భలే బాపయ్య

(ఏప్రిల్ 24న కె.బాపయ్య బర్త్ డే)

‘డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్’ అనేది సినిమా వెలుగు చూసిన రోజుల నుంచీ ఉన్న నానుడి. అందువల్ల సినిమా దర్శకునికి ఎంతో క్రమశిక్షణ అవసరం అని పలువురు భావించేవారు. అలాంటివారు తాము దర్శకత్వం చేస్తున్న సమయంలో క్రమశిక్షణతో మెలగడగమే కాదు, కృషి, దీక్ష, పట్టుదలకు చిహ్నంగా ‘యూనిఫామ్’ కూడా ధరించేవారు. తెలుగునాట కొందరు దర్శకులు ఆ పంథాలో పయనించారు. ఎక్కువమంది దర్శకులు వైట్ అండ్ వైట్ వేసుకొనేవారు. కానీ, ‘ఖాకీ’ దుస్తులు అంటే క్రమశిక్షణకు, శ్రమకు ప్రతీక అని భావించిన వారు ఆ యూనిఫామ్ లో కనిపించేవారు. అలా కనిపించిన వారిలో కె.విశ్వనాథ్, కె.బాపయ్య ఉన్నారు. విశ్వనాథ్ కళాత్మక చిత్రాలతో సాగిపోతే, బాపయ్య కమర్షియల్ మూవీస్ తో కనికట్టు చేశారు. ఇంట గెలిచి రచ్చ గెలిచిన ఘనుడు మన కోవెలముడి బాపయ్య. తెలుగులోనే కాదు హిందీలోనూ విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించి భళా అనిపించారు బాపయ్య.

‘ద్రోహి’తో ఆరంభం…
ప్రముఖ దర్శక నిర్మాత కె.ఎస్.ప్రకాశరావు అన్న కుమారుడే బాపయ్య. చిన్నతనంలోనే కన్నవారిని కోల్పోయిన బాపయ్యకు బాబాయే నాన్నలా చూసుకున్నారు. తన కొడుకులు కె.రాఘవేంద్రరావు, కృష్ణమోహనరావు, కె.ఎస్. ప్రకాశ్ తో సమానంగా బాపయ్యను పెంచి పెద్ద చేశారు ప్రకాశరావు. తన పినతండ్రి వద్ద పలు చిత్రాలకు తమ్ముడు కె.రాఘవేంద్రరావుతో కలసి అసోసియేట్ గా పనిచేశారు బాపయ్య. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థలో పనిచేస్తున్న సమయంలోనే బాపయ్యలోని పట్టుదల చూసిన రామానాయుడు ఆయనను దర్శకునిగా పరిచయం చేశారు. కె.బాపయ్య దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం ‘ద్రోహి’ (1970). ఈ టైటిల్ కు బాపయ్యకు ఓ బంధం ఉంది. కె.ఎస్.ప్రకాశరావు నటించి, నిర్మించిన చిత్రం ‘ద్రోహి’ (1948). ఇందులో ఓ కీలకమైన పాత్ర పోషిస్తూనే, చిత్రానికి దర్శకత్వం వహించారు ఎల్.వి.ప్రసాద్. ఈ సినిమా ప్రముఖ సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావుకు తొలి చిత్రం కావడం విశేషం. ఇందులో నటించిన కోన ప్రభాకర రావు తరువాత రాజకీయాల్లో రాణించి, గవర్నర్ గానూ పనిచేశారు. అలా తన పినతండ్రి ‘ద్రోహి’ చిత్రం ఎంతోమందికి పేరు సంపాదించి పెట్టడంతో తన తొలి సినిమాకు కూడా అదే టైటిల్ ను నిర్ణయించుకున్నారు. జగ్గయ్య కథానాయకునిగా రూపొందిన ‘ద్రోహి’ అంతగా అలరించలేకపోయినా, దర్శకునిగా బాపయ్యకు మంచిపేరు సంపాదించి పెట్టింది.

