వికారాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌లో వర్గపోరులో కొత్త పోకడలు..!

ఒక ఎమ్మెల్సీ.. ఇద్దరు ఎమ్మెల్యేలు. అంతా ఒకే పార్టీ. సంస్థాగత కమిటీల కూర్పులో కలిసి సాగుతున్నారా అంటే.. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్‌..! అనుచరులను అందలం ఎక్కించేందుకు ఏకంగా బలప్రదర్శన మొదలెట్టేసి.. గులాబీ శిబిరంలో గుబులు రేపుతున్నారు. ఇంతకీ ఎవరా నాయకులు? ఏంటా కథా?

వికారాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌లో వర్గపోరులో కొత్త పోకడలు..!

ఏదైనా పదవొచ్చినా.. పెద్ద నాయకుడు పార్టీలో చేరినా.. ఈ స్థాయిలో టీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ దగ్గర సందడి కామన్‌. కానీ.. ఒక జిల్లా అధ్యక్ష పదవి కోసం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ శ్రేణుల బలప్రదర్శన ఇది. ఈ శక్తి ప్రదర్శన మూలాలు సిటీకి ఆనుకుని ఉండే వికారాబాద్‌ జిల్లాలో ఉన్నాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి ఒకరికి.. ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌లు మరొకరికి మద్దతుగా నిలవడంతో ఆ ప్రకంపనలు ఇలా హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీస్‌ వరకు వచ్చాయి.

నరసింహారెడ్డికి తాండూరు, వికారాబాద్‌ ఎమ్మెల్యేల మద్దతు?
కొండల్‌రెడ్డికి మాజీమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అండ?

టీఆర్ఎస్‌ వికారాబాద్‌ జిల్లా అధ్యక్ష పదవికి పార్టీ నేతలు నరసింహారెడ్డి, కొండల్‌ రెడ్డిలు పోటీపడుతున్నారు. వీరిద్దరూ తమకున్న పరిచయాల ద్వారా లాబీయింగ్‌ చేసుకుంటే స్థానికంగానే చర్చ జరిగేది. కానీ.. నరసింహారెడ్డి, కొండల్‌రెడ్డిల వెనక పెద్ద నాయకులే ఉండటంతో రచ్చ రచ్చ అవుతోంది. నరసింహారెడ్డికి వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి మద్దతుగా ఉన్నారట. ఇక కొండల్‌రెడ్డికి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సాయం పడుతున్నట్టు సమాచారం. అనుచరుడిని టీఆర్ఎస్‌ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడిని చేసేందుకు ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. అస్సలు వెనక్కి తగ్గకుండా.. అవకాశం చిక్కితే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుని.. మందీమార్బలంతో శక్తిని చాటుతున్నారు నాయకులు.

తెలంగాణ భవన్‌లో నేతల బలప్రదర్శన..!

తన బలం వికారాబాద్‌కే పరిమితమైతే బాగోదని అనుకున్నారో ఏమో.. నరసింహారెడ్డి ప్రెజర్‌ పాలిటిక్స్‌ను హైదరాబాద్‌కు షిఫ్ట్‌ చేశారు. ఇతర పార్టీ కార్యకర్తలను టీఆర్ఎస్‌లో చేర్పించే నెపంతో తెలంగాణ భవన్‌ దగ్గర ఓ రేంజ్‌లో హడావిడి చేశారు. తెలంగాణ భవన్‌కు దారితీసే ప్రధాన రహదారికి ఇరువైపులా భారీగా కటౌట్లు.. ఫ్లెక్సీలు నింపేశారు నరసింహారెడ్డి. ఇంకెవరినో టీఆర్‌ఎస్‌లో చేరుస్తూ ఈ స్థాయిలో కలరింగ్‌ ఇవ్వొచ్చా అని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కునే పరిస్థితి. నరసింహారెడ్డిని బలపరుస్తున్న నాయకులు తెలంగాణ భవన్‌కు వచ్చారు కానీ.. పట్నం మహేందర్‌రెడ్డి కనిపించలేదు. దాంతో పార్టీలో కాసేపు చర్చ అటు కూడా మళ్లింది. నేతల బలప్రదర్శనతోపాటు వికారాబాద్‌ జిల్లా టీఆర్ఎస్‌లోని వర్గపోరును కూడా పరిచయం చేశారని గుసగుసలు వినిపించాయి. మొత్తానికి ఒక జిల్లా అధ్యక్ష పదవి కోసం ఎమ్మెల్యేలు.. నాయకులు ఈస్థాయిలో లాబీయింగ్‌ చేయడం గులాబీ శిబిరంలో పెద్ద చర్చే జరుగుతోంది.

-Advertisement-వికారాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌లో వర్గపోరులో కొత్త పోకడలు..!

Related Articles

Latest Articles