కాంగ్రెస్ లో ‘కీచులాట’ కంటిన్యూ.. ఇలాగైతే?

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. అయితే ఆ పార్టీ నేతల స్వయంకృతాపరాధమే తెలంగాణలో కాంగ్రెస్ రెండుసార్లు అధికారానికి దూరమవడానికి కారణమనే వాదనలున్నాయి. తెలంగాణలో బలమైన శక్తిగా ఉన్న కాంగ్రెస్ ను ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నా నేతల వైఖరే ప్రస్తుత పరిస్థితికి కారణమనే ప్రచారం జరుగుతోంది. ‘కాంగ్రెస్ పార్టీని ఎవరు ఓడించలేరు.. కాంగ్రెస్ వాదులు తప్ప’ అన్న నానుడిని తెలంగాణ నేతలు అక్షరాల నిజం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ రెండుసార్లు వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. సమైక్యాంధ్రులను కాదని నాటి యూపీఏ సర్కారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది. ఏపీలో పార్టీని ఫణంగా పెట్టి మరీ తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చింది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంతా భావించారు. అయితే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఊహించని ఫలితం వచ్చింది. అటు ఏపీ కాంగ్రెస్ కు డిపాజిట్లు గల్లంతుకాగా.. ఇటూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిపక్షానికే పరిమితమైంది.

నాటి నుంచి కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతూ వస్తోంది. కాంగ్రెస్ లోని వర్గపోరు కారణంగా ముఖ్య నేతలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఆ తర్వాత జరిగిన 2018 ముందస్తు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ చేజేతులా టీఆర్ఎస్ కు అధికారాన్ని కట్టబెట్టింది. కాంగ్రెస్ నేతల అనైక్యతకు తోడు ఆపార్టీ బద్ధశత్రువైన టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఆ ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఇక ఆ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ నేతలు సైతం ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు.

దీంతో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కు ఎమ్మెల్యేలను సప్లై చేసే పార్టీగా ముద్రవేసుకుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పెద్దగా పోరాటాలు చేసిన దాఖాల్లేవు. దీంతో ప్రతీ ఎన్నికల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ కు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఇదే సమయంలో బీజేపీ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారింది. ఇక కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో లేకపోవడం తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోయింది. అయితే తెలంగాణలో పార్టీని గాడినపడితే అధికారంలోకి వచ్చే అవకాశం మొండుగా ఉందని అధిష్టానం భావిస్తోంది.

వచ్చే పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధిష్టానం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగానే తెలంగాణలోనూ నాయకత్వాన్ని మార్చివేసింది. కొత్త టీపీసీసీగా రేవంత్ రెడ్డిని నియమించింది. రేవంత్ నాయకత్వంలోనే వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ వెళ్లనుంది. రేవంత్ సైతం కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపే కార్యక్రమాలను చేస్తున్నారు. దళిత, గిరిజన దండోరా పేరుతో ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కోనేందుకు పక్కా వ్యూహాలతో ముందుకెళుతున్నారు.

అయితే రేవంత్ నాయకత్వాన్ని కాంగ్రెస్ సీనియర్లు అంగీకరించడం లేదు. దీంతో కాంగ్రెస్ మళ్లీ రెండు గ్రూపులుగా విడిపోయింది. రేవంత్ తన వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ సీనియర్లు మండిపడుతున్నారు. కనీసం తమకు సమాచారం ఇవ్వలేదని అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. రేవంత్ కు అధిష్టానం అండగా ఉంటున్నా పార్టీ నేతలు సహకరించడం లేదు. దీంతో కాంగ్రెస్ ఒక అడుగు ముందుకు వెళ్తే కాంగ్రెస్ వాదులు నాలుగు అడుగులు వెనక్కి లాగుతున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి తదితర నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ లో హీరోయిజం నడువదంటూ హాట్ కామెంట్స్ చేశారు.

ఈక్రమంలోనే అధిష్టానం రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసింది. అయితే రేవంత్ నాయకత్వాన్ని పార్టీలోని మెజార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలోని నేతల తీరు చూస్తుంటే మరోసారి కాంగ్రెస్ అధికారానికి దూరం అవడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది. దీంతో తెలంగాణలో ‘నేత’ మారినా కాంగ్రెస్ రాత మారలేదు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇకనైనా నేతలంతా ఒక్కటి తాటిపైకి వస్తేనే కాంగ్రెస్ కు వచ్చే ఎన్నికల్లో ఏదైనా ఛాన్స్ ఉంటుందని.. లేకుంటే ముచ్చటగా మూడోసారి ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి ఉంటుందనే కామెంట్స్ విన్పిస్తున్నాయి.

-Advertisement-కాంగ్రెస్ లో ‘కీచులాట’ కంటిన్యూ.. ఇలాగైతే?

Related Articles

Latest Articles