నయనానందం… నయనతార అభినయం…

(నవంబర్ 18న నయనతార పుట్టినరోజు)
నయనతార అందంలో అయస్కాంతముంది. అభినయంలో అంతకు మించిన ఆకర్షణ ఉంది. ఏ తీరుగ చూసినా నయనతార అందాల అభినయం నయనానందం కలిగిస్తుంది. నయనతారను ఈ తరం వారి సీతమ్మ అని చెప్పవచ్చు. అలాగే నిర్మాతల పాలిటి లక్ష్మీ అని భావించవచ్చు. సౌత్ లో నంబర్ వన్ నాయికగా తన తీరే వేరంటూ సాగుతోంది నయన్. తాను నటించిన సినిమాల ప్రచారపర్వంలో పాలు పంచుకోవడానికి నయన్ అంత సుముఖత చూపించరు. ఆమె పెట్టే షరతులను సైతం అంగీకరిస్తూ సినీజనం నయన్ డేట్స్ కోసం పరుగులు తీస్తున్నారు.

నయనతార అసలు పేరు డయానా మరియమ్ కురియన్. 1984 నవంబర్ 18న బెంగళూరులో జన్మించారామె. మళయాళ కుటుంబానికి చెందినవారు. ఆమె తండ్రి ఎయిర్ ఫోర్స్ లో పనిచేయడం వల్ల పలు చోట్ల చదువు సాగింది. ఉత్తరాదిన చదువుకున్న నయన్, తమ కేరళలోని మర్తోమా కాలేజ్ లో ఇంగ్లిష్ లిటరేచర్ లో డిగ్రీ పూర్తి చేశారు. తరువాత నటనపై ఆసక్తితో సాగిన నయన్ ‘మనస్సినక్కరే’ అనే మళయాళ చిత్రంద్వారా తెరకు పరిచయమయ్యారు. తరువాత తమిళంలో ‘అయ్యా’ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా ‘పెద్దాయన’ పేరుతో తెలుగులో అనువాదమయింది. ఆ పై వచ్చిన అనువాద చిత్రం ‘చంద్రముఖి’లో నయన్ అందం తెలుగువారికి బంధాలు వేసింది. తెలుగులో వెంకటేశ్ తో వి.వి.వినాయక్ తెరకెక్కించిన ‘లక్ష్మీ’ చిత్రంలో తొలిసారి నటించారు. ఆ తరువాత నాగార్జున ‘డాన్’లోనూ, వెంకటేశ్ ‘తులసి’లోనూ నటించేసి అలరించారు నయన్. బాలకృష్ణతో నయనతార నటించిన ‘సింహా’ అనూహ్య విజయం సాధించింది. తరువాత బాలయ్యతో నయన్ నటించిన “శ్రీరామరాజ్యం, జై సింహా” చిత్రాలు సైతం జనాన్ని అలరించాయి. ‘శ్రీరామరాజ్యం’లో సీతమ్మగా నటించిన నయనతారకు ఉత్తమ నటిగా నంది అవార్డు లభించింది. బాబాయిలతోనూ, అబ్బాయిలతోనూ సందడి చేసిన నాయికగా నయన్ కు పేరుంది. వెంకటేశ్ సరసన నటించిన నయన్, తరువాత ఆయన అన్న కొడుకు రానాతోనూ ‘కృష్ణం వందే జగద్గురుమ్’లో నటించి మురిపించారు. ఇక బాలయ్య సరసన భళా అనిపించిన నయన్, జూనియర్ యన్టీఆర్ తోనూ ‘అదుర్స్’లో అదరహో అనేలా నటించారు.

టాప్ స్టార్స్ తోనూ, యంగ్ స్టార్స్ తోనూ నయనతార తనదైన పంథాలో అలరించారు. ఇక తమిళనాట యాక్షన్ డ్రామాస్ లోనూ నటించేసి ఆకట్టుకుంటున్నారు. ఓ నాటి విజయశాంతిలా నయన్ కూడా యాక్షన్ ఎపిసోడ్స్ లో నటించేస్తున్నారు. ఆమెపై రూపొందే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్, తమిళ స్టార్ హీరోస్ స్థాయిలో వసూళ్ళు రాబట్టడం విశేషం. అందువల్లే నయన్ ఎలాంటి కండిషన్స్ పెట్టినా, నిర్మాతలు ఆమె డేట్స్ కోసం పరుగులు తీస్తూనే ఉన్నారు. చిరంజీవితో ‘సైరా…నరసింహారెడ్డి’లో సిద్ధమ్మగా నటించిన నయనతార, మరోమారు ఆయనతో ‘గాడ్ ఫాదర్’లో నటించబోతున్నారు. ఈ సినిమాతో పాటు మరో ఐదు తమిళ చిత్రాలలో నయన్ నటిస్తున్నారు. రాబోయే చిత్రాలతోనూ అలరించే ప్రయత్నంలో ఉన్నారామె.

నయనతార నటనాప్రస్థానంతో పాటు ఆమె ప్రేమాయణాలు కూడా జనాన్ని భలేగా ఆకర్షించాయి. తొలుత శింబు, తరువాత ప్రభుదేవాతో ప్రేమయాత్రలు చేసిన నయన్, ప్రస్తుతం దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ప్రణయకలాపాలు సాగిస్తోంది. త్వరలోనే వీరిద్దరూ ఒకటి కానున్నారని తెలుస్తోంది. ఇప్పటికయితే ఎటు చూసినా తన మ్యాజిక్ తో సాగుతున్నారు నయన్. మరి పెళ్ళయిన తరువాత కూడా నయన్ ఈ మ్యాజిక్ ప్రదర్శిస్తారో లేదో చూడాలి.

Related Articles

Latest Articles