నరసరావుపేటలో వైసీపీ నేతకు కలిసొచ్చిన వెంచర్లు…!

జిల్లా కేంద్రం వస్తుందన్న ప్రచారంతో అక్కడ రియల్‌ బూమ్‌ అందుకుంది. అదికాస్తా అధికారపార్టీ నేతకు వరంగా మారింది. ఆ ప్రాంతంలో ఏం చెయ్యాలన్నా ఆయన అనుమతి ఉండాల్సిందే. ఎవరు వెంచర్ వేసినా కమీషన్ ఇవ్వాల్సిందే. కప్పం కట్టందే పని జరగదు. ఇదే ఆ జిల్లాలోని అధికారపార్టీలో చర్చగా మారింది.

నరసరావుపేట చుట్టూ 10 కి.మీ. పరిధిలో వెంచర్లు!

నరసరావుపేట జిల్లా కేంద్రం అవుతుందనే ప్రచారం ఊపందుకోవడంతో ఇక్కడి భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. రియల్‌ బూమ్‌ అందుకుంది. నరసరావుపేట చుట్టుపక్కల 10 కిలోమీటర్ల దూరం వరకు వెంచర్లు వేశారు. పాలపాడు, సత్తెనపల్లి, వినుకొండ, చిలకలూరిపేట, కోటప్పకొండ రోడ్లల్లో వందల ఎకరాల్లో రియల్ వెంచర్లు వెలిశాయి.

అధికార పార్టీ నేతకు కమీషన్‌ ఇస్తేనే వెంచర్లకు గ్రీన్‌ సిగ్నల్‌!

అధికారపార్టీకి చెందిన ఓ నేత కన్ను ఈ వెంచర్లపై పడింది. ఎవరైనా కొత్తగా వెంచర్లు వెయ్యాలంటే ఆయన్ని కలవాల్సిందే. కమీషన్ రూపంలో ఎంతో కొంత చెల్లిస్తేనే ప్లాట్లు అమ్ముకునేందుకు అనుమతి వస్తుందట. లేదంటే ప్లాట్‌ కాదు కదా.. గజం కూడా అమ్ముకోలేరట రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు. అందుకే గుట్టుచప్పుడు కాకుండా ఆ నేతకు కమీషన్‌ ఇచ్చి వ్యాపారం చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది.

ఆ నేతకు కమీషన్‌ ఇస్తే అధికారులూ పట్టించుకోరట!

సాగుభూమిని వెంచర్లగా మార్చాలంటే ల్యాండ్‌ కన్వర్షన్‌ చేయించుకోవాలి. ఆపై DTCP నిబంధనలు పాటించాలి. రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. సగానికిపైగా వెంచర్లలో ఇలాంటి నిబంధనలు ఎవరూ పాటించడం లేదన్నది ఇక్కడి ఓపెన్‌ సీక్రెట్. వైసీపీ నేతకు కమీషన్‌ ఇస్తే.. వెంచర్లు సక్రమంగా ఉన్నాయో లేవో అధికారులు పట్టించుకోరట. గతంలో ఒకరు అనుమతులు లేకుండా వెంచర్లు వేసి ప్లాట్లు అమ్ముతుండగా.. కన్నెర్ర చేశారట. వెంటనే సదరు భూముల దగ్గర వెంచర్లకు అనుమతులు లేవని బోర్డులు పెట్టారు. రెండు రోజుల తర్వాత ఆ బోర్డులు గాయబ్‌. కమీషన్లు చేతికి అందాక బోర్డులు తీసేశారట.

సొంత పార్టీ నేతలు కూడా ఆయనకు కమీషన్‌ ఇవ్వాల్సిందే!
కమీషన్‌ డబ్బులతో భారీగా భూములు కొన్న అధికారపార్టీ నేత!

నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలో వెంచర్లు వేసేవారు నిబంధనలు పాటించరనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ అధికారపార్టీకి చెందిన మరో నేత కూడా భారీగా రియల్ వ్యాపారం చేస్తున్నారు. ఆయన వేసే వెంచర్లకు కూడా ఎటువంటి అనుమతులు ఉండవు. అయినా ఎవరూ అడగరు. ఆయన కూడా ఆ నేతకు కమీషన్‌ ఇచ్చారట. జిల్లా కేంద్రం పేరుతో పెరిగిన రియల్ బూమ్ ఆ నేతకు భారీగా ఆదాయం తెచ్చిపెడుతోందని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతుంది. అలా వచ్చిన కమీషన్ డబ్బులతోనే ఆయన భారీగా భూములు కొనుగోలు చేసినట్టు సమాచారం.

నరసరావుపేట చుట్టుపక్కల 200లకుపైగా వెంచర్లు!
ఓ కీలక నేత పేరు చెప్పి డబ్బులు వసూళ్లు!

నరసరావుపేట చుట్టుపక్కల దాదాపు రెండు వందలకు పైగా రియల్ వెంచర్లు వెలిశాయి. వీటి ద్వారా ఊహకందనంత ఆదాయం ఆ నేతకు వచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. లింగంగుంట్ల అగ్రహారం భూముల్లో కూడా కొందరు వ్యాపారులు అనధికారికంగా వెంచర్లు వేసి ప్లాట్లుగా అమ్మేస్తున్నారు. వీరినుంచి కూడా ఆ నేతకు భారీగా కమీషన్ అందినట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో అధికారంలో ఉన్న నాయకులు ఒక్కో పనికి ఒక్కో రేటు పెట్టి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలున్నాయి. అదేపని ఇప్పుడు వైసీపీ నేత కంటిన్యూ చేస్తున్నారట. ఓ కీలక నేత పేరు చెప్పి కమీషన్లు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సదరు కీలక నేతకు కమీషన్ల విషయం తెలుసో లేదో కానీ.. ఆయన పేరు మాత్రం మరో నాయకుడు భారీగానే క్యాష్‌ చేసుకుంటున్నారు. ఇదే ఇప్పుడు గుంటూరు జిల్లా వైసీపీ నేతల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-