. ఎమ్మెస్ రాజు నిర్మించిన ‘వర్షం’ చిత్రం ప్రభాస్ కు తొలి విజయాన్ని అందించింది. ఆ సినిమా తరువాత మాస్ ను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. వైవిధ్యం చూపించాలనీ తపించారు. కానీ, రాజమౌళి ‘ఛత్రపతి’ ప్రభాస్ ను మాస్ హీరోగా నిలిపింది. ఆ ఒక్క చిత్రంతోనే ‘యంగ్ రెబల్ స్టార్’ స్థాయి మారిపోయింది.

రాజమౌళి సినిమాతో హిట్ కొట్టిన హీరోలకు తరువాత ఆ స్థాయి సక్సెస్ వెంటనే లభించదు అనే సెంటిమెంట్ ఉంది. అలాగే ప్రభాస్ కూడా పలు చిత్రాల్లో నటించినా, జనాన్ని ఆకట్టుకుంటూ సాగారే తప్ప, మళ్ళీ ‘ఛత్రపతి’లా జయకేతనం ఎగురవేయలేకపోయారు. ఈ ప్రయాణంలో “పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్, డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్, రెబల్” వంటి చిత్రాలు వచ్చాయి. వీటిలో “బిల్లా, రెబల్” చిత్రాల్లో పెదనాన్న కృష్ణంరాజుతో కలసి ప్రభాస్ నటించడం అభిమానులను ఆకట్టుకుంది. ఆ రెండు చిత్రాల ఫలితం ఎలా ఉన్నా, రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు మాత్రం ఆ సినిమాలు ఆనందం పంచాయనే చెప్పాలి. ప్రభాస్ సోదరుడు ప్రమోద్, మిత్రుడు వంశీకృష్ణారెడ్డి యు.వి.క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ‘మిర్చి’ చిత్రం ద్వారా కొరటాల శివ దర్శకునిగా పరిచయమయ్యారు. ఈ సినిమా అదరహో అనే స్థాయిలో విజయం సాధించింది. ‘మిర్చి’ తరువాత ప్రభుదేవా తెరకెక్కించిన ‘యాక్షన్ జాక్సన్’ అనే హిందీ చిత్రంలో ప్రభాస్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. 2015లో తొలిసారి ‘బాహుబలి’గా జనం ముందు నిలిచారు ప్రభాస్. ఆ సినిమా అఖండవిజయంతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో స్టార్ అయిపోయారు. ఆ తరువాత వచ్చిన ‘బాహుబలి’ రెండో భాగంతో ఏకంగా ఇంటర్నేషనల్ మార్కెట్ లోనూ భళా అనిపించారు ప్రభాస్. ఈ రెండు సినిమాల తరువాత ప్రభాస్ సినిమా అంటే ‘ప్యాన్ ఇండియా మూవీ’ అనే మాట ఖాయమయింది. అందుకు తగ్గట్టుగానే ప్రభాస్ ముందడుగు వేస్తున్నారు. ‘సాహో’ చిత్రాన్ని ప్యాన్ ఇండియా మూవీగానే తెరకెక్కించారు.

రాబోయే ‘రాధే శ్యామ్’, ‘సలార్’, ‘ఆదిపురుష్’, నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న టైమ్ మిషన్ మూవీ అన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొనే రూపొందిస్తున్నారు. ‘రాధే శ్యామ్’ పీరియడ్ రొమాంటిక్ మూవీగా తెరకెక్కింది. ఈ చిత్రం జనవరి 14న సంక్రాంతి కానుకగా రానుంది. ఇక ‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ ‘సలార్’గా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 14న జనం ముందుకు రానుంది. రామాయణం ఆధారంగా ఓమ్ రౌత్ తెరకెక్కిస్తున్న ‘ఆదిపురుష్’లో ప్రభాస్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఇదయ్యాక ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించే టైమ్ మిషన్ మూవీలోనూ ప్రభాస్ నటించనున్నారు. ఇలా తన ప్రతి చిత్రంలోనూ వైవిధ్యం చూపిస్తూ ప్రభాస్ పయనం సాగించనున్నారు. ఇవి పూర్తయ్యాక ‘స్పిరిట్’ అనే చిత్రంలోనూ ప్రభాస్ నటిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రం దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ, జపనీస్, చైనీస్, కొరియన్ భాషల్లోనూ తెరకెక్కనున్నట్టు సమాచారం. ఏది ఏమైనా ప్రభాస్ కాల్ షీట్స్ మరో మూడేళ్ళ దాకా ఖాళీ లేవన్నది వాస్తవం. మరి ఈ చిత్రాలతో ప్రభాస్ ప్రేక్షకులను ఏ రీతిని ఆకట్టుకుంటారో చూడాలి.

Related Articles

Latest Articles