మరో 20 ఏళ్లు టీఆర్ఎస్‌దే అధికారం.. కేసీఆరే సీఎం..!

మరో ఇరవై ఏళ్లు టీఆర్ఎస్‌ పార్టీ అధికారంలో ఉంటుంది.. కేసీఆరే ముఖ్యమంత్రిగా వుంటారు అని స్పష్టం చేశారు టీఆర్ఎస్‌ సీనియర్ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి.. తాజాగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. కిషన్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.. బీజేపీ వాళ్లు పగటి కలలు కంటున్నారు.. అధికారంలోకి వస్తాం అంటూ బీజేపీ నేతలు భ్రమల్లో ఉన్నారని.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎక్కడైనా తెలంగాణలో అమలు అవుతున్న ఒక్క పథకమైన ఉందా? చెప్పాలని డిమాండ్ చేశారు. పేదల కోసం ఏం చేశారో బీజేపీ వాళ్లు చెప్పాలి..? అన్ని అంశాల్లో బీజేపీ నేతలు విఫలం అయ్యారని దుయ్యబట్టారు.. ఇక, ఈటల రాజేందర్ అసైన్డ్‌ భూములను తీసుకున్నానని ఒప్పుకున్నారు.. అలాంటి వ్యక్తిని ఎలా పార్టీలో చేర్చుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇక, తోడేళ్లలాగా బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు తెలంగాణపై దాడి చేస్తున్నారు.. అనైతిక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు గుత్తా సుఖేందర్‌రెడ్డి.. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు అబద్ధాలతో కాలం వెళ్లిబుచ్చుతున్నారు. బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అప్పులు కుప్పగా మార్చిందన్న ఆయన.. పార్టీల భాష హుందాగా ఉండాలి.. కానీ, జుగుప్సాకరంగా మాట్లాడొద్దని హితవుపలికారు. కాంగ్రెస్ వాళ్లు కూడా దళితులకు చేసింది ఏమీ లేదన్న గుత్తా.. ఇప్పుడు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నూరు శాతం తెలంగాణలో సామాజిక న్యాయం అమలు అవుతుందన్నారు. మతోన్మాదంతో బీజేపీ వాళ్లు పబ్బం గడుపుకుంటున్నారు.. శాంతియుతంగా ఉన్న తెలంగాణలోరాజకీయ లబ్ధి పొందాలని చూసే మీకు భంగపాటు తప్పదన్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పప్పులు ఉడకవు.. మరో ఇరవై ఏళ్లు టీఆర్ఎస్‌ పార్టీ అధికారంలో ఉంటుంది.. కేసీఆరే సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు. మరోవైపు.. కొద్దిమంది కాంట్రాక్టర్లు చెబుతున్నారు.. నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చందాలు ఇవ్వమని అడుగుతున్నారని.. మరి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హైదరాబాద్ ను కూడా అమ్ముకుంటారని ఎద్దేవా చేశారు. ఇలాంటి వాళ్ల మాటలకు ప్రజలు మోసపోవద్దని సూచించిన సుఖేందర్‌రెడ్డి.. కాంగ్రెస్, బీజేపీ నేతల విమర్శలను తిప్పికొట్టాలని.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పాడి పంటలతో తులతూగుతుందన్నారు. హుజురాబాద్ లో ముమ్మాటికి గులాబీ జెండానే ఎగురుతుంది.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీనే ప్రజలు ఆదరిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Related Articles

Latest Articles