ఆదుకున్న ‘ఎదురులేని మనిషి’!
‘ద్రోహి’ పరాజయంతో మరో మూడేళ్ళ వరకు బాపయ్య సినిమా రాలేదు. కృష్ణంరాజు హీరోగా ‘మేమూ మనుషులమే’ చిత్రం బాపయ్య రెండో చిత్రంగా వచ్చింది. అది కూడా అంతగా అలరించలేకపోయింది. అప్పటికే ‘ఊర్వశి’గా జేజేలు అందుకుంటున్న శారదతో అదే టైటిల్ గాపెట్టి మూడో సినిమా తీశారు బాపయ్య. తెలుగు చిత్రం ‘ఊర్వశి’లో హిందీ అగ్రశ్రేణి నటుడైన సంజీవ్ కుమార్ ను నటింప చేశారు. షరా మామూలే అన్నట్టు ఇదీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే దర్శకునిగానూ, పాటల చిత్రీకరణలోనూ బాపయ్యకు మంచి అభిరుచి ఉందన్న పేరు లభించింది. అదే సమయంలో యన్టీఆర్ చేతుల మీదుగా ‘వైజయంతీ మూవీస్’ను ఆరంభించిన అశ్వనీదత్ ఆయన హీరోగా తీసే చిత్రానికి కె.బాపయ్యను దర్శకునిగా ఎంచుకున్నారు. బాపయ్యతో తొలి సినిమా తీసిన డి.రామానాయుడు కూడా తన ‘సోగ్గాడు’ సినిమాకు మళ్ళీ బాపయ్యనే దర్శకునిగా నిర్ణయించారు. ఈ రెండు చిత్రాల షూటింగ్ దాదాపు ఒకేసారి ఆరంభమై ఒకేసారి పూర్తయ్యాయి. 1975 డిసెంబర్ 12న యన్టీఆర్ తో బాపయ్య తెరకెక్కించిన తొలి చిత్రం ‘ఎదురులేని మనిషి’ విడుదలయింది. దేవానంద్ హిందీ చిత్రం ‘జానీ మేరా నామ్’ ఆధారంగా ‘ఎదురులేని మనిషి’ రూపొందింది. ‘జానీ మేరా నామ్’లో దర్శకుడు విజయానంద్ పాటల చిత్రీకరణ గురించి, అప్పట్లో భలేగా చెప్పుకున్నారు. దానిని దృష్టిలో పెట్టుకొని యన్టీఆర్ ను కొత్తగా చూపించాలన్న తపనతో ఆయనకు వరైటీ కాస్ట్యూమ్స్ ధరింప చేశారు బాపయ్య. అలాగే పాటలలో కాసింత మసాలా కూడా దట్టించారు. ‘ఎదురులేని మనిషి’ ఆ రోజుల్లో వసూళ్ళ వర్షం కురిపించింది. ఈ సినిమా మొదటివారం కలెక్షన్స్ చూసి సినీజనం నివ్వెర పోయారు. ఈ చిత్రంతో ఒక్కసారిగా బాపయ్య పేరు చిత్రసీమలో మారుమోగి పోయింది. తరువాత వారానికే అంటే 1975 డిసెంబర్ 19న బాపయ్య, శోభన్ బాబు తొలి కాంబినేషన్ గా ‘సోగ్గాడు’ విడుదలయింది. ఆ సినిమా అనూహ్య విజయం సాధించింది. వరుసగా మూడు చిత్రాలతో అంతగా ఆకట్టుకోలేకపోయిన బాపయ్య, వారం గ్యాప్ లో రెండు బిగ్ హిట్స్ తో జనాన్ని మురిపించారు. దాంతో దర్శకునిగా కె.బాపయ్య పేరు మారు మోగి పోయింది.

రచ్చ గెలిచిన బాపయ్య…
బాపయ్య తెలుగులో యన్టీఆర్ తో ఆరు చిత్రాలు తెరకెక్కించగా, శోభన్ బాబుతో ఆరు, కృష్ణతో ఎనిమిది సినిమాలు రూపొందించారు. తన తొలి చిత్రంలో కీలక పాత్ర పోషించిన కృష్ణంరాజుతోనూ మూడు చిత్రాలు తెరకెక్కించారు. చిరంజీవి హీరోగా బాపయ్య దర్శకత్వంలో ‘ఇంటిగుట్టు, చట్టంతో పోరాటం’ రూపొందాయి. ఏయన్నార్ తో ‘గురుశిష్యులు’ ఒక్కటే తెరకెక్కించారు. అందులోనూ కృష్ణ మరో హీరోగా నటించారు. కృష్ణ, శోభన్ తో బాపయ్య రూపొందించిన మల్టీస్టారర్స్ ‘మండే గుండెలు, ముందడుగు’ రెండూ మంచి విజయాలను చూశాయి. తెలుగుతో పాటే హిందీ చిత్రసీమలోనూ బాపయ్య తనదైన బాణీ పలికించారు. బాపయ్యను హిందీ చిత్రసీమకు పరిచయం చేసింది ‘సోగ్గాడు’ నిర్మాత డి.రామానాయుడే కావడం విశేషం. ‘సోగ్గాడు’ రీమేక్ గా ‘దిల్ దార్’ తెరకెక్కించి హిందీ వారిని అలరించారు బాపయ్య. తెలుగులో కంటే హిందీలోనే బాపయ్యకు సక్సెస్ రేటు బాగుంది. తెలుగులో విజయం సాధించిన పలు చిత్రాలను బాపయ్య హిందీలో రీమేక్ చేయడం విశేషం. యన్టీఆర్ ‘పాతాళభైరవి’ (1951) అంటే హీరో కృష్ణకు ఎంతో అభిమానం. దాంతో తమ పద్మాలయా మూవీస్ పతాకంపై దానిని హిందీలో జితేంద్ర, జయప్రదతో రీమేక్ చేశారు. 1985లో రూపొందిన ఈ జానపద చిత్రానికి కూడా బాపయ్యనే దర్శకత్వం వహించారు. ఇందులోని పాటలు అప్పట్లో జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి.

