ఎమ్మెల్యే రోజాకు సొంతపార్టీలోనే సెగ..!

ఫైర్‌బ్రాండ్ నేతకు సొంతపార్టీలో సెగ తప్పడం లేదా? పరిషత్‌ ఎన్నికల ఫలితాల తర్వాత పాత కథే పునరావృతమైందా? సయోధ్యకు వెళ్లినా.. స్వపక్షంలోని ప్రత్యర్థులు సమరానికి సై అంటున్నారా? పార్టీ పెద్దలకు మరోసారి మొరపెట్టుకున్నారా? మరి.. ఈసారైనా ఫైర్‌బ్రాండ్‌ బాధను పట్టించుకుంటారా.. లేదా?

నగరిలో రోజాకు ఇబ్బందులు పెరుగుతున్నాయా?

వైసీపీలో ఫైర్‌బ్రాండ్‌ ఎమ్మెల్యే రోజాకు సొంత నియోజకవర్గం నగరిలో వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఎన్నికల సమయంలో మొదలైన విభేదాలు.. పంచాయతీ, మున్సిపల్‌ పోరులోనూ కొనసాగాయి. ఇప్పుడు నిండ్ర MPP సీటు విషయంలో వైసీపీలోని తన వ్యతిరేక వర్గంతో పోరు సాగిస్తున్నారు రోజా. రాజకీయంగా తనను తొక్కేయాలని కొందరు చూస్తున్నారని.. ఒంటరిని చేస్తున్నారని వాపోతున్నారామె. ఈ బాధ రోజు రోజుకీ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు.

అప్పట్లో వ్యతిరేకవర్గాలకు రోజా వార్నింగ్‌..!

నగరి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ భర్త కేజీ కుమార్‌.. ఎమ్మెల్యే రోజాకు కంట్లో నలుసులా మారారు. కుమార్‌ అండ్‌ కోను ఉద్దేశించి వాయిస్‌ మెసేజ్‌ ద్వారా సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు ఎమ్మెల్యే. కుమార్‌ బృందానికి సహకరించే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని ప్రకటించారు కూడా. అంతకుముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి. ఎన్నికలైనా.. ప్రారంభోత్సవాలైనా ప్రత్యర్థివర్గం నుంచి చికాకులు తప్పడం లేదు.

దమ్ముంటే తమపై నెగ్గాలని సొంత పార్టీ నుంచే రోజాకు సవాళ్లు..!

ఇప్పుడు నిండ్ర ఎంపీపీ ఎంపిక విషయంలో రోజా వ్యతిరేకవర్గం మరింత స్పీడైంది. డోస్‌ పెంచి ఎమ్మెల్యేకు సవాల్‌ చేసే వరకు వెళ్లింది. రోజాను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి తప్పుచేశామని స్థానిక పార్టీ నాయకుడు, ఇటీవలే శ్రీశైలం ఆలయ బోర్డు ఛైర్మన్‌ అయిన రెడ్డివారి చక్రపాణిరెడ్డి మండిపడ్డారు. దమ్ముంటే తనపై ఎమ్మెల్యేగా నెగ్గాలని రోజాకు ఆయన సవాల్‌ విసిరారు. ఇప్పటికే కేజీ కుమార్‌, అమ్ములు వంటి నేతల పెచీలతో ఇబ్బంది పడుతున్న రోజాకు.. ఇప్పుడు చక్రపాణి రెడ్డి వారికి తోడయ్యారు.

మంత్రి పెద్దిరెడ్డికి గోడు వెళ్లబోసుకున్న రోజా..!

ఈ వివాదం హీట్‌ మీద ఉన్న సమయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్లారు ఎమ్మెల్యే రోజా. లోకల్‌ లీడర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిండ్ర ఎంపీపీగా దీపాకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారట. ఇదే సమయంలో చక్రపాణిరెడ్డి సైతం పెద్దిరెడ్డితో భేటీ అయ్యారట. పరిషత్‌ ఎన్నికల్లో తాను గెలిపించిన వారు ఎమ్మెల్యే వర్గానికి ఎలా మద్దతిస్తారు? ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారట. ఎవరి వాదన ఎలా ఉన్నా.. ఈ ఎపిసోడ్‌లో విజయం తనదే అన్న ధీమాతో ఉన్నారట రోజా. కాకపోతే.. నగరిలో తనకు వ్యతిరేకంగా పార్టీ నేతలే ప్రకటనలు చేస్తుండటంతో.. అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారట రోజా. మరి.. తాజ రగడలో ఎమ్మెల్యే రోజా పైచెయ్యి సాధిస్తారో లేదో చూడాలి.

-Advertisement-ఎమ్మెల్యే రోజాకు సొంతపార్టీలోనే సెగ..!

Related Articles

Latest Articles