క్రిప్టో కరెన్సీ సర్వీస్ ప్రొవైడర్లపై జీఎస్టీ దాడులు

దేశవ్యాప్తంగా ఉన్న పలు క్రిప్టోకరెన్సీ సర్వీస్‌ ప్రొవైడర్ల కార్యాలయాల్లో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున పన్ను ఎగవేసినట్లు వచ్చిన సమాచారంతో.. రైడ్స్‌ చేపట్టినట్లు తెలుస్తోంది.క్రిప్టోకరెన్సీ సర్వీస్ ప్రొవైడర్ల కార్యాలయాలపై జీఎస్టీ అధికారుల దాడులు సంచలనం రేపాయి. ముంబైలోని ప్రముఖ క్రిప్టోకరెన్సీ ఏజెన్సీ వజీరిక్స్‌ ఆఫీసులో జీఎస్టీ అధికారులు తనిఖీలు చేశారు. దాదాపు 40.5 కోట్ల పన్ను ఎగవేసినట్లు గుర్తించారు. పన్ను ఎగవేత, వడ్డీ, జరిమానాతో కలిపి 49.20 కోట్లు వసూలు చేశారు. ఈ ఎక్స్ఛేంజీని నిర్వహిస్తున్న జన్మాయ్‌ ల్యాబ్స్‌, బైనాన్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కంపెనీ లిమిటెడ్‌ వ్యాపార కార్యకలాపాల్ని తనిఖీ చేస్తున్న సమయంలో ఈ అవకతవకలు వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు….spot

వజీరిక్స్‌ ఎక్స్ఛేంజీ ద్వారా రూపాయి లేదా WRX అనే క్రిప్టోకరెన్సీ ద్వారా ట్రేడర్‌ లావాదేవీలు నిర్వహించవచ్చు. WRXను వజీరిక్స్‌ నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎక్స్ఛేంజీ వాళ్లు.. ఇటు విక్రయదారుడితో పాటు కొనుగోలు చేస్తున్న వారి దగ్గరి నుంచి కూడా కమీషన్‌ వసూలు చేస్తున్నారు. కానీ.. ఇరు వర్గాలకూ కమీషన్‌ రేటు మాత్రం భిన్నంగా నిర్ణయించారు. రూపాయల్లో చేసే లావాదేవీలపై 0.2 శాతం.. WRXపై చేసే ట్రాన్సాక్షన్స్‌పై 0.1 శాతం కమీషన్‌ వసూలు చేస్తున్నారు.

అయితే ఎక్స్ఛేంజీ నిర్వాహకులు కేవలం రూపాయల్లో చేసే లావాదేవీలపై వసూలు చేస్తున్న కమీషన్‌పై మాత్రమే జీఎస్టీ చెల్లిస్తున్నారు. ఇలాంటి లావాదేవీలు 18 శాతం జీఎస్టీ శ్లాబ్‌ పరిధిలోకి వస్తాయి. దీంతో WRX లావాదేవీలపై వసూలు చేసిన కమీషన్‌పై చెల్లించాల్సిన జీఎస్టీని ఎగవేసినట్లు గుర్తించారు. మొత్తం వడ్డీ, జరిమానాతో కలిపి 49.20 కోట్లు వసూలు చేశారు. ఇలా ఈ-కామర్స్‌, ఆన్‌లైన్‌ గేమింగ్‌, నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్స్‌ సహా ఇతర రంగాల్లో పన్ను ఎగవేతకు అవకాశం ఉన్న అన్ని రంగాల కార్యాలయాలపై సోదాలు కొనసాగుతున్నాయని జీఎస్టీ అధికారులు తెలిపారు. మరోవైపు విదేశీ కంపెనీల నియంత్రణలో ఉన్న కొన్ని మొబైల్‌ తయారీ సంస్థల్లో నిర్వహించిన ఐటీ సోదాల్లో.. దాదాపు 6 వేల 500 కోట్లకుపైగా లెక్కల్లో చూపని ఆదాయాన్ని గుర్తించినట్లు సీబీడీటీ తెలిపింది.

Related Articles

Latest Articles