రామారావుతో బంధం!
చిత్రమేంటంటే, బాపయ్యకు తొలి బిగ్ హిట్ యన్టీఆర్ ‘ఎదురులేని మనిషి’తో లభించింది. ఆయన తమ్ముడు కె.రాఘవేంద్రరావుకు కూడా యన్టీఆర్ తో తొలి చిత్రం ‘అడవిరాముడు’తోనే అపురూపమైన విజయం దక్కింది. యన్టీఆర్ తో బాపయ్య ఆరు చిత్రాలను రూపొందించారు. వాటిలో “సాహసవంతుడు, యుగపురుషుడు, అగ్గిరవ్వ, కలియుగ రాముడు, నా దేశం” సినిమాలు ఉన్నాయి. వీటిలోనూ రామారావును వరైటీగా చూపించాలని తపించారు బాపయ్య. ‘సాహసవంతుడు’ చిత్రం కోసం నేపాల్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. అలా విదేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా ‘సాహసవంతుడు’ నిలచింది. అంతేకాదు, ఈ సినిమాలో యన్టీఆర్ ఉపయోగించిన మోటార్ బైక్ గురించి ఆ రోజుల్లో విశేషంగా చర్చించుకున్నారు. ఇక ‘ఎదురులేని మనిషి’తీసిన అశ్వనీదత్ నిర్మాతగా ‘యుగపురుషుడు’ రూపొందింది. ఈ చిత్రంలో కొన్ని పాటలు సెన్సార్ కత్తెరకు గురికావడం ఆ రోజుల్లో విశేషంగా ముచ్చటించుకున్నారు. ఈ సినిమా కూడా భారీ వసూళ్ళు చూసింది. నటరత్న కెరీర్ లో తొలి ‘ఏ సర్టిఫికెట్’ మూవీగా నిలచిన చిత్రం ‘అగ్గిరవ్వ’. ఈ సినిమాను యన్టీఆర్ సొంతగా నిర్మించారు. ‘కలియుగ రాముడు’ మాత్రం ఏ రీతినా అలరించలేక పోయింది. యన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళే ముందు చివరగా నటించిన చిత్రం ‘నా దేశం’. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు ఎస్.వెంకటరత్నం, కె.దేవీవరప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు హిందీ ‘లావారిస్’ ఆధారం. ఆ చిత్రానికి కొన్ని మార్పులూ చేర్పులూ చేసి ‘నా దేశం’ రూపొందింది. యన్టీఆర్ ‘తెలుగుదేశం’ పార్టీ మేనిఫెస్టోలోని అంశాలు కొన్ని ఇందులో చక్కగా చొప్పించారు. ఈ సినిమా అప్పట్లో కోటి రూపాయలు వసూలు చేసి అబ్బురపరచింది.

మరో విశేషమేంటంటే, యన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేశాక, చివరగా నటించిన చిత్రం ‘నాదేశం’కు బాపయ్య దర్శకత్వం వహించారు. కాగా, రామారావు కెరీర్ లోనే చివరి సినిమాగా నిలచిన ‘మేజర్ చంద్రకాంత్’కు బాపయ్య తమ్ముడు కె.రాఘవేంద్రరావు దర్శకుడు. ఇక్కడ ఇంకో విశేషాన్నీ ముచ్చటించుకోవాలి. స్టార్ హీరోల బర్త్ డేస్ కు సినిమాలు విడుదల చేయడం అన్న సంప్రదాయం తెలుగునాట యన్టీఆర్ ‘విచిత్ర కుటుంబం’తోనే ఆరంభమయింది. ఈ సినిమా 1969 మే 28న యన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్ గా నిలచింది. ఈ చిత్రానికి కె.ఎస్.ప్రకాశరావు దర్శకుడు కావడం విశేషం. ఇలా రామారావుతో ‘కోవెలముడి’ కుటుంబ బంధం ప్రత్యేకతను సంతరించుకోవడం విశేషం!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-